Bandi Sanjay Wrote Letter To CM KCR Over Junior Panchayat Secretaries Issues: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే రెగ్యులరైజ్ చేసి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆ లేఖలో కోరారు. రాష్ట్రంలోని 9350 మంది జూనియర్ పంచాయితీ కార్యదర్శులు గత 6 రోజులుగా ఆందోళన చేస్తున్నారని.. వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ అత్యంత సమంజసమైనదని అన్నారు. తెలంగాణలో ఇకపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అనే పదమే ఉండదని అసెంబ్లీ సాక్షిగా మీరే ప్రకటించారంటూ గుర్తు చేశారు. నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవం నాడు.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయన్నారు. కానీ.. పోటీ పరీక్షల్లో రాసి, అర్హత సాధించి, ఉద్యోగంలో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పదవీకాలం పూర్తై నాలుగేళ్లు దాటినా.. వారిని ఇంతవరకు రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయమన్నారు.
Money Found On Tree: మామిడి చెట్టుపై నోట్ల కట్టలు.. కోటి రూపాయలను జప్తు చేసిన ఐటీ
మూడేళ్ల ప్రొబేషనరీ కాలాన్ని నాలుగేళ్లకు పొడిగించినప్పటికీ, అన్నింటినీ భరిస్తూ ఆ కార్యదర్శులు విధులు నిర్వర్తించారని.. గడువు దాటినా నేటికీ వారిని రెగ్యులరైజ్ చేయకపోవడం దారుణమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, గ్రామాల అభివృద్ధి వంటి అంశాల్లో తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు అవార్డులు వస్తున్నాయని జబ్బలు కొట్టుకుంటున్న ప్రభుత్వం.. అందులో కీలక పాత్ర పోషిస్తున్న ప్రొబేషనరీ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోకపోవడం అన్యాయమని మండిపడ్డారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులైన నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, కిచెన్ గార్డెన్ లతోపాటు పల్లె ప్రగతి, హరితహారం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల అమలులో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పాత్ర క్రియాశీలమైదన్నారు. రోజుకు 12 గంటలకుపైగా పని చేస్తున్న వారితో వెట్టిచాకిరి చేయించుకున్నారే తప్ప.. నేటికీ ఉద్యోగ భద్రత కల్పించలేదని పేర్కొన్నారు. పైగా.. రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులకు, వీరికి మధ్య వైరం పెట్టేలా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపణలు చేశారు.
School Shooting: స్కూల్‌లో విద్యార్థి కాల్పులు.. 8 మంది పిల్లలు, గార్డు హతం
ఇప్పటికే ప్రభుత్వ నిర్వాకం వల్ల గ్రామానికి వెన్నుముకలైన సర్పంచుల్లో కొందరు చేసిన పనులకు బిల్లులు రాక అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారని బండి సంజయ్ తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్యదర్శులు సమ్మె చేసే దుస్థితి రావడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని చెప్పారు. మీరు (సీఎంని ఉద్దేశించి) మాత్రమే శ్వేతసౌధంలో సేద తీరితే సరిపోదని.. ప్రజల, ఉద్యోగుల బాగోగులను పట్టించుకోండని కోరారు. ఇకనైనా మొద్దునిద్ర వీడి, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ సమాజం క్షమించదని హెచ్చరించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయా ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని.. లేనిపక్షంలో తాము ఆయా ఉద్యోగులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పుకొచ్చారు.