ఫార్మాట్ ఏదైనా విరాట్ కోహ్లీ వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో కోహ్లీకి ఏమైంది అంటూ అభిమానులు నిలదీస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కోహ్లీ గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే కోహ్లీ అవుట్ కాగా.. శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతం అయ్యింది. కోహ్లీ ప్రదర్శన చూసి అతడి అభిమానులు తెగ ఫీలైపోతున్నారు, ఎలా ఉండే కోహ్లీ ఇలా అయిపోయాడేంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెంచరీల మీద సెంచరీలు కొట్టిన ఆటగాడు ఇతడేనా అని ప్రశ్నిస్తున్నారు.
కోహ్లీ ప్రస్తుత ప్రదర్శన, అతడిపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా.. కొన్ని రోజులు కోహ్లీ రెస్ట్ తీసుకోవాలంటూ పలువురు క్రికెట్ దిగ్గజాలు సూచిస్తున్నారు. ఇటీవల మాజీ కోచ్ రవిశాస్త్రి సైతం కోహ్లీకి రెస్ట్ అవసరం అని చెప్పగా.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లీ ప్రాక్టీస్ సెషన్లలో మంచి ప్రదర్శనే నమోదు చేస్తున్నాడు కానీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాత్రం తన టచ్ కోల్పోతున్నాడని జాఫర్ చెప్పాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీ ఒత్తిడికి లోనుకాకుండా తనను తాను కాస్త రిలీఫ్ చేసుకోవడానికి ఒకటి లేదా రెండు నెలలు విశ్రాంతి తీసుకుని రిలాక్స్‌గా మళ్లీ ఆట మొదలుపెట్టాలని సూచించాడు. కోహ్లీ ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి ఒక్క సెంచరీ లేకుండా 100 ఇన్నింగ్స్‌లు ఆడాడని.. ప్రపంచంలోనే నంబర్ వన్ ప్లేయర్‌గా పేర్కొనే కోహ్లీ లాంటి ఆటగాడికి ఇది మింగుడుపడని విషయంగా మారిందని జాఫర్ పేర్కొన్నాడు.
Hardik Pandya: తిరిగి టీమిండియాలోకి రావడం నా చేతుల్లో లేదు.. ఐపీఎల్‌పైనే నా దృష్టి