IPL టీవీ, డిజిటల్ ప్రసారాలకి సంబంధించిన మీడియా హక్కుల్ని BCCI వేలంలో ఉంచింది. మొత్తం ఐదేళ్లకాలానికి ఉన్న ఈ రైట్స్ కనీస ధరని రూ.32 వేల కోట్లుగా BCCI నిర్ణయించింది. అయితే IPL మీడియా హక్కుల వేలం ఆదివారం ప్రారంభమైంది. IPL 2023 నుంచి 20 27 సీజన్ వరకూ మీడియా హక్కుల కనీస ధరని రూ.32,440 కోట్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఈ హక్కులు స్టార్ ఇండియా వద్ద ఉండగా.. 2017లో ఐదేళ్ల కాలానికి అంటే 2018-2022 వరకూ రూ.16,347 కోట్లతో అప్పట్లో స్టార్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఐదేళ్లలో IPL ఆదరణ ఎవరూ ఊహించని విధంగా పెరగడంతో.. తాజా వేలంలో భారీ ధర పలికే సూచనలు కనిపిస్తున్నాయి.
2017లోనే 16,347.50 కోట్లకి టీవీ, డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ అమ్మిన BCCI .. ఇప్పుడు ధరని రూ.32,440 కోట్లకి పెంచేసింది. అంటే దాదాపు రెండింతలు. అయినప్పటికి కూడా ప్రముఖ కంపెనీలు IPL మీడియా హక్కుల కోసం పోటీపడుతున్నాయి. ఇందులో రిలయన్స్‌కి చెందిన వయాకాన్ 18, డిస్నీ స్టార్, సోనీ ముందు వరుసలో ఉండగా.. కొత్తగా జీ సంస్థ కూడా పోటీలోకి వచ్చింది. మొత్తంగా.. దాదాపు 10 కంపెనీలు మీడియా హక్కుల ఈ-వేలంలో ఉన్నట్లు తెలుస్తోంది.
IPL మీడియా హక్కుల కోసం సాధారణంగా బిడ్‌లను ఆహ్వానించే BCCI .. తొలిసారి ఈ- వేలం నిర్వహిస్తోంది. ఈ వేలం ఈరోజు నుంచి సోమ లేదా మంగళవారం వరకూ కొనసాగే అవకాశం ఉంది. BCCI రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్‌లో కంపెనీలు వరుసగా బిడ్‌లు వేస్తుంటాయి. చివరికి అత్యధిక బిడ్ వేసిన కంపెనీకి ఈ హక్కులు దక్కనున్నాయి. IPL 2022 సీజన్ 10 జట్లతో జరిగిన విషయం తెలిసిందే.