Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 1, 19 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ రెండో టెస్టులోనూ విఫలమ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 24 పరుగులు చేయగా.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు. దీంతో టెస్టు ఫార్మాట్‌లో గత 10 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా కోహ్లీ నమోదు చేయలేకపోయాడు. ఈ క్రమంలో టెస్టు ఫార్మాట్‌లో విరాట్ బ్యాటింగ్ సగటు 50 కంటే తక్కువకు పడిపోయింది.
Read Also: Pushpa Kamal Dahal: నేపాల్ ప్రధానిగా ప్రచండ.. ముగిసిన సంక్షోభం
ఇప్పటివరకు 104 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ 27 శతకాలు, 28 అర్ధశతకాలతో 8,119 పరుగులను సాధించాడు. తన 52వ టెస్టులో యావరేజ్ 50కి పైగా నమోదైంది. అయితే ఇప్పుడు 104వ టెస్టు మ్యాచ్ సందర్భంగా కోహ్లీ సగటు 50 కంటే కిందికి పడిపోయింది. ప్రస్తుతం అతడు 48.91 సగటుతో కొనసాగుతున్నాడు. మరోవైపు వన్డేల్లో 57.47, అంతర్జాతీయ టీ20ల్లో 52.74 సగటుతో విరాట్ కోహ్లీ ఉన్నాడు. టెస్టుల్లో కొంతకాలంగా కోహ్లీ ప్రదర్శన తీసికట్టుగా తయారైంది. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో కోహ్లీ 12 టెస్టులు ఆడగా ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఈ డబ్ల్యూటీసీలో కోహ్లీ అత్యధిక స్కోరు 79 కాగా మొత్తం మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు.