రేపటి నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జూన్ 9న తొలి మ్యాచ్ జరగనుంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టాండ్ ఇన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఐపీఎల్‌లో మంచి ఫామ్‌ను కనపరిచిన రాహుల్ జట్టుకు దూరం కావడం ఊహించని పరిణామం. కేఎల్ రాహుల్ దూరం కావడంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ జట్టు పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది.
మరోవైపు వైస్ కెప్టెన్ బాధ్యతలను హార్డిక్ పాండ్యా నిర్వర్తించనున్నాడు. కాగా సిరీస్ మొత్తానికి కేఎల్ రాహుల్ దూరమైనట్లు సమాచారం అందుతోంది. అతడితో పాటు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ కూడా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రస్తుతానికి ఎవరినీ తీసుకోలేదు. అయితే ఈ సిరీస్‌కు ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా దూరం కావడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.