Another Shock To Australia Cricket Team: అసలే ఆస్ట్రేలియా జట్టు రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన ఒత్తిడిలో ఉంది. మరో రెండు మ్యాచ్‌ల పరిస్థితి ఏంటా? అని ఆందోళనలో మునిగింది. ఇలాంటి సమయంలో ఆ జట్టుకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే జోష్ హాజిల్‌వుడ్ కాలి చీలమండ గాయం కారణంగా సిరీస్ మొత్తానికే దూరం అయ్యాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా అతని బాటే పట్టాడు. మిగిలిన రెండు మ్యాచ్‌లకు గాను అతడు జట్టుకి దూరమయ్యాడు. రెండో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా సిరాజ్ బౌలింగ్‌లో ఎడమ చేతికి గాయం కావడంతో, విశ్రాంతి కోసం జట్టు నుంచి వైదొలగాల్సి వచ్చింది.
వార్నర్ స్కాన్ రిపోర్ట్స్‌లో వెంట్రుకవాసి అంత ఫ్రాక్చర్‌ను తాము గుర్తించామని ఆసీస్ మేనేజ్‌మెంట్ వివరించింది. ఈ నేపథ్యంలోనే హాజిల్‌వుడ్‌తో పాటు వార్నర్ కూడా ఆస్ట్రేలియాలకు బయలుదేరుతాడని పేర్కొంది. భారత్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు వార్నర్ తిరిగి జట్టుతో చేరుతాడని ఆశాభావం వ్యక్తం చేసింది. కేవలం ఈ ఇద్దరే కాదండోయ్.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సైతం వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లాడు. అతడు ఎప్పుడు తిరిగిస్తాడో గ్యారెంటీ లేదు. ఇలా ముగ్గురు ఆటగాళ్లు జట్టుకు దూరం కావడంతో.. మిగిలిన రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టు ఎలా రాణిస్తుందో ప్రశ్నార్థకంగా మారింది. ఆ ముగ్గురి స్థానాల్లో ఎవరిని తీసుకుంటారన్న విషయంపై సైతం ఆసీస్ మేనేజ్‌మెంట్ నోరు మెదపడం లేదు.
కాగా.. ఇప్పటివరకు భారత్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచెస్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయాల్ని చవిచూసింది. తొలి టెస్టులో ఒక ఇన్నింగ్స్‌తో పాటు 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్ట్.. ఇంకా రెండు రోజులు మిగిలుండగానే మ్యాచ్‌ని భారత్ ముగించేసింది. ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అశ్విన్‌తో పాటు రవీంద్రా జడేజా తిప్పేయడంతో, రెండో మ్యాచ్ సునాయాసంగా నెగ్గింది. దీంతో.. నాలుగు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.