పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందే ముగిశాయి. పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఆగస్టు 12న సమావేశాలు ముగియాల్సి ఉన్నప్పటికీ.. అంతకన్నా ముందే ఈ రోజే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
సభ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని సభ్యులకు సూచించడంతో పాటు తన అనుభవాలను పంచుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రాజ్యసభలో ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ హోదాలో చివరి ప్రసంగం చేశారు.
వెనుకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని, జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.
రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల మధ్య డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో మరో ముగ్గురు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. సభను, సభాపతి అధికారాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సభా వెల్‌లోకి ప్రవేశించి, నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారని డిప్యూటీ చైర్మన్ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.