Virat Kohli Wankhede Speech: 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన రోజు కంటతడి పెట్టిన సీనియర్ల భావోద్వేగాలతో తాను కనెక్ట్ కాలేకపోయానని, ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. చాలా కాలంగా టీ20 ప్రపంచకప్ కోసం ప్రయత్నిస్తున్నామన్నాడు. ఇంత మంది అభిమానులను చూస్తుంటే.. తనకు చాలా సంతోషంగా ఉందని విరాట్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టు.. గురువారం స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు.
ఢిల్లీ నుంచి ముంబై చేరుకుని విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న భారత జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. రోడ్ షో జరిగిన సమయంలో మెరైన్ రోడ్డు మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. దాదాపుగా గంటన్నరపాటు సాగిన విజయోత్సవ ర్యాలీ భారత క్రికెట్ చరిత్రలో అపురూపమైన ఘట్టంగా నిలిచింది. ర్యాలీ అనంతరం భారత ఆటగాళ్లను ముంబైలోని వాంఖడె స్టేడియంలో బీసీసీఐ సన్మానించింది. జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని అందించింది. బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమంలో టీమిండియా ప్లేయర్స్ డాన్స్ చేశారు.
Also Read: Hardik-Natasa Divorce: హార్దిక్, నటాషా విడాకులు పక్కా.. కారణం ఇదేనా?
బీసీసీఐ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘రోహిత్ శర్మ, నేను చాలా కాలంగా టీ20 ప్రపంచకప్ కోసం ప్రయత్నిస్తున్నాం. ప్రతిసారి ప్రపంచకప్ గెలవాలని కోరుకున్నాం. చివరికు మా కల నెరవేరింది. వాంఖడె మైదానంకు ట్రోఫీని తిరిగి తీసుకురావడం చాలా ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన రోజు కంటతడి పెట్టిన సీనియర్ల భావోద్వేగాలతో నేను పెద్దగా కనెక్ట్ కాలేకపోయాను. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోంది. ఈ 15 ఏళ్లలో రోహిత్‌ను ఇంత ఎమోషనల్‌గా నేను ఎప్పుడూ చూడలేదు’ అని విరాట్ తెలిపాడు.