తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ, వైఎస్సార్టీపీ తప్పుకున్నాయి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దని చెప్పడంతో కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర అసంతృప్తికి లోనై ఆ తర్వాత బీఆర్ఎస్లోకి అనుచరులతో చేరిన విషయం తెలిసిందే.
తాను గజ్వేల్ వస్తున్నా అని తెలవగానే కేసీఆర్ కామారెడ్డి పోయారని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక (మం) దుద్దెడలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తన భార్య అన్నీ అమ్ముకుందాం, అవసరం అయితే మళ్ళీ కొంగు నడుంకి కట్టి పనిచేస్తా.. నువ్వు మాత్రం కేసీఆర్ మీద కొట్లాట ఆపవద్దు అని చెప్పిందని ఈటల తెలిపారు.
రాష్ట్రంలో పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. పలు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రాష్ట్రంలో పింక్ వేవ్ తప్ప మరో వేవ్ లేనే లేదని ఆమె వ్యాఖ్యానించారు.
కాచిగూడ లింగంపల్లి రాఘవేంద్ర స్వామి ఆలయంలో పూజ నిర్వహించిన అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి అంబర్ పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాలేర్ వెంకటేష్ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికి హాని చేయడని ఆయన అన్నారు. కొంత మంది ఓ వ్యక్తిని రెచ్చగొట్టి, బాగా తాగించి కత్తితో దాడి చేయించారని ఆయన ఆరోపించారు. గంట లేట్ అయితే ప్రభాకర్ రెడ్డి ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు.
సంక్రాంతి రాగానే గంగిరెద్దు వాళ్ళు వచ్చినట్టు సంగారెడ్డికి కొత్త వ్యక్తులు వస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏవేవో హామీలు ఇస్తారని.. మాయమాటలు నమ్మొద్దన్నారు. సంగారెడ్డిలోని గంజి మైదాన్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
జోగు రామన్న నీతిమంతుడైతే కేసీఆర్ ఎందుకు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మిమ్మల్ని మోసం చేసిన జోగు రామన్నను ఓడించాలని ప్రజలకు ఆయన సూచించారు.