భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ముగిసింది. మూడు వన్డేల సిరీస్‌ను కివీస్ 2-1తో కైవసం చేసుకుంది. గతంలో భారత గడ్డపై టీమిండియాను టెస్టుల్లో ఓడించిన న్యూజిలాండ్.. ఇప్పుడు వన్డేల్లో కూడా ఓడించింది. ఇరు జట్ల మధ్య బుధవారం (జనవరి 21) నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరగనుంది. ఈ పొట్టి సిరీస్ రెండు జట్లకు టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహకంగా ఉపయోగపడనుంది. టీ20ల్లోనూ రెండు జట్ల మధ్య గట్టి పోరు ఖాయంగా కనిపిస్తోంది.
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత భారత్, న్యూజిలాండ్ టీమ్స్ టీ20ల్లో తలపడుతున్నాయి. 2023 ఫిబ్రవరి 1న ఇరు జట్ల మధ్య చివరగా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ 235 పరుగులు చేయగా.. కివీస్ 66 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 25 మ్యాచ్‌లు జరిగాయి. రెండు టీమ్స్ చెరో14 మ్యాచ్‌ల్లో గెలవగా.. ఒకదాంట్లో ఫలితం తేలలేదు. టీ20ల్లో న్యూజిలాండ్‌పై భారత్ అత్యధిక స్కోరు 234/4 కాగా.. అత్యల్ప స్కోరు 66. టీమిండియాపై కివీస్ అత్యధిక స్కోరు 219/6 కాగా.. అత్యల్ప స్కోరు 79.
న్యూజిలాండ్‌పై రోహిత్ శర్మ (511) అత్యధిక రన్స్ చేశాడు. ప్రస్తుత ఆటగాళ్లలో సూర్యకుమార్ (284 పరుగులు) మొదటి స్థానంలో ఉన్నాడు. టీమిండియాపై కోలిన్ మున్రో (426) అత్యధిక రన్స్ చేయగా.. ప్రస్తుత ప్లేయర్ డారిల్ మిచెల్ (241 రన్స్) అగ్ర స్థానంలో ఉన్నాడు. అత్యధిక సిక్స్‌ల జాబితాలో కూడా పై నలుగురే ఉన్నారు. రోహిత్ (27), సూర్యకుమార్ (15), మున్రో (24), మిచెల్ (11) సిక్సులు బాదారు. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా (12) అత్యధిక వికెట్లు పడగొట్టగా.. కివీస్ తరఫున ఇష్ సోధీ (20) ఉన్నాడు.