భారత పర్యటనను దక్షిణాఫ్రికా జట్టు తెగ ఆస్వాదిస్తోంది. ఏ మాత్రం పసలేని భారత బౌలింగ్ ను సునాయాసంగా ఎదుర్కొంటూ వరుసగా రెండు టీ20ల్లో విజయ దుందుభి మోగించింది. తొలి టీ20లో భారత్ 200పైన స్కోరు చేస్తే దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఊది పారేశారు. రెండో టీ20లో మనోళ్లు 150 కూడా చేయలేదు.. అంతేకాదు ఆరంభంలోనే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టారు.. గెలుపుపై ఆశలు రేపారు. కానీ ఆఖరికి ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. మళ్లీ గెలిచింది దక్షిణాఫ్రికానే. ఒత్తిడిలోనూ ధాటిగా ఆడిన సఫారీ బ్యాటర్లు భారత్‌కు వరుసగా రెండో ఓటమి రుచి చూపించారు. భారత బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ను ఏ మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. భువనేశ్వర్ కుమార్ ఒక్కడే రెండు మ్యాచుల్లో కట్టడిగా బౌలింగ్ చేయగలిగాడు. అంతేకాదు ఎక్కువ వికెట్లు తీసింది కూడా ఇతడే. ముఖ్యంగా రెండో టీ20లో నాలుగు ఓవర్లకు నాలుగు వికెట్లు తీశాడు. అయినా మిగిలిన బౌలర్లలో పస లేకపోవడంతో దక్షిణాఫ్రికా ఉతికి ఆరేసింది.
దీంతో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ భారత బౌలర్లను లక్ష్యంగా చేసుకుని పలు వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా జట్టులో వికెట్లు తీసే బౌలర్లు లేరని ఆయన అభిప్రాయపడ్డారు. కటక్ వేదికగా గతరాత్రి జరిగిన రెండో టీ20లోనూ భారత జట్టు ఓటమిపాలవ్వడంపై బ్యాటింగ్ దిగ్గజం స్పందించారు. భారత జట్టులో వికెట్లు తీసే వారు లేకపోవడం లోటుగా పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నట్టు చెప్పారు.
‘‘భారత స్క్వాడ్ లో వికెట్లు తీసే బౌలర్లు లేకపోవడమే సమస్య. భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్ మాత్రమే మినహాయింపు. వికెట్లు తీస్తేనే ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేయగలవు. రెండు మ్యాచుల్లోనూ భువనేశ్వర్ కుమార్ మినహా మరెవరు అయినా వికెట్ తీసినట్టు కనిపించారా? 211 పరుగులు చేసి కూడా ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోవడం వెనుక సమస్య ఇదే’’అని గవాస్కర్ వివరించారు. తాను చూడ్డానికి ఇష్టపడే ఆటగాళ్లు సచిన్ టెండుల్కర్, ఉమ్రాన్ మాలిక్ అని గవాస్కర్ చెప్పారు. భారత జట్టు వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్‌లో తలపడనుంది.