తెలంగాణలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. భాగ్యలక్ష్మీ ఆలయంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్థానిక నేత రషీద్ ఖాన్, చార్మినార్ వద్ద నమాజ్ చేసుకునేందుకు అనుమతి కోసం సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. భాగ్యలక్ష్మీ దేవాలయంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భాగ్యలక్ష్మీ అమ్మవారు మాకు ఇష్ట దైవం అని..దేవాలయం గురించి ఎంత దూరమైనా వెళ్తామని.. మేం చార్మినార్ తొలగించాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదని అన్నారు. ఓల్డ్ సిటీ డెవలప్ కాకపోవడానికి ఎవర కారణం అని..ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ ఓవైసీలు ఆస్తులు సంపాదించుకుంటున్నారని విమర్శించారు.
తాజాగా భాగ్యలక్ష్మీ దేవాలయ అంశంపై కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క స్పందించారు. భాగ్యలక్ష్మీ టెంపుల్ బండి సంజయ్ ది ఒక్కడిదేనా..? అని ప్రశ్నించారు. అమ్మవారిని నమ్మేవారందరిదీ భాగ్యలక్ష్మీ టెంపుల్ అని అన్నారు. అమ్మవారిని నమ్మే అందరినీ బయటకు పంపి.. ఆయన ఒక్కడే గుత్తేదారి అనుకుంటున్నారని విమర్శించారు. మతాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని అనుకుంటున్నారని ఆరోపించారు. ఎవరో చేసిన పనికి పార్టీ బాధ్యత అవుతుందా..? అంటూ ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి కాంగ్రెస్ ఏదైనా మాట్లాడిందా..? అని అడిగారు బట్టి. జనం మీద మనువాదం రుద్దాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు.
మరోవైపు ఈ వివాదంపై బండి సంజయ్ కు వార్నింగ్ ఇచ్చారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. జంట నగరాల్లో బీజేపీ మత చిచ్చు రగల్చాలి అని చూస్తోందని అది వారి భ్రమే అని అన్నారు. చార్మినార్ ఒక మతానికి ధర్మానికి సంబంధించింది కాదు ఇది హైదరాబాద్ ప్రజలది అని అన్నారు. నేను ఒంటరిగా చార్మినార్ వస్తా.. దమ్ముంటే రా తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. ఎక్కువ చేస్తే బండి మిగలదు, గుండు మిగలదని వార్నింగ్ ఇచ్చారు.