రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ‘మిస్టర్ 360’ ఏబీ డీ విలియర్స్‌కి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తన హోమ్ టీమ్‌గానే ఆ జట్టుని గౌరవిస్తాడు. విరాట్ కోహ్లీతోనూ ఇతనికి మంచి అనుబంధం ఉంది. ఈ జోడీని చూసినప్పుడల్లా క్రికెట్ అభిమానులు మురిసిపోతుంటారు. కానీ, ఈ సీజన్ నుంచి మళ్ళీ ఏబీడీని చూడలేదమని, అతని 360 ఆటను చూడలేమని తెలిసి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఏబీడీ.. కనీసం ఐపీఎల్‌లో అయినా కొనసాగాల్సిందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి ఏబీడీ తిరిగి రావొచ్చన్న ప్రచారం ఊపందుకుంది. మరి, ఇది నిజమా? కాదా? అని విరాట్ కోహ్లీని ప్రశ్నించగా.. నిజమే అన్నట్టుగా క్లూ ఇచ్చాడు. మిస్టర్ నాగ్స్‌తో జరిగిన ఓ ఫన్నీ షోలో, కోహ్లీ ఆ హింట్ ఇచ్చాడు. రాబోయే సీజన్‌లో ఏబీడీ ఆర్సీబీలోకి రీఎంట్రీ ఇవ్వవచ్చేమోనని చెప్పిన కోహ్లీ.. వ్యక్తిగతంగా తాను అతడ్ని బాగా మిస్ అవుతున్నానని, అప్పుడప్పుడు అతనితో మాట్లాడుతుంటానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఏబీడీ అమెరికాలో గోల్ఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడని, అతడు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆర్సీబీ మ్యాచ్‌లను తప్పకుండా ఫాలో అవుతుంటాడని అన్నాడు.
ఇదే సమయంలో కోహ్లీని మిస్టర్ నాగ్స్ ఇరకాటంలో పడేశాడు. మీకు పెట్స్ అంటే ఇష్టమా అని అడిగితే.. చాలా ఇష్టమని కోహ్లీ చెప్పాడు. కానీ, వాటిని చూసుకునే సమయం లేకపోవడం వల్ల ఎలాంటి పెట్స్ పెంచట్లేదని బదులిచ్చాడు. ‘‘మరి, మీ దగ్గర మూడు డక్స్ ఉన్నాయట కదా!’’ అంటూ ఈ సీజన్‌లో కోహ్లీ మూడు సార్లు గోల్డెన్ డక్ అవ్వడంపై పరోక్షంగా ప్రశ్నించాడు. అందుకు కోహ్లీ నవ్వుతూ.. ‘జీవితంలో అన్నీ చూడాలి కదా’ అని సమాధానమిచ్చాడు.