BJP MP Bandi Sanjay Completed Two Years as Telangana BJP Chief Post.
బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆశీర్వచన సభ నిర్వహించారు. కాగా ఆయనను వేములవాడ రాజన్న ఆలయం నుంచి వచ్చిన పురోహితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉండి బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలు బీజేపీయే ప్రత్యామ్నాయమని నమ్ముతున్నారని, కేసీఆర్ తీరుకు నిరసనగా ప్రజల బాధలు తెలుసుకునేందుకు ఎన్నో పోరాటాలు చేశామన్నారు.
ఆ సందర్భంగా కార్యకర్తలు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారన్నారు. నాలాంటి సామాన్యుడికి ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించారు. ఇంత పెద్ద పదవి ఇస్తారని అసలు భావించలేదన్నారు. ఇటీవల ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్ స్థానాలను క్రమంగా కైవసం చేసుకున్నామన్నారు. ప్రజలంతా డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని కోరుకుంటున్నారని, కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి కేంద్రాన్ని బదనాం చేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ కేసీఆర్ ప్రధానికి లేఖ రాయలేదు.. కానీ ఆయన వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాడాని తెలిసి కొత్త జిమ్మిక్కులకు తెరదీశారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీనే రాష్ట్రంలో కూడా అధికారం ఇవ్వడానికి సిద్ధమయ్యారని, ప్రజల ప్రతి సమస్యపై పోరాటాలు చేశామన్నారు. కేసీఆర్ హామీలను ఎండగట్టేందుకు ఎప్పటికప్పుడు నిరసనలు చేశామని, ఇది చివరి ఉద్యమం కావాలి.. మళ్ళీ పోరాటాలు చేసే ఓపిక ప్రజలకు రాకూడదన్నారు.