జనంతో బాగా గ్యాప్ వచ్చిందని ఆ జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీలు ఆందోళన చెందుతున్నారా? మళ్లీ ప్రజలకు దగ్గర య్యేందుకు డివోషనల్ బాట పట్టారా? సడెన్‌గా ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇంతకీ ఎవరా నాయకులు?
ప్రజాప్రతినిధుల భక్తి లెక్కలు వేరా?
గుస్సాడీ నృత్యాలు.. కార్తీక దీపోత్సవాలు..! ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇవన్నీ ఏ ధార్మిక సంస్థలో నిర్వహిస్తున్నాయంటే పొరపాటు. ఫౌండేషన్ ద్వారా కొందరు.. సొంతంగా మారికొందరు తమలోని భక్తిని భారీగానే బయటపెడుతున్నారు. పైకి ఇవి సాంస్కృతిక, ఆథ్యాత్మిక కార్యక్రమాలుగా కనిపిస్తున్నా.. వీటిని నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధుల భక్తి లెక్కలు వేరే ఉన్నాయట. వాటిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.
కార్తీక దీపోత్సవాలు.. గుస్సాడీ వేడుకలు..!
నిన్న మొన్నటి వరకు హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్న టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు సొంత నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. వస్తూ వస్తూనే కార్యక్రమాల స్పీడ్ పెంచేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ ఎంపీ సోయం బాపురావు, కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా కార్తీక దీపోత్సవాలు, గుస్సాడీ వేడుకలు నిర్వహిస్తున్నారు.
జనాలతో వచ్చిన గ్యాప్ పూడ్చే పనిలో ఉన్నారా?
ఆ మధ్య టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్ నేతలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. ప్రజలకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వచ్చిందని హెచ్చరించారట. ఆ దూరాన్ని తగ్గించుకోవాలంటే జనాల్లోకి వెళ్లాలని పార్టీ పెద్దలు సూచించడంతో.. ఈ విధంగా కార్తీక మాసాన్ని వాడేసుకుంటున్నట్టు సమాచారం. ప్రభుత్వ పథకాల పేరుతో జనాల్లోకి వెళ్లడంతోపాటు.. కార్తీక మాసంలో దీపోత్సవాలు నిర్వహిస్తే.. ఎక్కువ మందిని రీచ్ కావొచ్చని లెక్కలేశారట. దీంతోపాటు ఆదివాసీలలో పట్టు సాధించేందుకు.. గుస్సాడీ వేడుకలు చేపట్టారు.
దండారి పండగ పేరుతో జనాల్లోకి బీజేపీ నేతలు..!
నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ యాక్టివిటీస్ చూశాక.. బీజేపీ నేతలు ఉలిక్కి పడ్డారట. ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో తమకు దక్కాల్సిన క్రెడిట్‌ను టీఆర్ఎస్ నేతలు కొట్టేస్తున్నారని అనుమానించి.. ఎంపీ సోయం బాపురావ్ ఆధ్వర్యంలో గుస్సాడీలను ఒక్కచోట చేర్చి దండారి పండగను ఘనంగా నిర్వహించారు. ఆదివాసీలలో తమ పట్టు సడలకుండా జాగ్రత్త పడ్డారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి యాదాద్రి ఆలయం కలివచ్చింది. ప్రజాప్రతినిధులను, ప్రజలను ఆహ్వానించి వైభవంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం జరిపించారు. యాదాద్రి ఆలయ విమాన గోపురం బంగార తాపడం కోసం తన వంతుగా ఒక కిలో గోల్డ్ ఇస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. విరాళాల ద్వారా మరో కిలో బంగారం విరాళంగా ఇస్తామని ఆయన తెలిపారు. ఈ విధంగా ఇంద్రకరణ్‌రెడ్డి సైతం తన టాస్క్‌లో కొంత వరకు పూర్తి చేసేశారు.
అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోతున్న జనం..!
కార్తీక మాసం కాబట్టి ఈ కార్యక్రమాలు ఘనంగా చేశామని ఎమ్మెల్యేలు, ఎంపీలు పైకి చెబుతున్నా.. అసలు విషయం తెలిసిన వారు మాత్రం.. నోళ్లెళ్ల బెడుతున్నారట. ఎంతైనా మా ఎమ్మెల్యే, ఎంపీల లెక్కలు వేరని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. మరి.. ఈ డివోషనల్ ప్లాన్ ప్రజాప్రతినిధులకు ఎంత వరకు వర్కవుట్ అవుతుందో.. జనాలతో కనెక్టివిటీ పెరుగుతుందో లేదో చూడాలి.