Boora Narsaiah Goud Says CM KCR Is A Good Script Writer: తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక మంచి స్క్రిప్ట్ రైటర్ అని, మహబూబ్ నగర్‌లో ఆయన ఆరోపణల సభ పెట్టారని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. తాను విస్మరించిన వాగ్ధానాలు, చేసిన తప్పులన్నింటినీ కేంద్రంపై మోపారని ఆరోపించారు. కృష్ణ నది జలాల్లో 299 టీఎంసీలకు ఒప్పందంపై సీఎం సంతకం పెట్టిన మాట వాస్తవం కాదా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. దిండి ప్రాజెక్ట్‌కు ఎక్కడి నుండి నీళ్ళు తీసుకుంటారో డీపీఆర్‌లో పొందుపర్చారా? అని నిలదీశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలపై ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి పంటకు కాళేశ్వరం ద్వారా ఒక ఎకరానికి కూడా నీరు ఇస్తున్నట్లు చెప్పలేదని పేర్కొన్నారు.
అటు.. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను చాలా వేగంగా పూర్తి చేసిందని, అందుకే సీఎం కేసీఆర్ సహకరించారని బూర నర్సయ్య పేర్కొన్నారు. ఏపీ సీఎంతో కేసీఆర్ కుమ్మక్కై.. తెలంగాణకి అన్యాయం చేశారని ఆరోపణలు చేశారు. ‘‘కేసీఆర్.. నీకు ఆత్మ విమర్శ ఉండదా’’ అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రధాని మోడీ ఎప్పుడైనా అన్నారా? అని నిలదీశారు. తెలంగాణలో స్కాం లేని స్కీమ్ ఉండదని.. టీఆర్ఎస్ ఎమ్మేల్యేలు ఒక్కొక్కరు వంద కోట్లకు తక్కువ ఉండరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ తరహాలో మద్యంపై నిషేదం పెట్టి, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే దమ్ము టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ విసిరారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉచిత ఎరువులు, డబుల్ బెడ్‌రూం ఇల్లు వంటివి ఇవ్వడానికి కేంద్రం ఏనాడైనా అడ్డుపడిందా? అని బూర నర్సయ్య ప్రశ్నించారు.
అంతకుముందు కూడా.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుందని నర్సయ్య ఆరోపించారు. కేంద్రంలో ఉన్న సహకారం వల్లే తాను అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. అభివృద్ధి విషయంలో బీజేపీకి భేదాలు లేవని, అందరిని సమానంగా చూస్తారని తెలిపారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రాలేదంటే, అది రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్లనేనని పేర్కొన్నారు. తాను టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చింది తన భవిష్యత్తు కోసం కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసమని వెల్లడించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని.. బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు.