Team India: ఒకవైపు ఆటలో రాణిస్తున్నా జాతీయ జట్టులో స్థానం దక్కకపోతే ఏ ఆటగాడికైనా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా, దేశవాళీ టోర్నీలలో రాణిస్తున్నా ఎంతో కాలంగా జాతీయ జట్టులో స్థానం కోసం జయదేవ్ ఉనద్కట్ ఎదురుచూస్తున్నాడు. అయితే ఎట్టకేలకు అతడి నిరీక్షణ ఫలించింది. బంగ్లాదేశ్ పర్యటన కోసం ప్రకటించిన టెస్టు జట్టులో సభ్యుడు మహ్మద్ షమీ గాయం కారణంగా తప్పుకోవడంతో అనూహ్యంగా జయదేవ్ ఉనద్కట్‌కు సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్కటే టెస్ట్ ఆడిన ఉనద్కట్ 12 ఏళ్ల తర్వాత మరోసారి జట్టులో స్థానం దక్కించుకోవడానికి అవకాశం వచ్చింది.
Read Also: Teacher Harassment : ప్రాణాలు తీసిన పాకెట్ మనీ..
ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో 10 మ్యాచ్‌లలో 19 వికెట్లు తీసిన జయ్‌దేవ్ ఉనద్కట్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా తన అద్భుత ప్రదర్శనతో కెప్టెన్‌గా సౌరాష్ట్రను విజయ్ హజారే ట్రోఫీ ఛాంపియన్‌గా నిలబెట్టాడు. 2019-20 రంజీ ట్రోఫీలో ఉనద్కట్ 67 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు 96 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 353 వికెట్లు తీశాడు. 12 ఏళ్ల క్రితం 2010లో సౌతాఫ్రికాతో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఉనద్కట్.. మళ్లీ ఇన్నాళ్లకు అవకాశం అందుకున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో అతడికి తుది జట్టులో అవకాశం దక్కితే సుదీర్ఘ కాలం తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి రిఎంట్రీ ఇచ్చిన భారత తొలి ఆటగాడిగా రికార్డులలోకి ఎక్కనున్నాడు.