Ruturaj Gaikwad Lost 10 Tosses in 11 Matches: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. 6 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే.. ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ను చెన్నై ఢీకొట్టనుంది. గుజరాత్‌పై విజయం సాధిస్తే.. పాయింట్స్ పట్టికలో యెల్లో ఆర్మీ ముందుకు దూసుకొస్తుంది. దాంతో ఈ మ్యాచ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే మ్యాచ్ కంటే ముందు.. టాస్ చర్చనీయాంశంగా మారింది.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లలో 10 సార్లు టాస్ ఓడిపోయాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో టాస్ ఓడిన రుతురాజ్.. ఐదవ మ్యాచ్‌లో గెలిచాడు. ఆపై వరుసగా ఆరు మ్యాచ్‌లలో టాస్ ఓడిపోయాడు. టాస్ ఓడిన ఐదింట్లో చెన్నై గెలవడం విశేషం. నేడు కీలక మ్యాచ్ నేపథ్యంలో రుతురాజ్ టాస్ గెలుస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ‘ఈరోజు రుతురాజ్ ఏం చేస్తాడో’ అని చెన్నై ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Also Read: CSK Playoffs Chances: చెన్నైకి చావోరేవో.. గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం!
అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలవాలని చెన్నై ఫాన్స్ కోరుకుంటున్నారు. ఐపీఎల్ 2024లో ఎక్కువ సార్లు టాస్ ఓడిన జట్టు చెన్నైనే కావడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ టీం 2022 ఎడిషన్‌లో తొలి 11 మ్యాచుల్లో పదింట్లో టాస్‌ను కోల్పోయింది. 2012లో ఎంఎస్ ధోనీ 12 సార్లు టాస్ ఓడిపోయినా.. చెన్నై ఫైనల్ ఆడింది. ఇప్పుడు కూడా చెన్నై ఫైనల్ ఆడుతుందని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.