తెలంగాణ వచ్చి ఇప్పటికి 8 ఏళ్లయింది. 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. అయితే అంతకన్నా ముందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేదా అని ప్రశ్న ఇవాళ తలెత్తుతోంది. దీనికి కారణం ఈరోజు హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. దీనికీ దానికీ సంబంధం ఏంటి అనుకుంటున్నారా?. అదే మనం ఇప్పుడు చర్చించుకోబోయే అంశం. 18 ఏళ్ల కిందట కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగాయి. అప్పుడేమో హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని కావటం గమనార్హం.
2004 జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. అప్పుడు బీజేపీ ఒక మాట చెప్పింది. నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) తిరిగి అధికారంలోకి వస్తే 100 రోజుల్లోపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేస్తుందని హామీ ఇచ్చింది. కానీ కమలదళం అనుకున్నట్లు అవేవీ జరగలేదు. అయితే కాషాయం పార్టీ ఆ స్థితి నుంచి ప్రస్తుతం తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్పుకునే స్థాయికి ఎదిగింది. ఈ 18 ఏళ్లలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవేంటంటే..
వాస్తవానికి 2004 అక్టోబర్‌లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎన్డీఏ మాత్రం ముందస్తు ఎన్నికలకు పోయింది. 13వ లోక్‌సభను ఐదారు నెలల ముందుగానే రద్దు చేసింది. దీంతో 2004 ఏప్రిల్ 20-మే 12 మధ్యకాలంలో 14వ లోక్‌సభకు ఎలక్షన్లు జరిగాయి. అనూహ్యంగా ఎన్డీఏ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్(యూపీఏ) గెలిచింది. అదే సంవత్సరం హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఒక ర్యాలీలో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ మాట్లాడుతూ ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ వచ్చి ఉండేదని చెప్పారు. అయితే అప్పుడు ఎన్డీఏ అంచనాలు ఎందుకు తప్పాయి? ఆ కూటమి ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోయింది? అనేది చూద్దాం.
అప్పట్లో బీజేపీకి మన తెలుగువాడు, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జాతీయ అధ్యక్షుడు. ఆ పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. టీడీపీ అధ్యక్షుడు, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ రోజుల్లో కేంద్రంలో చక్రాలు తిప్పుతున్నట్లు చెప్పుకునేవారు. ఇద్దరు తెలుగు నాయుళ్ల చేతిలో ఆయా పార్టీల పగ్గాలు ఉన్నాయి కాబట్టి నాడు ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న ఇమేజ్‌ను మరోసారి క్యాస్ట్ (ఓటు) చేసుకోవాలని ఆశించారు. అంతకు ఐదేళ్ల ముందు కార్గిల్ యుద్ధంలో ఇండియా గెలిచిన నేపథ్యంలో 1999లో జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో ఎన్డీఏ విజయం సాధించింది.
2004లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కావటానికి కొద్ది రోజుల ముందు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన 12వ సార్క్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని వాజ్‌పేయి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలపటాన్ని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంది. దాంతోపాటు పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను అదే ఏడాది తిరిగి ప్రారంభించటానికి కూడా వాజ్‌పేయి పాటుపడ్డారనే అంశాన్నీ బీజేపీ 2004 జాతీయ కార్యవర్గ సమావేశాల్లో హైలైట్ చేశారు. దేశవిదేశాల్లో ఎన్డీఏ సర్కారుకి, దానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకి మంచి పేరు ఉందనే అంచనాలతో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ అవన్నీ భ్రమలేనని తర్వాత తేలిపోయింది.
సీన్ కట్ చేస్తే.. ఈ 2022 జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా అదే బీజేపీ తెలంగాణలో మొదటిసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతోందనే సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలనే గట్టి పట్టుదలను ప్రదర్శిస్తోంది. మరి ఇదైనా నెరవేరుతుందా?. కారు పార్టీ వేగానికి బ్రేకులు వేస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి. 2004లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడూ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడూ ఉంది. అదొక్కటే కామన్ పాయింట్.