Story Board: గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. కీలక రంగాలపై చర్చలు, సెషన్లు, సెమినార్లు జరిగాయి. కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా.. సమగ్ర చర్చలు జరగటం.. అందర్నీ ఆకట్టుకున్న అంశం.
Read Also: Goa Fire Accident: గోవా అగ్ని ప్రమాద రెస్టారెంట్ యజమానులు అరెస్ట్..
దేశంలో సంస్కరణలు మొదలైన తర్వాత పెట్టుబడులో కోసం చాలా రాష్ట్రాలు సదస్సులు పెట్టాయి. ఇలాంటివి హైదరాబాద్‌లో కూడా ఇంతకుముందు చాలా జరిగాయి. ఇవి కాకుండా వివిధ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు, సాంకేతికతల్ని అందిపుచ్చుకునేలా ఆయా రంగాల నిపుణులతో గ్లోబల్ సమ్మిట్‌లు, సెమినార్లు కూడా జరిగాయి. కానీ ఆ రెండింటినీ కలగలిపి.. ఓవైపు పెట్టుబడి ఒప్పందాలు.. మరోవైపు ఆవిష్కరణలు, సాంకేతికతలపై సమగ్ర చర్చకు చోటిస్తూ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రూపకల్పన చేయడం ఇతర దేశాల ప్రతినిధుల్ని సైతం ఆకట్టుకుంది. అంతేకాకుండా.. తెలంగాణ భవిష్యత్ దృష్టిని సూచిస్తూ.. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించటం.. గ్లోబల్ సమ్మిట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముందు నుంచీ సమ్మిట్‌ను దావోస్ సదస్సు మాదిరిగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. అదే స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. ఇకపై ఏటా గ్లోబల్ సమ్మిట్ జరపాలనే సంకల్పానికి బలం చేకూరేలా తొలి సమ్మిట్‌ను ఏ లోటుపాట్లు లేకుండా నిర్వహించడంలో.. ప్రభుత్వం సమష్టి బాధ్యత తీసుకుంది. ఇలాంటి సదస్సు నిర్వహణ.. ఈ సర్కారుకు సాధ్యం కాదనే అభిప్రాయాల్ని కూడా తప్పని నిరూపించింది.
Read Also: Machado: నెలల తర్వాత పబ్లిక్‌గా కనిపించిన నోబెల్ శాంతి గ్రహీత మచాడో
గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజుల్లో 27 అంశాలపై ప్లీనరీలు నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, నీతి అయోగ్, వివిధ డైరెక్టరేట్ల నిపుణులతో విస్తృత చర్చలు జరిపారు. విద్య,వైద్యం, పర్యాటకం, పరిశ్రమలు.. ఇలా భిన్న రంగాలపై సమగ్ర చర్చలు జరిగాయి. ప్రతి రంగంలోనూ తెలంగాణ సాధించిన ప్రగతి.. ఇంకా అభివృద్ధి చెందటానికి ఉన్న అవకాశాలు.. ఆ రంగంలో ప్రస్తుతం ప్రపంచంలో ముందున్న దేశాలు.. అక్కడ అనుసరించిన మోడళ్లు, కేస్ స్టడీలుగా వివరంగా అభిప్రాయసేకరణ జరిగింది. గంటన్నర పాటు నిర్వహించిన ఒక్క ప్లీనరీ అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా జరగాలని సర్కారు ముందే నిర్ణయించుకుంది. విదేశీ ప్రతినిధులు కూడా ఉత్సాహంగా ప్లీనరీల్లో పాలుపంచుకుని.. అభిప్రాయాలు చెప్పటం.. తెలంగాణకు నప్పే మోడళ్లను సూచించటం.. రాష్ట్ర పురోగతికి దోహదపడుతుందనే భావన వ్యక్తమైంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆరు ఖండాలకు ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధులు.. తమవైన ఆలోచనలతో.. గ్లోబల్ సమ్మిట్‌కు వైవిధ్యం తీసుకొచ్చారని ప్రభుత్వం అనుకుంటోంది.
Read Also: Hyderabad: నగరంలో దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కలకలం..
ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయింది. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి ఈ సమ్మిట్ బీజం వేసింది. రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద కంపెనీలు, పరిశ్రమలు ముందుకు వచ్చి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో రైజింగ్-2047 లక్ష్య సాధన దిశగా అడుగులు పడినట్లైంది. ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు తెలంగాణ సిద్దమైందన్న సంకేతాలను సైతం సమ్మిట్ ప్రస్ఫుటం చేసింది. రెండు రోజుల్లో ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నా.. 2 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చేలా కనిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఇది కచ్చితంగా రాష్ట్రానికి అడ్వాంటేజ్ కానుంది.
2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు అంతర్జాతీయ, జాతీయ సంస్థలను ఆకర్షించి పెట్టుబడులకు సాధించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది. వివిధ దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు సమ్మిట్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపారు. పెట్టుబడుల కోసం కంపెనీలను ఆహ్వానించేందుకు ప్రతీ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు స్విట్టర్లాండ్ లోని దావోస్‌కు వెళ్లటం పరిపాటిగా వస్తోంది. ఇందుకు భిన్నంగా తెలంగాణ సర్కారు వివిధ దేశాల కంపెనీలను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు స్పందించి.. పెట్టుబడులు పెట్టేందుకు మేం సిద్దం అంటూ ఒప్పందాలు చేసుకున్నారు.
గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించిన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ సమ్మిళిత సమగ్రాభివృద్ధిని కళ్లకు కట్టింది. మొత్తం తెలంగామ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి.. ఒక్కో ప్రాంతానికి ప్రత్యేకమైన ఆర్థికవ్యవస్థను అభివృద్ధి చేయాలనుకోవడం వినూత్న ఆలోచనగా పరిగణిస్తున్నారు. మూడు ప్రధాన రంగాలైన వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్ని అనుసంధానిస్తూ రూపొందించిన విజన్ డాక్యుమెంట్ దిగ్గజాల్ని కూడా ఆకట్టుకుంది. ఈ విజన్ ముఖ్యంగా రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం అంటే, దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ కల్పనా యంత్రంగా తెలంగాణ మారడం ఖాయం. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలను ప్రపంచస్థాయి సేవల కేంద్రంగా అభివృద్ధి చేస్తారు. దీంతో ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, హెల్త్‌కేర్ వంటి సేవా రంగాల్లో లక్షలాది కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. యువతకు మెరుగైన వేతనాలు, అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేసే అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ విజన్‌తో నైపుణ్య శిక్షణ కేంద్రాలు విస్తరిస్తాయి. యువత తమ నైపుణ్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకునే అవకాశం లభిస్తుంది.
పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ద్వారా నగర శివారు ప్రాంతాలను తయారీ రంగానికి ప్రధాన కేంద్రంగా మారుస్తారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా భారీ పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి. తద్వారా శివారు ప్రాంతాల్లో భూముల విలువ పెరుగుతుంది, స్థానికులకు పరిశ్రమల్లో ఉద్యోగాలు దొరుకుతాయి. రోడ్లు, రవాణా, విద్యుత్ వంటి మౌలిక వసతులు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి. పారిశ్రామిక వేత్తలు, చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించి, వ్యాపారం వృద్ధి చెందుతుంది.
గ్రామీణ వ్యవసాయ రీజియన్ ఎకానమీ అనేది ఈ విజన్‌లో అత్యంత కీలకమైన భాగం. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి, రైతులకు గ్లోబల్ మార్కెట్‌కు అనుసంధానం చేయడమే లక్ష్యం. సాంకేతికత ఆధారిత వ్యవసాయం అమలులోకి వస్తుంది. రైతుల పంటలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ పెరిగి మంచి ధర లభిస్తుంది. ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్ చైన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు అవుతాయి. వ్యవసాయం కేవలం జీవనాధారం కాకుండా, లాభదాయకమైన వ్యాపారంగా మారుతుంది.
విజన్ డాక్యుమెంట్ లక్ష్యించినట్టుగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదిగితే, రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం దేశ జీడీపీలో 5% వాటాను అందిస్తున్న తెలంగాణ, 2047 నాటికి దానిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు, ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉంది. చైనాలోని గ్వాంగ్-డాంగ్ ప్రావిన్స్ తరహాలో, జపాన్, జర్మనీ, సింగపూర్ వంటి దేశాల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి ఇంధనంగా పనిచేస్తాయి.
గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో.. మరోసారి హైదరాబాద్ అనుకూలతలు హైలైట్ అయ్యాయి. దేశంలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ ఎలా అనువుగా ఉందో.. అతిథులు అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగారు. అదే సమయంలో భవిష్యత్తు నగరంగా పేరు తెచ్చుకున్న ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు కూడా వారిని కట్టిపడేశాయి.
తెలంగాణకు ఎప్పుడూ గ్రోత్ ఇంజిన్ హైదరాబాదే. హైదరాబాద్ లో ఏ సదస్సు జరిగినా.. ఏ లక్ష్యంతో జరిగినా.. అందులో అంతర్లీనంగా హైదరాబాద్ అనుకూలతల్ని హైలెట్ చేసే ప్రక్రియ ఉండనే ఉంటుంది. ఏ అంశంపై చర్చ జరిగినా.. కచ్చితంగా హైదరాబాద్ ప్రస్తావన వస్తుంది. చాలా మంది విదేశీ ప్రతినిధులు.. హైదరాబాద్ తమ మనసును కట్టి పడేసిందని విభిన్న వేదికలపై చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ వేదికగా కూడా మరోసారి హైదరాబాద్ ప్రశంసలు వినిపించాయి. ఇప్పటివరకు హైదరాబాద్ ఎదిగిన తీరు చూశామని, ఇక భవిష్యత్తు నగరం ప్లానింగ్ ఆకట్టుకుంటోందని, ఆ నగరం ఎలా అభివృద్ధి చెందుతుందో చూడాలని ఉత్సాహంగా ఉన్నామనే అభినందనపూర్వక సందేశాలు ముందే వచ్చేశాయి.
హైదరాబాద్ శరవేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే మహానగరంగా ఉన్న హైదరాబాద్.. విశ్వనగరంగా రూపు మార్చుకుంటోంది. గత పాతికేళ్లుగా ప్రభుత్వాలు మారినా.. హైదరాబాద్ అభివృద్ధి మాత్రం ఆగలేదు. దీంతో హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ నివాసానికి ఇళ్లు కూడా అందుబాటు ధరల్లో ఉన్నాయి. ఉద్యోగుల దగ్గర్నుంచి పారిశ్రామికవేత్తల వరకూ ఎవరైనా స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి అనువైన నగరం. ఉద్యోగాల కల్పనలో మరే నగరం హైదరాబాద్ తో పోటీపడే స్థాయిలో లేదు. డైనమిక్ సిటీగా ఉన్న హైదరాబాద్ వివిధ వర్గాల్ని సూదంటురాయిలా ఆకర్షిస్తోంది. విద్య, వైద్యం, ఉద్యోగాలు, వ్యాపారాలు, పెట్టుబడులు.. ఇలా ఒకటేంటి ఏ రంగం చూసుకున్నా.. హైదరాబాద్ కు తిరుగులేదనే విధంగా దూసుకుపోతోంది. అంతర్జాతీయ సదస్సులు, కాన్ఫరెన్సులకు కూడా హైదరాబాద్ వేదికగా మారింది. ఒక్కసారి ఇక్కడ సదస్సు జరిగితే.. మరోసారి ఇంకో నగరానికి వెళ్లటానికి నిర్వాహకులు ఇష్టపడటం లేదు. దీంతో చాలా సదస్సులు రిపీటెడ్ గా హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. ఎవరినైనా ఇట్టే ఆకర్షించే అనుకూలతలే హైదరాబాద్ కు వరంగా మారాయి. ఒక్కసారి హైదరాబాద్ కు వచ్చినవారెవరూ.. మరో నగరంపై దృష్టి పెట్టడానికి ఇష్టపడటం లేదు. ఏదో సదస్సులో పాల్గొనటానికి హైదరాబాద్ వచ్చినవాళ్లు.. వ్యాపారమో.. ఉద్యోగమో పేరేదైనా ఇక్కడే స్థిరపడటానికి ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో హైదరాబాద్ కు ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్, అవుటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ కు అదనపు ఆకర్షణలు. రాబోయే రోజుల్లో రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్ వంటివి సరికొత్త హంగుల్ని జోడించే అవకాశం ఉంది. హైదరాబాద్ లో కనిపిస్తున్న నిరంతర అభివృద్ధి మరే మహానగరంలో లేదంటే అతిశయోక్తి కాదు. ఈ డైనమిక్సే హైదరాబాద్ ను అందిరకీ గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ఏ సర్కారు వచ్చినా హైదరాబాద్ అభివృద్ధికి ఢోకా లేదనేది నిరూపితమైన సత్యం. దీంతో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ తమ హాట్ ఫేవరెట్ హైదరాబాదే అని గట్టిగా చెబుతున్నారు.
హైదరాబాద్ ఆదాయ పరంగా తెలంగాణకు చాలా కీలకం. మొత్తం తెలంగాణ ఆదాయంలో 65 శాతం ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుందిదేశంలో ఐదో అతిపెద్ద నగర ఆర్థిక వ్యవస్థగా హైదరాబాద్ కు పేరుంది. హైదరాబాద్ విస్తరణకు ఉన్న అవకాశాలు.. ఈ నగరాన్ని దక్షిణ భారతంలోనే నంబర్ వన్ సిటీగా మార్చాయి. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా నిరంతర ప్రక్రియలా కొనసాగుతోంది. హైటెక్ సిటీ, అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో, రోడ్లు, ఫ్లైఓవర్లు.. ఇలా అభివృద్ధి అంతా కనిపిస్తోంది.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల పెరుగుదలకు అవకాశం లేకపోవడం.. రకరకాల సమస్యలు ఎదుర్కుంటుండంటతో.. కంపెనీలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. హైదరాబాద్ లో నిరంతర అభివృద్ధి జరుగుతున్నా.. ఫ్యూచర్ సిటీకి ముందడుగు పడినా.. ఇంకా నగర విస్తరణకు అపారమైన అవకాశాలున్నాయి. లక్షలాది ఎకరాలు అందుబాటులో ఉన్నాయి.
డేటా సెంటర్లకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది. ఐటీ దిగ్గజ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థలు అమెరికా వెలుపల చేపట్టే భారీ కార్యకలాపాలకు ఇప్పటికే హైదరాబాద్ నగరం ప్రధాన కేంద్రంగా గుర్తింపు సాధించింది. ఈ క్రమంలో ఆయా సంస్థలతో పాటు మరిన్ని కొత్త కంపెనీలు సైతం హైదరాబాద్ లోనే డేటా సెంటర్లను నెలకొల్పుతున్నాయి. ఇప్పటికే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎన్నోసార్లు గుర్తింపు పొందిన హైదరాబాద్ కు.. అదనపు హంగులు తోడైతే.. నగర అభివృద్ధి చరిత్రలో కొత్త శకం మొదలవుతుందనే అంచనాలున్నాయి. ఇటీవలే ఐటీ పరిశ్రమలో ఏ నగరంలో ఉద్యోగానికి ఆసక్తి చూపుతారని సర్వే జరిగితే.. ఏకంగా 60 శాతం మంది హైదరాబాద్ కే జై కొట్టారు. కాస్ట్ ఆఫ్ లివింగ్, మౌలిక వసతులు, ఇలా ఏ పారామీటర్ చూసుకున్నా హైదరాబాద్ కు తిరుగులేదనే చర్చ జరుగుతోంది.
హైదరాబాద్ తెలంగాణకు గ్రోత్ ఇంజిన్. హైదరాబాద్ నగర పరిధి విస్తరించడంతో పాటు.. అవుటర్ రింగ్ రోడ్డు.. రీజినల్ రింగ్ రోడ్డు మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణంతో.. మధ్య భాగంలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతూ జీవన ప్రమాణాల విషయంలో ప్రగతి సాధిస్తున్న నగరం హైదరాబాద్. హైదరాబాదీ అని చెప్పుకోటానికి చాలా మంది గర్వపడతారు. ఇక్కడ బతికి మరో చోటికి వెళ్లటానికి చాలా మంది ఇబ్బంది పడతారు. ఈ నగరానికున్న ప్రత్యేకత అది. దేశంలోని ఇతర నగరాలకంటే హైదరాబాద్ ని ఓ మెట్టుపైన ఉంచే అంశాలు అనేకం ఉన్నాయి. ఓ పక్క ఘనమైన చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే.. అంతర్జాతీయ స్థాయి హంగులు కూడా అందిపుచ్చుకుంటోంది హైదరాబాద్.
వందల ఏళ్ల పురాతన చరిత్ర.. భిన్న సంస్కృతుల కలయిక.. అత్యాధునికతను అంది పుచ్చుకోవటంలో జెట్ స్పీడు.. గరీబు నుండి అమీర్ వరకు గౌరవంగా బతికే అవకాశం.. భద్రమైన భౌగోళిక పరిస్థితులు.. ఇవన్నీ హైదరాబాద్ కు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు. అదనపు ఆకర్షణలు. ఏరకంగా చూసుకున్నా, హైదరాబాద్ లో ఎన్నో మార్పులు శరవేగంగా జరిగాయి. శివార్ల సంగతైతే సరేసరి. ఒకప్పుడు పొలాలుగా ఉన్న ప్రాంతాలన్నీ.. ఇప్పుడు అధునాతననంగా మారాయి. ఇక నగరం విస్తరిస్తున్న కొద్దీ.. ఒకప్పటి వ్యాపార కేంద్రాలు మద్దతు కోల్పోయి.. సరికొత్త ప్రాంతాలు.. వాణిజ్య కేంద్రాలుగా వెలిశాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ని మించింది లేదు. సువిశాలంగా విస్తరించటానికి ఉన్న హైదరాబాద్ కి ఉన్న అవకాశం..ఓ వరంగా మారింది. ఇక కల్చరల్ గా ఎన్నో సంస్కృతుల కలయిక..హైదరాబాద్ ని మరింత ప్రత్యేకంగా నిలుపుతోంది. అందుకే దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయినవారు కనిపిస్తారు. పైగా ఇంత ముందంజలో ఉన్న నగరంలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. ఇక్కడ నెలకు పదివేలు సంపాదించేవారు కూడా ప్రశాంతంగానే బతికే అవకాశం ఉంది. ఇక చెన్నైలాంటి నగరాలకు ఉన్నట్టు తాగునీటికి కూడా ఎలాంటి సమస్య లేదు. ఇవన్నీ కలిసి హైదరాబాద్ ని దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దాయి. దక్షిణ భారత న్యూయార్క్ నగరంగా హైదరాబాద్ మారుతోందని ప్రశంసలందుకొంది. ప్రజలు, సంస్కృతీ సంప్రదాయాలు, అతిథి మర్యాదలతో పాటుగా వ్యాపారాలు చేసుకునేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమనే గుర్తింపు కూడా తెచ్చుకుంది. అంతేకాదు కొత్త సాంకేతికల్ని అందిపుచ్చుకుంటూ ఏఐ, క్వాంటమ్ రంగాల్లోనూ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలనే సంకల్పంతో కనిపిస్తోంది. ఏతావాతా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్ ప్రత్యేకతల్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. పనిలోపనిగా నగర విస్తరణ లక్ష్యంతో ఏర్పాటు కాబోతున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికల్ని కూడా చాటిచెప్పింది. దేశంలో ఉన్న మెట్రో నగరాలన్నీ ఇబ్బందులు ఎదుర్కుంటున్న తరుణంలో.. అసలా కష్టాలు లేకపోయినా.. ముందుజాగ్రత్తగా ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ ముందడుగు వేయటం మొత్తం ప్రపంచాన్ని ఆకట్టుకునే అంశమే కాదు.. ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భం
గ్లోబల్ సమ్మిట్‌తో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయనే నమ్మకం వచ్చిందని తెలంగాణ సర్కారు చెబుతోంది. అతిథుల ప్రశంసలు, విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ చూస్తే.. రాబోయే పాతికేళ్లకు బాటలు పడ్డట్టే. కానీ ఈ ఊపును ఎలా ముందుకు తీసుకెళ్తారు..? విజన్ డాక్యుమెంట్ కార్యాచరణ ఎలా ఉంటుంది..? అనేవి కీలకం కానున్నాయి.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో.. సర్కారు అనుకున్న లక్ష్యం సగం నెరవేరింది. కానీ పూర్తిగా లక్ష్యం చేరాలంటే.. గ్లోబల్ సమ్మిట్ ఊపును ఇలాగే కొనసాగించాలి. విజన్ డాక్యుమెంట్ ఆచరణకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. సమ్మిట్‌లో ఒక్కో రంగంపై సమగ్ర చర్చ పెట్టినట్టే్.. విజన్ లక్ష్యాలు సాధించటానికి.. ఒక్కో రంగంలో అవసరమైన మార్పులే లక్ష్యంగా నిరంతంర పనిచేసుకుంటూ పోవాలి. అందుకోసం కేవలం ప్రభుత్వం మాత్రమే ప్రణాళికలు రచిస్తే సరిపోదు. ప్రైవేట్ రంగాన్నీ భాగస్వామిని చేయాలి. ప్రజాభాగస్వామ్యం కూడా తీసుకోవాలి. సమ్మిళిత, సమగ్ర వృద్ధి విజన్ తీసుకొచ్చారని ప్రపంచ దిగ్గజాలు ఇప్పటికే కొనియాడారు. పేపర్ మీదే ఇంత ఆకర్షణను సొంతం చేసుకున్న విజన్.. నిజంగా సాకారమైతే మరెంతమందిని మెప్పస్తుందో అనే ఆలోచనతో రోడ్‌మ్యాప్ వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజన్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న లక్ష్యాలను దశలవారీగా సాధించేలా చూసుకోవాలి. దీని కోసం స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలుగా విభజన చేసుకోవాలి. ఏ రంగంలో ఎవరి సహకారం తీసుకుంటే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమౌతుందో కూడా అంచనా వేసుకుని కార్యాచరణ తీసుకోవాలి.
విజన్ ను నిజం చేయటానికి తామంతా చేయూత అందిస్తామని దిగ్గజాలు హామీ ఇచ్చారు. వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ.. సమ్మిట్ మాదిరే.. రంగాల వారీగా లక్ష్యసాధనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. థింక్ ట్యాంకుల మాదిరిగా.. యాక్షన్ టీములు పనిచేస్తేనే.. అనుకున్న లక్ష్యం పూర్తిస్థాయిలో సాకారమయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా కార్యక్రమాన్ని ప్లాన్ ప్రకారం గ్రాండ్‌గా చేస్తే, అది కచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది. అందుకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదే విధంగా విజన్ ను నిజం చేసే కార్యాచరణకు సరిగ్గా ప్లాన్ చేస్తే.. 2047 నాటికి అనుకున్న లక్ష్యాలు నెరవేరటం పెద్ద కష్టమేం కాదు. ఈ సంగతి కేవలం రెండు రోజుల పాటు సదస్సులో పాల్గొన్న విదేశీ ప్రతినిధులే చెప్పారు. అలాంటిది హైదరాబాద్ అనుకూలతలు, ఇక్కడి నైపుణ్యాలు, మానవవనరులపై సమగ్ర అవగాహన ఉన్న సర్కారు మనసులో ఏముందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తెలంగాణ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తాత్కాలిక ప్రయోజనాలతో రోజులు గడిపేకంటే… భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండాలి? ఎలాంటి ప్రగతి సాధించాలి? ఏయే రంగాలను అభివృద్ధి చేయాలనే అంశాలపై మేధోమథనంతో గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించారు. తెలంగాణ అన్నిరంగాల్లో ఎదగాలి.. ఆర్థిక వృద్ధి సాధించాలి. విదేశీపెట్టుబడులు సాధించాలి. బహుముఖంగా పారిశ్రామికంగా ప్రగతి సాధించాలి. ప్రపంచదేశాలతో పోటీపడే నగరంగా హైదరాబాద్ ను తీర్చి దిద్దాలి. ఇదీ ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగానే విజన్ డాక్యుమెంట్ విడుదలైంది. ఇక విజన్ ను నిజం చేసే పని మాత్రమే మిగిలింది.
ఫ్యూఛర్ సిటీ… దేశంలోని నగరాలతోకాదు.. ప్రపంచ నగరాలతో పోటీ పడేవిధంగా తీర్చిదిద్దేలనే లక్ష్యంతో దార్శనిక ప్రణాళిక రెడీ అయింది. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశ్రమలు, సాంకేతిక, అంతరిక్ష, వైమానిక, రక్షణ, పర్యాటక, సెమీకండక్లర్ల పరిశ్రమలను స్థాపించ బోతున్నారు. ఇందుకు సంబంధించి పారిశ్రామిక దిగ్గజాలకు ప్రోత్సాహాలను అందించి.. పెట్టుబడులు సాధించారు. ఇప్పటివరకు సేవా రంగంపైనే తెలంగాణ ఎక్కువగా ఆధారపడింది. కానీ భవిష్యత్తులో అన్ని రంగాలూ అభివృద్ధి చెందాలనే సంకల్పాన్ని ఆచరణలోకి తీసుకురావటానికి విధాన పరమైన నిర్ణయాలు, సమయానుకూలంగా పాలసీలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇకపై వాటిపైనే సర్కారు దృష్టి పెట్టాల్సి ఉంది. వికసిత భారత్ లక్ష్య సాధనకు తమ వంతుగా ఎలా పనిచేయాలనుకుంటున్నామో ప్రపంచం ముందు ఆవిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా మిగతా రాష్ట్రాల కంటే ముందే అభివృద్ధి పరుగును కూడా ప్రారంభించడం అడ్వాంటేజే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగానే మార్పుల్ని అందిపుచ్చుకోవడంలో, వేగవంతమైన అభివృద్ధిలో హైదరాబాద్ కు తిరుగులేదనే పేరు ఇప్పటికే ఉంది. ఇప్పడు అంతకుమించిన నమూనాతో.. సరికొత్త హైదరాబాద్ ను ప్రపంచం ముందు పెట్టే లక్ష్యంతో సర్కారు పనిచేయాల్సి ఉంది. ఇప్పటివరకు తెలంగాణ అంటే ఐటీ, ఫార్మా రంగాల్లో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. కానీ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు సాకారమైతే.. ఏ రంగంలో అయినా.. ప్రపంచంలో ఏ దేశానికైనా తెలంగాణే రోల్‌మోడల్ కావాలనేది సర్కారు సంకల్పం. దీని కోసం సరికొత్త కార్యాచరణకు కూడా సిద్ధమేనని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అడుగులు పడ్డ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, స్కిల్ యూనివర్సిటీలు కూడా విజన్ డాక్యుమెంట్ లక్ష్యసాధనకు పునాదిరాళ్లుగా మారతాయనే అంచనాలున్నాయి. విద్యకు ఇచ్చే నిధుల్ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూస్తామనే సర్కారు ఆలోచనే.. విజన్ డాక్యుమెంట్‌ను శరవేగంగా సాకారం చేసే దిశగా పనిచేస్తోంది.