Sundar Pichai Gives Strong Counter To Pakistan Fan Over India vs Pakistan Match: నిన్న భారత్ సాధించిన అఖండ విజయాన్ని పాకిస్తాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ జట్టే అద్భుతమైన ప్రదర్శన కనబర్చిందని డప్పు కొట్టుకోవడం కోసం.. భారత్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. నో బాల్ విషయం మీద నానా రాద్ధాంతానికి పాల్పడుతున్నారు. ఓ పాక్ అభిమాని అయితే.. తమ పాక్ బౌలర్లు జబర్దస్త్‌గా బౌలింగ్ వేశారని, టీమిండియా బ్యాటర్లను వణికించారని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అతనికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. మళ్లీ తిరిగి కామెంట్ చేయనివ్వకుండా, అతనికి బొమ్మ చూపించాడు.
తొలుత సుందర్ పిచాయ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాక్‌పై సాధించిన విజయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మరీ ముఖ్యంగా.. చివర్లో మూడు ఓవర్లను మరోసారి పండగ చేసుకున్నానని అన్నాడు. ‘‘ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ పండగని జరుపుకుంటున్నారని అనుకుంటున్నా. నేనైతే.. చివరి మూడు ఓవర్లను మరోసారి చూసి పండగ చేసుకున్నాను. టీమిండియా నిజంగా అద్భుతంగా ఆడింది’’ అంటూ ట్వీట్ చేశాడు. అప్పుడు పాక్ అభిమాని ‘మీరు మొదటి మూడు ఓవర్లు చూడాలి’ అని వెటకారంగా ట్వీట్ చేశాడు. పాక్ వేసిన మొదటి మూడు ఓవర్లలో భారత్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడటంతో పాటు రెండు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే! దాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆ పాక్ ఫ్యాన్ అలా ట్వీట్ చేశాడు.
అయితే.. సుందర్ పిచాయ్ ఆ ట్వీట్‌కి ఎంతో తెలివిగా బదులిచ్చాడు. ‘‘నేను ఆ పని కూడా చేశాను. తొలి మూడు ఓవర్లను భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ వేశారు’’ అని కౌంటర్ వేశాడు. ఆ పాక్ అభిమాని పాకిస్తాన్ బౌలింగ్ గురించి ప్రస్తావిస్తే.. సుందర్ పిచాయ్ మాత్రం భారత్ బౌలింగ్ గురించి ప్రస్తావిస్తూ.. చురకలంటించాడు. ఈ దెబ్బకు అతడు తోకముడిచి, సైలెంట్‌గా సైడ్ అయిపోయాడు. సుందర్ పిచాయ్ ఇచ్చిన ఈ కౌంటర్‌కు, భారత్ అభిమానులు ఫిదా అయ్యారు.