చరిత్రను కనుమరుగు చేస్తున్నారంటూ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తన పాదయాత్రలో భాగంగా రాందాస్ చౌరస్తాలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంలో సెప్టెంబర్ 17ను నిర్వహించాలని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించిన ఆయన.. నిజాం కుటుంబానికి భయపడి కేసీఆర్ విమోచన దినోత్సవం జరపడం లేదని ఆరోపించారు.. ఇక, ఈ నెల 17వ తేదీన నిర్మల్‌లో జరగనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు.. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ వాళ్లతో కేసీఆర్ చెప్పిస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్.. ఓల్డ్ సిటీలో పోటీ చేసే దమ్ము టీఆర్ఎస్ కు లేదన్న ఆయన.. బీజేపీ ఎమ్మెల్యేలు ఎప్పటికీ టీఆర్ఎస్‌లోకి వెళ్లరని.. కాంగ్రెస్ వాళ్లే వెళ్తారని వెళ్తారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితుల్లో లేరన్న బండి.. ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రికి ఉద్యోగాలు, నోటిఫికేషన్లు గుర్తుకు వస్తాయన్నారు.. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు.. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీసిన బండి సంజయ్.. మళ్లీ కొత్తగా పేదవారి బంధు అంటున్నారంటూ ఎద్దేవా చేశారు.