రాష్ట్రంలో రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులకు పెద్దపీట అంటున్న కేసీఆర్ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు ఆరోపణలు చేశారు. ‘రాములు అనే ముదిరాజ్ రైతు అప్పుల పాలు అయ్యి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కందుకూరు మండలం అన్నోజిగూడా గ్రామంలో 54 మంది రైతులకు ఫార్మాసిటీ లో భూములు గుంజుకున్నారు. కానీ ఒక్కరికి డబ్బులు ఇవ్వలేదు.
రాములు అనే ముదిరాజ్ రైతుకు ఇందిరమ్మ భూమి ఇస్తే ఈ కేసీఆర్ ప్రభుత్వం భూమి గుంజుకుంది. డబ్బులు ఇవ్వకపోతే అప్పులపాలై అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇందిరమ్మ హయాంలో భూమి ఇచ్చారు. 8 లక్షల రూపాయలకు కొని కోట్ల రూపాయలకు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. రైతులు పండించిన పంటలు కొనలేక పోతే కామారెడ్డి జిల్లాలో బీరయ్య పంట కుప్ప మీదనే పడి చనిపోయాడు. విపరీతమైన గుండె కొతతో బీరయ్య చనిపోయాడు.
బీరయ్య, రాములు మరణాలు ప్రభుత్వ హత్యలు.. ప్రభుత్వం సకాలంలో పంటలు కొన్నా… భూ సేకరణ డబ్బులు ఇచ్చినా ఈ రెండు ప్రాణాలు బతికేవి’ అంటూ ఆయన ప్రభుత్వంపైన విమర్శలు చేశారు. కలెక్టర్ సహజ మరణం అంటున్నారు.. తప్పుడు నివేదికలు ఇస్తున్న కలెక్టర్ పైన చర్యలు తీసుకోవాలని, ఈటెల రాజేందర్.. నీ కుల సోదరుడు ఆత్మహత్య చేసుకున్నారు.. వెళ్లి కలిసి ఆయన కుటుంబానికి సహాయం చెయ్యి.. నా వంతు చిన్న సహాయంగా రాములు కుటుంబానికి 50 వేల సహాయం చేసాను. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పేదలకు అండగా ఉండి ధైర్యం చెప్పాలి’ అంటూ వ్యాఖ్యానించారు.