దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాయి. తమ అగ్రనేతలనే లక్ష్యంగా చేసుకుంటారా అంటూ రగిలిపోతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు, కాంగ్రెస్ ఆందోళనలతో దేశమంతా అట్టుడికిపోయింది. రాహుల్ గాంధీ సుదీర్ఘ ఈడీ విచారణ…కొన్ని రోజుల్లో సోనియా గాంధీకి సైతం తప్పని దర్యాప్తు సంస్థల ప్రశ్నలు…ఈ పరిణామాలు, కాంగ్రెస్ నాయకుల్లో ఒక్కసారిగా కదలిక తెచ్చాయా? నిస్తేజంగా వున్న క్యాడర్ లో కదన కుతూహలం పెంచాయా?
జాతీయ రాజకీయాల్లో ఎన్నడూలేనంతగా కుదుపు. దేశవ్యాప్తంగా పొలిటికల్ ప్రకంపనల దుమారం. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు రోడ్డుపైకి వచ్చి నిరసనల హోరు. కాంగ్రెస్ నిరసనలతో ఢిల్లీ నుంచి గల్లీ గల్లీ వరకు దద్దరిల్లిన సంధర్భం….స్పాట్ మాంటేజ్…తెలంగాణ, ఏపీతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ ఆందోళనలు
రాజకీయ కక్ష సాధింపులని కాంగ్రెస్ నిరసనలు
శతాధిక పార్టీలో ఇంత సమరోత్సాహానికి, ఆగ్రహావేశాలకు కారణం….కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహల్ గాంధీని ఈడీ విచారణ చెయ్యడం…గంటలకొద్దీ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చెయ్యడం…మోడీ జేబులోని ఈడీ, కావాలనే కాంగ్రెస్ అగ్రనేతలను వేటాడుతోందంటూ, నిరసనలతో కదంతొక్కారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు….విజువల్స్ మాంటేజ్..రాహుల్
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు కొత్తదేం కాదు. దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రత్యర్థులకు ఆయుధమే. ఎప్పటికప్పుడు బీజేపీ తిరగదోడుతున్న కేసే. స్వాతంత్ర్యోద్యమంలో, ప్రజా గొంతుకగా పోరాడుతోందని నాడు బ్రిటీష్ పాలకులు నేషనల్ హెరాల్డ్ ను నిషేధించారు. స్వాతంత్ర్యం తర్వాత అనేక మలుపులు, కుదుపులకు గురై మూతపడిన నేషనల్ హెరాల్డ్ పత్రిక, ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులను పీడిస్తోంది.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ కొన్ని రోజుల క్రితమే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం సోనియా అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న రాహుల్, అక్కడి నుంచి ఈడీ ఆఫీసుకు పయనమయ్యారు. చాలాసేపు రాహుల్ ను విచారించింది ఈడీ. అనేక ప్రశ్నలను రాహుల్ ముందు వుంచింది. నేషనల్ హెరాల్డ్ తో మీకున్న వ్యాపార సంబంధాలేంటి ? ఏజేఎల్ లో మీ స్థానం ఏంటి ? యంగ్ ఇండియా సంస్థలో మీ పాత్ర ఏంటి ?
యంగ్ ఇండియాలో మీ పేరున షేర్లు ఉన్నాయా ? షేర్ హోల్డర్లతో మీరు ఎప్పుడు సమావేశం అయ్యారు ? కాంగ్రెస్..యంగ్ ఇండియాకు రుణం ఇవ్వడానికి కారణమేంటి ?
దివాళ తీసిన నేషనల్ హెరాల్డ్ ను మళ్లీ ఎందుకు నడపాలనుకున్నారు ? ఇలా అనేక ప్రశ్నలను రాహుల్ ను అడిగిందట ఈడీ. వీటికి సమాధానంగా తనకేంద తెలీదంటూ రాహుల్ చెప్పినట్టు తెలుస్తోంది.
మూసేసిన కేసును తిరిగి ఓపెన్ చెయ్యడంలో మతలబు ఏంటంటూ, ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాహుల్ విచారణ పూర్తయ్యే వరకు, పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామాలు, మండలాలు, పట్టణాలు, నగరాలు, ఇలా ప్రతిచోటా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి పాదయాత్రగా ఈడీ ఆఫీస్‌కు వెళ్లారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ఢిల్లీ దద్దరిల్లిపోయింది..
నేషనల్ హెరాల్డ్ కు అండగా నిలిస్తే తప్పేంటన్న కాంగ్రెస్ నేతలు
జర్నలిస్టులను, పత్రికా సిబ్బందికి అండగా వుండటమే నేరమా?
అదే నేరం పదేపదే చేస్తామని కాంగ్రెస్ నేతల శపథాలు
అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజావాణిగా భావజాలాన్ని వ్యాప్తి చేసి, మహామహుల అక్షరాలను, బ్రిటీష్ వారిపై అగ్నికీలలుగా సంధించిన నేషనల్ హెరాల్డ్ పేపర్ కు, కాంగ్రెస్ అండగా నిలిస్తే తప్పేంటి అంటూ నిలదీశారు. నాడు నష్టాల్లో వున్న పత్రికను ఆదుకుని, జీతాల్లేక ఇబ్బందిపడుతున్న జర్నలిస్టుల వేతనాలు చెల్లించేందుకు, కాంగ్రెస్ సాయం చేస్తే నేరమా అంటూ ప్రశ్నించారు. జర్నలిస్టులను, పత్రికా సిబ్బందికి అన్ని విధాలుగా అండగా వుండటమే నేరమైతే, అదే నేరం పదేపదే చేస్తామంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నాయకులు. హైదరాబాద్ లో ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లిన టీ కాంగ్రెస్ నాయకులు, ఈడీ కార్యాలయం దగ్గరే ధర్నా చేశారు. అధికారం పోతుందన్న భయంతోనే, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ ఆరోపించారు.
ఒకవైపు ఈడీ రాహుల్ ను విచారిస్తున్న సమయంలోనే, ఇటు కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో సాగింది. ఢిల్లీ మొత్తం బారికేడ్లను పెట్టడం చూస్తుంటే, ప్రభుత్వం కాంగ్రెస్‌కు భయపడుతున్నట్లు కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. మమ్మల్ని ఎవరూ అణచివేయలేరన్న లీడర్లు, బ్రిటిషర్లు, కొత్తగా వచ్చిన అణచివేత దారులు.. ఎవరూ మమ్మల్ని తొక్కిపెట్టలేరంటూ తీవ్రంగా స్పందించారు. 136 ఏళ్లుగా కాంగ్రెస్ సామాన్యుల గొంతుకగా ఉందని, కాంగ్రెస్ ఎలాంటి త్యాగానికైనా సిద్ధమంటూ బీజేపీపై విమర్శలు చేశారు కాంగ్రెస్ లీడర్లు.
మనీలాండరింగ్ కేసులోరాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ, కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్త నిరసనలకు దిగడాన్ని బీజేపీ నాయకులు తప్పుపట్టారు. తమ అవినీతి బయటపడినందుకు బహిరంగంగానే, దర్యాప్తు సంస్థపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చారని విమర్శించారు. ఇది గాంధీ ఆస్తులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నమంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీతో సహా ఎవరూ చట్టానికి అతీతులు కాదన్న కమలనాథులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఒకప్పటి వార్తాపత్రిక పబ్లిషింగ్ సంస్థపై గాంధీ కుటుంబం ఎందుకు ఆసక్తి చూపుతోందని విమర్శించారు.
బైట్స్….బీజేపీ నేతలు
ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం సాగుతున్న టైంలోనే, కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. టూజీ, కోల్, కామన్వెల్త్, హెలికాప్టర్ కొనుగోళ్లు, ఇలా నింగి నుంచి నేల వరకు యూపీఏ జమానా మొత్తం అవినీతిమయమంటూ, బీజేపీ ఆరోపణలు చేసినా, ఏ ఒక్కటీ నిరూపించలేదు. కానీ ఎప్పుడో మూడపడిన నేషనల్ హెరాల్డ్ కేసును మాత్రం ఎప్పటికప్పుడు తెరమీదకు తెస్తోంది. ఏకంగా అగ్ర నాయకులను వెంటాడుతోంది. దీంతో ఇవి రాజకీయ కక్ష సాధింపు చర్యలేనంటూ కాంగ్రెస్ శ్రేణులు రగిలిపోతున్నాయి.
రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోస్తున్న మోడీ ప్రభుత్వం, ఇప్పుడు అధినాయకులపైనే గురిపెట్టిందంటూ కాంగ్రెస్ నేతలు కసిమీదున్నారు. ఈ వ్యవహారంతో రాజకీయంగా బీజేపీకి ఎలాంటి ప్రయోజనం వుంటుందో కానీ, ఈడీ విచారణ మాత్రం కాంగ్రెస్ లో ఒక్కసారిగా కసి పెంచింది. చిన్నాపెద్ద లీడర్లంతా నిరసనలకు పురికొల్పింది. పార్టీ శ్రేణుల్లో పట్టుదల పెంచింది. బీజేపీ వ్యతిరేక దళానికి ఎవరు నాయకత్వం వహించాలంటూ, ప్రాంతీయ పార్టీలు కూటములు కడుతున్న తరుణంలో, కాంగ్రెస్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు నేరమే లేని కేసును ఎందుకు తిరగదోడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు సంధిస్తున్న ప్రశ్నలు, జనంలోకి వెళ్తే, కాంగ్రెస్ కు సానుభూతి వెల్లువలా వచ్చిపడుతుందని, బీజేపీ ఈడీ స్ట్రాటజీ బూమరాంగ్ అవుతుందని కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు. ఇప్పుడు దేశమంతా ఇదే రచ్చ. రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. ఇటు కాంగ్రెస్ నేతల ఆందోళనలతో దేశమంతా దద్దరిల్లిపోతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో నేరమేంటి? బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా నిధులు అక్రమంగా మళ్లాయా? ఆస్తులను అన్యాయంగా స్వాధీనం చేసుకున్నారా? అనే ప్రశ్నలకు సింపుల్ గా, బ్రీఫ్ గా ఆన్సర్ ఏంటి?
నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ ప్రచురించే సంస్థను కొనుగోలు చేయడానికి, కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారన్నదే ప్రధానమైన ఆరోపణ. బీజేపీ నేతలు పదేపదే చేస్తున్న ఆక్షేపణ. 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి.. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేసు పెట్టారు. సోనియా, రాహుల్ గాంధీలు వేల కోట్ల రూపాయల మేర మోసం చేశారని, భూకబ్జాలకు పాల్పడ్డారని 2012 నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని కోర్టులో ఫిర్యాదు చేశారు స్వామి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ద్వారా ఢిల్లీ, యూపీ, ఇతర ప్రాంతాల్లో రూ. 1,600 కోట్ల రూపాయల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు, ఆస్తులను మోసపూరితంగా మళ్లించుకున్నారని కంప్లెంట్ చేశారు సుబ్రమణ్య స్వామి. ఇప్పుడు ఈడీ ఇదే కోణంలో విచారిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఇదీ కేసు. కానీ ఇందులో లోతుపాతులు తెలుసుకుంటే తప్ప, అసలు నిజాలు అర్థంకావు.
నేషనల్ హెరాల్డ్. స్వాతంత్ర ఉద్యమంలో అక్షరాలనే నిప్పుకణికలుగా సంధించిన వార్తా పత్రిక. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మూలస్తంభాలుగా నిలిచిన న్యూస్ పేపర్. స్వాంత్ర్యానికి సంబంధించి ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపడానికి, వార్తలు చేరవెయ్యడానికి 1938లో నేషనల్ హెరాల్డ్ ను స్థాపించారు. గాంధీ, పటేల్, నెహ్రూలతో పాటు పలువురు స్వాతంత్య్ర సమరయోధులు కలిసి రూ.5 లక్షల మూలధనంతో నేషనల్ హెరాల్డ్ ను ఏర్పాటు చేశారు. బ్రిటీష్ దమననీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టింది నేషనల్ హెరాల్డ్. దీంతో బ్రిటీష్ పాలకలు రగిలిపోయారు. జనంలోనూ ఈస్థాయిలో వ్యతిరేకత వస్తుందని భయపడ్డారు. దీంతో 1942 నుంచి 1945 వరకు నేషనల్ హెరాల్డ్ ను బ్యాన్ చేశారు బ్రిటీష్ పాలకులు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఈ కంపెనీకి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు భూములు, భవనాల రూపంలో పలు రకాల ఆస్తుల్ని కట్టబెట్టాయి. కొంతకాలం పాటు ఉజ్వలంగా వెలిగింది నేషనల్ హెరాల్డ్.
అయితే నేషనల్ హెరాల్డ్ పత్రికను ఆర్థిక కష్టాలు వెంటాడాయి. ఢిల్లీలోని ప్రఖ్యాత హెరాల్డ్ హౌస్‌తో పాటు కోట్ల రూపాయల ఆస్తులున్నా, జర్నలిస్టులకు, అందులో పని చేసే సాంకేతిక సిబ్బందికి జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఢిల్లీలోని ప్రఖ్యాత హెరాల్డ్ హౌస్‌తో పాటు కోట్ల రూపాయల ఆస్తులున్నా.. జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరింది. బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ, పత్రికను ఆర్థికంగా ఆదుకోవాలని భావించింది. ప్రజల నుంచి చందాలు, విరాళాల రూపంలో వసూలు చేసిన పార్టీ నిధి నుంచి అసోసియేటెడ్ జర్నల్స్‌కు రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది. ఆ డబ్బుతో దాని రుణాలు తెలిపింది. ఈ 90 కోట్లకు వడ్డీలేకుండా, అనేక సమయాల్లో విడతలవారీగా ఇచ్చింది. అయినా నేషనల్ హెరాల్డ్ కష్టాల నుంచి గట్టెక్కలేకపోయింది. దీంతో 2008లో ఈ పత్రిక మూతపడక తప్పలేదు.
2008లో నేషనల్ హెరాల్డ్ మూతపడిన రెండేళ్లకు, అంటే 2010లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. 2010 నవంబర్లో రూ.50 లక్షల మూలధనంతో యంగ్ ఇండియన్ అనే సంస్థ తెరపైకి వచ్చింది. ఇందులో 76 శాతం వాటా సోనియా, రాహుల్ గాంధీలదే. మిగతా 24 శాతం మాత్రం గాంధీలకు నమ్మకస్తులుగా ఉంటూ వస్తున్న మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లది. వీరిద్దరు ఇప్పుడు భౌతికంగా లేరు. నేషనల్ హెరాల్డ్‌కు ఇచ్చిన అప్పును, తిరిగి కట్టలేని రుణంగా ప్రకటించింది కాంగ్రెస్. దాన్ని యంగ్ ఇండియాకు రూ.50లక్షలకు ఇచ్చేసింది. మరింత సింపుల్ గా చెప్పాలంటే, నేషనల్ హెరాల్డ్ రూ.90 కోట్ల అప్పును, యంగ్ ఇండియన్‌కు రూ.50 లక్షలకు అప్పగించింది. దీనికి సంబంధించి అటు ఏఐసీసీ తరపున, ఇటు యంగ్ ఇండియన్ తరపున, దాంతో పాటు నేషనల్ హెరాల్డ్ తరపున కూడా ఒకే వ్యక్తి, మోతీలాల్ వోరా సంతకం చేశారని చెబుతున్నారు. దీన్నొక చరిత్రాత్మక ఒప్పందంగా తెలిపింది కాంగ్రెస్..
ఈ అగ్రిమెంట్ తో నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నీ యంగ్ ఇండియన్ వచ్చాయి. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ప్రస్తుత విలువ సుమారు రూ.5వేల కోట్లగా చెబుతున్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల వాటాలకు చెందిన కంపెనీలో, ఎన్నో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, 2012లో ఢిల్లీ కోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు వేశారు. దీంతో మరోసారి నేషనల్ హెరాల్డ్ కేసు తెరపైకి వచ్చింది. ఈ మొత్తం స్కామ్ విలువ సుమారు రూ.1600 కోట్లుగా చెప్పారు సుబ్రహ్మణ్యస్వామి. యంగ్ ఇండియన్ కంపెనీ ఏర్పాటు ద్వారా నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నింటినీ సోనియా, రాహుల్ చేజిక్కించుకున్నారన్నది ఆయన ప్రధాన ఆరోపణ…
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ వేగవంతమైంది. 2014లో సోనియా, రాహుల్, శ్యాంపిట్రోడాలకు నోటీసులు ఇచ్చింది ఢిల్లీ కోర్టు. 2016లో పాటియాలా హౌజ్ కోర్టు నుంచి, కాంగ్రెస్ అగ్రనేతలు బెయిల్ తెచ్చుకున్నారు. 2019లో రూ.64కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఇప్పటికే సోనియా, రాహుల్‌లకు ఆదాయంపన్ను శాఖ తాఖీదులు ఇచ్చింది. ఐటీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టును సోనియా గాంధీ ఆశ్రయించారు. 2019లో సోనియా, రాహుల్‌లకు సుప్రీంకోర్టులో ఐటీ నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. సోనియా, రాహుల్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇష్యూ అయ్యాయి. ఇప్పుడు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించింది. మరికొద్ది రోజుల్లో సోనియా గాంధీని సైతం విచారిస్తామంటోంది. నేషనల్ హెరాల్డ్ స్థాపన నుంచి ఈడీ విచారణ వరకు, ఇదీ పత్రిక కథ. అయితే, ఇందులో తప్పేం వుందని, తాము చేసిన నేరమేంటన్నది కాంగ్రెస్ నేతలు సంధిస్తున్న ప్రశ్న.
నేషనల్ హెరాల్డ్ ఆర్థిక కష్టాల్లో వున్న సమయంలో కాంగ్రెస్ సాయం చేసింది. అందులో పని చేసే సిబ్బందికి అండగా నిలిచింది. 90 కోట్ల రుణం ఇచ్చింది. చివరికి ఆ పత్రిక మూతపడింది. దీంతో దాని ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఇందులో నేరం ఏం వుందని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. నేషనల్ హెరాల్డ్ కు రుణం ఇవ్వడమే నేరమా? అందులో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చెయ్యడమే పాపమా అంటోంది. అంతేకాదు, అదే నేరమైతే, అలాంటి నేరాలు మరిన్ని చెయ్యడానికి సిద్దమంటోంది. తమ అగ్ర నేతలను కావాలనే ఇరికిస్తే, దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామంటోంది.
నరేంద్ర మోడీ సర్కారుకు ముందు, దేశాన్ని పదేళ్లు పాలించింది కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూపీఏ. 2004 నుంచి 2009 మొదటి విడత, 2009 నుంచి 2014 వరకు రెండో విడత. అయితే, సెకండ్ టర్మ్ లో, కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ అనేక అవినీతి ఆరోపణలు చేసింది. 2జీ స్కామ్ అంటూ పెద్ద ఎత్తున ఉద్యమించింది. కామన్వెల్త్ లో కుంభకోణం జరిగిందని ఆరోపించింది. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ స్కామ్ అంటూ విమర్శలు గుప్పించింది. బొగ్గు కుంభకోణమంటూ గొంతెత్తింది. ఇంకా ఎన్నో, మరెన్నో ఆరోపణలు చేసింది. తాము అధికారంలోకి వస్తే, యూపీఏ హయాంలోని అవినీతిని వెలికి తీసి, దోషులను బోనెక్కిస్తామని ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ శపథాలు చేశారు. మోడీ ప్రధాని అయ్యి ఎనిమిదేళ్లయ్యింది. ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణనూ నిరూపించలేదు. పెద్ద ఎత్తున ఆరోపించిన 2జీ స్కామ్ లో నిందితులకు క్లీన్ చిట్ కూడా ఇచ్చారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా కాంగ్రెస్ ను బోనెక్కించలేకపోయారు. అంటే యూపీఏ హయాంలో అవినీతి జరగలేదనా? లేదంటే నిరూపించే అవకాశం లేక బీజేపీ సర్కారు మిన్నకుండిపోయిందా? అసలు అవినీతే జరగలేదనుకోవాలా? ఈ ప్రశ్నలకు ఏ బీజేపీ నాయకుడు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాడు..
బీజేపీ ప్రభుత్వం ఒక దుష్ట సాంప్రదాయానికి తెర తీసిందన్న చర్చ కూడా జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందున్న వాజ్ పేయి సర్కారు కూడా అనేకమందిపై అవినీతి ఆరోపణలు చేసేవి. ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టాయి. కానీ ఎన్నడూ పార్టీల అధినేతలను ఇరికించలేదు. ఆరోపణలు ఎదుర్కొన్న వారిపైనే సీబీఐ, ఈడీ సంస్థలు దూకేవి. అంతేకానీ, పార్టీ అధ్యక్షులను, పాలక స్థానంలో వున్న వారిని టచ్ చేసేవి కావు. ఇప్పుడు మాత్రం ఏకంగా కాంగ్రెస్ అధినాయకులైన సోనియా, రాహుల్ పైనే కేసులు పెట్టి, విచారణ చేయిస్తోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది దుష్ట సాంప్రదాయమని విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.
రేపు బీజేపీ దిగిపోవచ్చు. కాంగ్రెస్ కేంద్రంలోకి రావచ్చు. మోడీ సర్కారు అనుసరించినట్టుగానే, ప్రత్యర్థి పార్టీల్లోని ప్రధాన నేతలపై కేసుల పెట్టుకుంటూపోతే పరిస్తితి ఏంటని కొందరు లేవనెత్తుతున్నారు. తమిళనాడు తరహాలో ఇలా అధికారంలోకి రాగానే, అలా ప్రతిపక్ష లీడర్లను కేసులతో వెంటాడే సంస్క్రుతి మంచిదికాదంటున్నారు. రాజకీయ కక్ష సాధింపులన్న భావన ప్రజల్లోకి వెళ్తే పాలకుల పీఠానికే ఎసరని చెబుతున్నారు.
యూపీఏ గత పదేళ్ల పాలనలో, ఏ ఒక్క అవినీతి ఆరోపణనూ నిరూపించని నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎప్పుడో మూతపడిన నేషనల్ హెరాల్డ్ కేసు తెరపైకి తెచ్చింది. సమయం, సందర్భంపైనే రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం. ప్రతిపక్షంలో కాంగ్రెస్సే ప్రధాన పార్టీ. కాంగ్రెస్ నేత్రుత్వంలో పార్టీలన్నీ ఏకమైతే, బీజేపీకి ఇబ్బంది. 2024 ఎన్నికల్లోనూ కాంగ్రెస్సే నాయకత్వం వహించడానికి మార్గం సుగమం అవుతుంది. అందుకే ఇప్పటికే విపక్షాల్లో కాంగ్రెస్ పట్ల వున్న నిస్సహాయతను మరింత పెంచేందుకు, అగ్రనాయకత్వంపై గురిపెట్టిందన్న చర్చ జరుగుతోంది. దీని ద్వారా కాంగ్రెస్ కు విపక్షాలను మరింత దూరం చేసే వ్యూహం వుండొచ్చని పొలిటికల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. విపక్షాలన్నింటినీ చీలికలు పేలికలు చెయ్యాలంటే, కాంగ్రెస్ నైతికస్థైర్థ్యాన్ని తద్వారా, ప్రాంతీయ పార్టీల ఐక్యతా ప్రయత్నాలకు గండికొట్టాలన్నది బీజేపీ వ్యూహంగా విశ్లేషిస్తున్నారు.
బీజేపీ లెక్కలు అలా వుంటే, ఈడీతో పాటు దర్యాప్తు సంస్థల దూకుడును, తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. నేషనల్ హెరాల్డ్ అంశాన్ని తిరగదోడటం ద్వారా, బీజేపీ రాజకీయ కక్ష సాధింపు స్పష్టంగా అర్థమవుతోందన్న వాదనను, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆలోచిస్తోంది. సోనియా, రాహుల్ లనే నానా కష్టాలు పెడతారా అంటూ, పార్టీ కార్యకర్తల్లో కసి నింపాలని భావిస్తోంది. రాతహుల్ తర్వాత, సోనియాను కూడా ఈడీ ప్రశ్నిస్తుంది. ఈ విచారణ దాదాపు రెండు నెలల వరకు సాగుతుంది. పార్టీ నడిపించే ఇద్దరు టాప్ లీడర్లను దర్యాప్తు సంస్థలు వెంటాడటం, సహజంగానే కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం తెప్పిస్తుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాన్ని ఇలా వేధిస్తారా అంటూ ప్రజల్లోకి చర్చకు పెడుతుంది. ఇలా నరేంద్ర మోడీ సర్కారు కక్ష సాధింపు చర్యలను, గోడకు కొట్టిన బంతిలా తిరగబడతామంటోంది కాంగ్రెస్. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుంటామంటోంది. అవినీతి చేసిన వారు ఎవరైనా బోనెక్కాల్సిందే. కానీ ఆరోపణలు, ఆరోపణలుగా వుండిపోతేనే అనేక అనుమానాలు. మరి గత ఆరోపణాల్లాగే నేషనల్ హెరాల్డ్ కేసును, ఏదో హడావుడి చేసి తుస్సుమనిపిస్తారా? లేదంటే విచారణ పేరుతో మరింతగా సాగదీసి, ఎన్నికల వరకూ లాగుతారా? వీటిపై కాంగ్రెస్ శ్రేణులు పోరాటంతో ఎలా తిప్పికొడతాయన్నది, రానున్న కాలమే సమాధానం చెప్పాలి.