ఈ నెల 17 నుండి న్యూజిలాండ్ జట్టుతో భారత్ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడనున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో మొదట కివీస్ తో టీ20 సిరీస్ లో తలపడనున్న టీం ఇండియా ఆ తర్వాత టెస్ట్ సిరీస్ లో పాల్గొంటుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ కోసం జట్టును ప్రకటించిన సమయంలో బీసీసీఐ చాలా విమర్శలు ఎదుర్కొంది. అందుకు ముఖ్య కారణం జట్టులో హనుమ విహారి లేకపోవడం. విహారి టెస్ట్ జట్టులో లేకుండా అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను తీసుకోవడంతో ఆ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. దాంతో విహారిని సౌత్ ఆఫ్రికా వెళ్తున్న భారత ‘ఏ’ జట్టులో కలిపింది బీసీసీఐ. అయితే ఇప్పుడు విహారిని సౌత్ ఆఫ్రికాకు పంపడం వెనుక బీసీసీఐ ప్లాన్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వచ్చే నెలలో భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఆ పర్యటనలో టెస్ట్ సిరీస్ ఆడనుంది. అందుకోసమే విహారి ఇప్పుడు అక్కడికి వెళ్తే… ఆ వాతావరణానికి, పిచ్ లకు అలవాటు పడుతాడు అని బీసీసీఐ భావించింది అని తెలుస్తుంది.