Revanth Reddy: ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ మాట్లాడారు. పదేళ్లలో పోడు భూముల సమస్య తీర్చలేదు.. లంబాడాలను ఆదుకోలేదని ఆయన విమర్శించారు. మంచిప్ప ప్రాజెక్టును పూర్తిచేయలేదన్న ఆయన.. వందరోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి పదేళ్లయినా హామీ నెరవేర్చలేదన్నారు. కవితను ఇక్కడి రైతాంగం బండకేసి కొట్టారని.. అందుకే అప్పటి నుంచి కేసీఆర్ ఈ ప్రాంత రైతులపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు. బాజిరెడ్డి గోవర్ధన్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాశారన్నారు. 50మంది ఆర్టీసీ కార్మికులను పొట్టనబెట్టుకున్నారని ఆయన విమర్శించారు.
Also Read: KLR: గడీల పాలన వద్దు… అందరి పాలన కావాలి: కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌కు పదవి పోతుందన్న భయంపట్టుకుందని.. మతి తప్పి మాట్లాడుతున్నారో.. మందేసి మాట్లాడుతున్నారో తెలియదన్నారు. కాంగ్రెస్‌కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్ మాట్లాడుతున్నారని… నిజామాబాద్ సాక్షిగా కేసీఆర్ కు చెబుతున్నా.. 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గకుండా ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తారని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. 80కి ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. బక్కోన్ని బక్కోన్ని అని చెప్పుకునే కేసీఆర్… లక్ష కోట్లు దిగమింగాడు..10వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని రేవంత్ ఆరోపణలు చేశారు. అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
నిజామాబాద్ జిల్లా రైతులు ఆత్మ గౌరవంతో బ్రతుకుతారని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నుంచి అధిష్టానం నన్ను బరిలోకి దించింది. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎటువైపు ఉంటారో.. ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. జిల్లాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ ను గెలిపించాలి.శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును చూపించి మేం ఓట్లు అడుగుతాం.. కాళేశ్వరం మేడిగడ్డను చూపించి కేసీఆర్ ఓట్లు అడగగలవా… దమ్ముంటే కేసీఆర్ నా సవాల్ ను స్వీకరించాలి. కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నీ దొరల రాజ్యాన్ని, దొంగల రాజ్యాన్ని పొలిమేరల వరకు తరిమి బొందపెడతాం. బరాబర్ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం.” అని రేవంత్ అన్నారు.