Venkaiah Naidu: సభ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని సభ్యులకు సూచించడంతో పాటు తన అనుభవాలను పంచుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రాజ్యసభలో ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ హోదాలో చివరి ప్రసంగం చేశారు. సభ కార్యకలపాల్ని ప్రజలందరూ గమనిస్తూ ఉంటారని తెలిపారు. సభ గౌరవం కాపాడటంలో భాగంగా కొన్నిసార్లు కఠినంగా ఉండాలన్నారు. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అమలులో నిక్కచ్చిగా వ్యవహరించాలని సభ్యులకు సూచించారు. ఏ పార్టీకి చెందిన సభ్యులపైనా తప్పుడు అభిప్రాయాలు ఉండవన్నారు. నాయకులకు శత్రువులు ఎవరూ ఉండరు.. ప్రత్యర్థులే ఉంటారన్నారు. తనను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు. తాను అడగకుండానే పార్టీ తనకు ఉప రాష్ట్రపతి పదవిని కట్టబెట్టింది. ఆ రోజు పార్టీని వీడాల్సి వచ్చినందుకు కన్నీళ్లు వచ్చాయన్నారు. బాధతోనే బీజేపీకి రాజీనామా చేశానని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకుని, భావోద్వేగానికి లోనయ్యారు.
Venkaiah Naidu: విభజన హామీల అమలు.. వెంకయ్యనాయుడు కీలక సూచనలు
సభ సజావుగా నడపడంలో తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చానని ఆయన అన్నారు. సభ్యులు సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు. ప్రజాస్వామ్యం గౌరవం మరింత పెరిగేలా నడుచుకోవాలని సూచించారు. సభలో మాట్లాడే భాషకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తొలి ప్రాధాన్యం మాతృభాషకు, తర్వాత సోదర భాషకు ఇవ్వాలన్నారు. సభలో మాతృభాషలో మాట్లాడటాన్ని ప్రోత్సహించానని అని చెప్పారు. సభలో అన్ని పార్టీల సభ్యులకూ సమాన అవకాశాలు ఇచ్చానని ఈ సందర్భంగా వెల్లడించారు. సభ్యులు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి.. సభ విలువను పరిరక్షించాలన్నారు. పెద్దలు అందించిన ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. పార్లమెంటు కార్యకలాపాలు ఎప్పుడూ సజావుగా సాగాలని… సభలో చర్చలు పక్కదోవపట్టకుండా చూడాలన్నారు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగాలని కోరుకుంటున్నట్లు అంటూ వెంకయ్యనాయుడు ఉద్వేగానికి లోనయ్యారు.