లావు శ్రీకృష్ణదేవరాయులు. నరసరావుపేట వైసీపీ ఎంపీ. ఇదే ప్రాంతానికి చెందిన మరో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల చుట్టూ నరసరావుపేట వైసీపీ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ఒకరు ఎగ్జిట్ అయ్యి.. ఇంకొకరు ఎంట్రీ ఇస్తారనే చర్చ అధికారపార్టీ వర్గాల్లో ఊపందుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కేంద్రంగా జరుగుతున్న ప్రచారం.. చర్చలు మరెంతో ఉత్కంఠ రేపుతోంది.
మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి 2009లో నరసరావుపేట టీడీపీ ఎంపీ. 2014కు వచ్చేసరికి గుంటూరు పశ్చిమ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో టీడీపీలో ఉన్న కొందరు నాయకులతో విభేదాలు వచ్చి వైసీపీలో చేరారు మోదుగుల. 2019లో గుంటూరు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలిచినా సక్సెస్ కాలేదు. ఎన్నికల మేనేజ్‌మెంట్ సరిగా చేసుకోలేక మోదుగుల ఓడిపోయారని పార్టీ వర్గాల్లో ఒక అభిప్రాయం ఉంది. ఆ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం.. తాను ఓడిపోవడంతో కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. వైసీపీ కార్యక్రమాల్లో అరుదుగా కనిపించేవారు. కానీ.. ఇటీవల కాలంలో పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు మోదుగుల. పార్టీ కార్యక్రమాలతోపాటు అన్నిచోట్లా ఆయన కనిపిస్తున్నారు. ఇదంతా పార్టీ అధినేత జగన్‌ను కలిసిన తర్వాత వచ్చిన మార్పుగా వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి మోదుగుల పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇక్కడ పార్టీ సిట్టింగ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఉండగా.. మోదుగులకు ఎందుకు టికెట్ ఇస్తారో కూడా పార్టీ వర్గాలు ప్రచారంలో పెట్టేస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయులకు లోక్‌సభ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలతో పడటం లేదు. ఒకరిద్దరు మినహా ఆయన్ని నియోజకవర్గానికి పిలిచే ఎమ్మెల్యేలు లేరు. ఆ మధ్య వినుకొండ పరిధిలో ఒక రైతు కామెంట్స్ విషయంలో రచ్చ రచ్చ అయింది. అక్కడ ఎమ్మెల్యే బొల్లాను కాకుండా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున్‌ను ప్రోత్సహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వినుకొండలో MPకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు బొల్లా. ఇక మంత్రి రజనీతో కూడా ఎంపీకి విభేదాలు ఉన్నాయి. పైగా శ్రీకృష్ణదేవరాయులు పార్టీ మారిపోతారని ఆయన వైరి వర్గం గట్టిగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా.. వైసీపీ వర్గాల్లో అనుమానాలు ఉన్నాయని కొందరి వాదన. అందుకే అధికారపార్టీ సేఫ్ గేమ్ ఆడుతోందని అభిప్రాయపడుతున్నారట.
నరసరావుపేటలో మోదుగుల ఎంట్రీకి చెబుతున్న ఇతర కారణాలు కూడా మరెంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆయన గతంలో ఇక్కడ ఎంపీగా పోటీ చేసి ఉండటంతో.. ఆ పరిచయాలు కలిసి వస్తాయని మరోవర్గం ప్రచారం మొదలు పెట్టేసింది. పైగా పార్టీ నాయకత్వం ఆశీసులు పూర్తిగా ఉన్నాయని చెబుతున్నారట. గత ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ బరిలో వైసీపీ నుంచి కిలారు రోశయ్యను పోటీకి దించాలని చూశారు. కానీ.. చివరిక్షణంలో జరిగిన మార్పులు చేర్పుల్లో రోశయ్యను పొన్నూరు అసెంబ్లీకి పంపి.. మోదుగులను ఎంపీగా బరిలో నిలిపారు. ఆ ఎన్నికలు కలిసిరాకపోవడంతో మోదుగుల మళ్లీ నరసరావుపేటనే నమ్ముకున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రస్తుత పరిణామాలు కూడా అనుకూలంగా ఉండటంతో గేర్ మార్చేస్తున్నారట ఈ మాజీ ఎంపీ. ఇంకో ప్రచారం కూడా ఇక్కడ నడుస్తోంది. శ్రీకృష్ణదేవరాయులు పార్టీలోనే ఉంటే ఆయన్ని గుంటూరు పంపి.. మోదుగులకు నరసరావుపేట ఎంపీ టికెట్ ఇస్తారని చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. ఎంపీ, మాజీ ఎంపీల రాజకీయ భవిష్యత్ ఏంటో కాలమే చెప్పాలి.