గత మూడేళ్ల నుంచి టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోన్న దినేశ్ కార్తీక్.. ఎట్టకేలకు దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కంబ్యాక్ ఇచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో బెస్ట్ ఫినిషర్‌గా అవతరించి, జట్టులో చోటు సంపాదించాడు. ఈ సిరీస్‌లోనూ అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దినేశ్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని మాజీలు, క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్ననారు. తాజాగా ఈ జాబితాలోకి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ కూడా చేరిపోయాడు.
‘‘ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో రిషభ్ పంత్‌కు నాలుగు మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటే అవకాశం వచ్చింది. కానీ, అతడు చేసిన తప్పునే రిపీట్ చేస్తూ తన వికెట్‌ను కోల్పోతున్నాడు. అఫ్‌కోర్స్.. తప్పులనేవి సహజంగా ప్రతిఒక్కరూ చేస్తారు. అత్యుత్తమ ఆటగాళ్లు ఆ తప్పుల్ని త్వరగానే చక్కదిద్దుకుంటారని నేను భావిస్తున్నాను. అయితే.. ఈ సిరీస్‌లో దినేశ్ కార్తీక్ మాత్రం తనకు దొరికిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటున్నాడు. భారత్ ప్రపంచకప్ గెలవాలంటే.. అతడు జట్టులో ఖచ్చితంగా ఉండాల్సిందే! ఎందుకంటే.. కార్తీక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు’’ అని డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు.
కాగా.. ప్రస్తుతం భారత జట్టులో వికెట్ కీపర్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. టీ20 వరల్డ్‌కప్‌కు బీసీసీఐ కేవలం ఇద్దరు వికెట్ కీపర్‌లనే ఎంపిక చేసే అవకాశం ఉంది. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ అదరగొడుతున్నాడు కాబట్టి, అతడు బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఫినిషర్ పాత్ర కోసం పంత్ లేదా కార్తీక్‌కు ఛాన్స్ దక్కొచ్చు. ప్రస్తుత సిరీస్‌లో పంత్ పేలవంగా రాణిస్తున్నాడు. కార్తీక్ మాత్రం దుమ్ముదులిపేస్తున్నాడు. చూస్తుంటే, పంత్‌కు కార్తీక్ నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది.