ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. రెండు, మూడు రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు చేపడుతోంది. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ చేసిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
వరద, పంట నష్టంపై బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం ప్యాకేజీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలో మునిగిన ఇళ్లకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ జీవో జారీ చేసింది.
విజయవాడలోని అశోక్నగర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగి ఏడాదిన్నర చిన్నారి మృతిచెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ పడమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొదట ఆ ప్రాంతంలో రవాణా మార్గాలు మెరుగవ్వాలనేది ఆర్థిక శాస్త్ర ప్రాథమిక సూత్రం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని రోడ్లు బాగుపడాలని, గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు నాణ్యతతో ఉండాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పల్లెదారులకు అవసరమైన నిధులను ఏషియన్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సమకూరుస్తుందన్నారు.
అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 10 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించామన్నారు.
వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఉదయభాను పంపారు. తాను వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్నానని.. వైఎస్సార్, జగన్కు ముఖ్య అనుచరుడిగా కలిసి నడిచినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులను చూశానని. 2019, 2024 మధ్య పనిచేసిన ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని చూడలేదు.. చూడబోనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకుగానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. అలా అతిథులకు రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
విశాఖ ఉక్కుని శాశ్వతంగా లాభాల బాట పట్టేలా కార్యాచరణ ప్రణాళిక చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు రాష్ట్రానికి సెంటిమెంటు అని, ప్రైవేటు పరం కానీయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పట్టడానికి గత ప్రభుత్వ వైఖరి కూడా ఓ కారణమని విమర్శించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేజేషన్ కాకుండా.. గతంలో ఆపింది తానేనని సీఎం తెలిపారు.