Off The Record: వైసీపీలో అధికారికంగా ఎలాంటి నంబర్స్ లేకున్నా… నంబర్ టూ అని చెప్పుకునే విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నానని, తాను మాత్రం ఇక వ్యవసాయం చేసుకుంటానంటూ కొత్త పలుకులు పలికారు. ఓహో… అలాగా…. అని అంతా అనుకుంటున్న టైంలోనే… కాకినాడ పోర్ట్ కేసు విచారణకు అటెండ్ అయిన సాయిరెడ్డి…. ముందు చెప్పిన దానికి భిన్నంగా మాట్లాడారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలోనూ లేనంటూనే… జగన్ సహా వైసీపీ కీలక నేతలందరినీ టార్గెట్ చేస్తూ తాను చెయ్యాల్సిన ఆరోపణలు చేసేశారు. అది విన్నవారంతా… అరె… సాయిరెడ్డి ఏంటి? జగన్‌ను అలా అన్నారేంటంటూ… తమలో తామే ప్రశ్నించుకున్నారట. అదే సమయంలో ఎవరో మాట్లాడించి ఉంటారన్నది కూడా కొందరి డౌట్. ఆ ఎవరో…… ఎవరంటే… కొందరి ఆన్సర్ కాస్త డిఫరెంట్‌గా వస్తోందట. విజయసాయి ఫైర్ వెనుక ఫ్లవర్ ఉండి ఉండవచ్చనే వారు సైతం పెరుగుతున్నారట. ఆయన వైసీపీతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయడంతో…. ఆ రాజ్యసభ సీటుకు ఎన్నిక అనివార్యమైంది. దాంతో ఆయన కమలం గూటికి చేరి ఆ పార్టీ తరపున తిరిగి ఇదే సీటు తీసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో..
బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న విజయసాయిరెడ్డి ఆ పార్టీలోని వెళ్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాషాయ దళం ఆయనకు గవర్నర్ గిరీ ఆఫర్ చేసిందని, రేపో మాపో ప్రకటనే తరువాయి అన్నంతగా కొన్నాళ్ళ పాటు వార్తలు గుప్పు గుప్పుమన్నాయి. కానీ… ఇంత వరకూ అలాంటి ప్రతిపాదనేదీ బయటకు రాలేదు. ఈ పరిస్థితుల్లో…. సాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీటు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రాబోతోంది. కూటమి పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకే వెళ్ళే అవకాశం ఉండటంతో… ఆ పార్టీకి సంబంధించిన అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకి ఇవ్వవచ్చని కూడా కొన్ని సర్కిల్స్‌లో చెప్పుకున్నారు. కానీ… తాజాగా మరో వెర్షన్ వినిపిస్తూ…. రాజకీయం బాబూ… రాజకీయం…. ఎప్పుడు ఏదైనా జరగవచ్చన్న టాక్ నడుస్తోంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని, రాజీనామా చేసిన సీటును తిరిగి ఆయనకే ఇచ్చి కమలం కోటాలో రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నెల 4తో పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత రాజ్యసభ ఎన్నిక నోటిఫికేషన్ ఉండొచ్చంటున్నారు. అయితే… వైసీపీలో ఉన్నప్పుడు జగన్ తర్వాత టీడీపీని, చంద్రబాబును ఆ స్థాయిలో టార్గెట్ చేసింది సాయిరెడ్డే కాబట్టి…తమ మద్దతుతో తిరిగి రాజ్యసభకు పంపడానికి ఆ పార్టీ ఒప్పుకుంటుందా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి ఏమో…. అంటూ కొందరు సర్ది చెప్పుకుంటున్నారట. బయటి నుంచి చూస్తున్న మనకే ఆ డౌట్ వచ్చినప్పుడు.. ఆ ప్రాసెస్‌లో ఉన్న మాజీ ఎంపీకి రాకుండా ఉంటుందా? బహుశా అందుకే ఆయన జగన్ మీద వైసీపీ మీద ఆ స్థాయిలో విమర్శలు చేసి ఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ.
అయితే సాయిరెడ్డిని ట్రంప్ కార్డులా వాడుకుని… ఏపీలో లిక్కర్ స్కాం, కాకినాడ పోర్టు సహా పలు అంశాల్లో వైసీపీ వేలితో వారి కన్నే పొడవచ్చన్న కూటమి ఎత్తుగడ కూడా ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంపీ పదవికి రాజీనామా చేసిన సందర్భంలో కూడా సాయిరెడ్డి తనకు చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవని.. రాజకీయ విమర్శలు తప్ప తమ మధ్య ఏమీ లేదన్నారు. పవన్ కళ్యాణ్ తనకు స్నేహితుడని చెప్పుకున్నారు. దీంతో… ఆయన ముందు నుంచి ఫ్లవర్ పార్టీ వైపు వెళ్ళే ఉద్దేశ్యంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.. మరోవైపు విజయసాయిరెడ్డికి గనుక బీజేపీ తరపున పదవి ఇస్తే… వైసీపీ నుంచి వలసలు పెరిగి ఏపీలో ఆ పార్టీ బలపడే అవకాశం ఉందన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. మొదటి నుంచి ఉత్తరాంధ్రపై కన్నేసిన బీజేపీ… అక్కడ తమ పార్టీ బలోపేతానికి చాలా లెక్కలు వేసింది. కానీ… వర్కౌట్ అవకపోవడంతో… అక్కడి రాజకీయాలపై పట్టున్న సాయిరెడ్డిని రంగంలోకి దించాలని భావిస్తుండవచ్చన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. సాయిరెడ్డి బీజేపీలో చేరడం ఇక లాంఛనమేనన్న అంచనాలు పెరుగుతున్న టైంలో… ఆయనవైపు నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రావడం లేదు. కానీ… ఉరుములేని పిడుగులా ఏదో ఒకరోజు ఈ వార్త బయటికి వస్తుందని మాత్రం అనుకుంటున్నారు పరిశీలకులు.