సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలోని గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్దరాత్రి పోలీసులు పేదల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. చిన్నా పెద్దా, మహిళలనే తేడా లేకుండా దౌర్జన్యం చేసి కాళ్లు చేతులు విరగ్గొట్టడం, తలలు పగలకొట్టడం దారుణమన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం అన్యాయమని అన్నారు. ఉన్నట్లుండి అర్దరాత్రి అకస్మాత్తుగా దాడులు చేయడం ఆటవికమని ఆయన మండిపడ్డారు.
రజకార్ల పాలనలో, బ్రిటీష్ పాలనలో కూడా ఇట్లాంటి అరాచకాలు చేయలేదేమో… ఇకనైనా కేసీఆర్ ఫాంహౌజ్ నుండి పాలించడం మానుకోవాలని హితవుపలికారు. మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. అసలు అర్ధరాత్రి వెళ్లి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమిటో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పూర్తిగా ఆదుకున్న తర్వాతే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని, అప్పటి వరకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. బాధితుల పక్షాన బీజేపీ పోరాడుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల పై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం.
ఇల్లు భూములు కోల్పోయిన నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేయడం అన్యాయం.
భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బిజెపి పోరాటం ఆగదు. pic.twitter.com/vLCwaol7R3
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 13, 2022
కాగా.. తీవ్ర ఉద్రిక్తతల మధ్య గౌరవెల్లి భూ నిర్వాసితుల పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు- ప్రొక్లైయినర్లు అడ్డుపెట్టారు. దీంతో పోలీసులు- భూనిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘర్షణలో నిర్వాసితులను పోలీసులు చితకొడ్తున్నారు. లాఠీ చార్జ్ తో నిర్వాసితుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లాఠీ దెబ్బలను సైతం తట్టుకోని హుస్నాబాద్ RDO ఆఫీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిర్వాసితుల్ని ఎక్కడికక్కడ అడ్డుకోని అరెస్ట్ చేస్తున్నారు. దీంతో హుస్నాబాద్ టౌన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గౌరవెల్లి భూ నిర్వాహితుల ర్యాలీని అడ్డుకోవటంపై మండిపడుతున్నారు.
Jubilee Hills Case: అంతా నీ వల్లే.. కాదు నువ్వే కారణం.. తన్నుకున్న మైనర్లు..!