Formula E Car Racing: దేశంలోనే తొలిసారిగా ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ 2023లో ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఇప్పటికే ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ క్రీడా ప్రియుల సమక్షంలో ఫార్ములా ఈ-కార్‌ను హైటెక్ సిటీలోని కేబుల్ బ్రిడ్జిపై ఆవిష్కరించారు. విద్యుత్ ఆధారంగా నడిచే సింగిల్ సీటర్ కారును ఈ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం వినియోగిస్తారు. ఈ కారు ట్యాంక్ బండ్ వద్ద ప్రదర్శనకు ఉండనుంది. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా రేసింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్ వంటి నగరాల్లో మాత్రమే ఈ ఫార్ములా ఈ రేసింగులు నడుస్తున్నాయి. వాటి సరసన హైదరాబాద్ కూడా చేరింది. దీనితో భాగ్యనగరం అంతర్జాతీయ ఖ్యాతిని సాధించినట్టయింది. 2023 ఫిబ్రవరి 11వ తేదీన ఈ కార్ రేసింగ్ ఉంటుంది. దీనికి అవసరమైన పనులు త్వరలోనే మొదలు కానున్నాయి. ఫార్ములా E Gen 2 కార్లు ఫార్ములా 1 కార్ల మాదిరిగానే ఉంటాయి కానీ ఈవీ సాంకేతికతతో నడుస్తాయి. ఈ కారు మూడు సెకన్లలోపు 0 నుండి 62 కేఎంపీహెచ్ వేగంతో, 280 కేఎంపీహెచ్ గరిష్ట వేగం ఉంటుంది. కాగా వచ్చే ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఇ ప్రిక్స్ రేసులకు నాందిగా ఫార్ములా ఈ-కారును ట్యాంక్ బండ్ వద్ద ప్రదర్శిస్తారు.