అధికారం కోల్పోయిన రెండున్నరేళ్ల తర్వాత ఆ నియోజకవర్గంలో ఓ ప్రయోగం చేసింది టీడీపీ. మాజీ ఎమ్మెల్యేను తప్పించి నియోజకవర్గ బాధ్యతలను మరోనేత చేతుల్లో పెట్టింది. గ్రౌండ్‌లో మాత్రం సీన్ మరోలా ఉందట. ఓ మాజీ మంత్రి కుమారుడు అక్కడ కన్నేయడంతో రాజకీయం రసకందాయంలో పడిందట.
టీడీపీ అంతర్గత రాజకీయాలు గవిరెడ్డిని ఓడించాయా?
విశాఖజిల్లా మాడుగుల. ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత ఆరుసార్లు ఇక్కడ పసుపు జెండానే ఎగిరింది. 2009లో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినప్పటికీ ఇక్కడ టీడీపీ గెల్చింది. ఆ ఎన్నికల్లో గెలుపొందిన గవిరెడ్డి రామానాయుడు.. మాడుగులలో పార్టీకి నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. 2014, 2019ల్లో టిక్కెట్ దక్కినా.. అంతర్గత రాజకీయాలు గవిరెడ్డిని ఓడించాయి. వైసీపీ బలం పుంజుకోవడంతో టీడీపీ లీడర్లు.. కేడర్ ఫ్యాన్ గూటికి చేరిపోయారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రభుత్వ విప్‌గా ఉన్న బూడి ముత్యాల నాయుడిదే మాడుగులలో హవా.
గవిరెడ్డిని తప్పించి పీవీజీ కుమార్‌ను ఇంఛార్జ్‌ను చేసిన టీడీపీ..!
టీడీపీలో జోష్ తగ్గడంతో.. రెండున్నరేళ్ల తర్వాత పార్టీ పుంజుకుంటుందనే అంచనాలు మొదలయ్యాయి. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ వద్దని అధిష్ఠానం సూచించినా కొన్నిచోట్ల టీడీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్వవైభవం ఖాయమని కేడర్ అనుకుంటున్న తరుణంలో టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. గ్రూప్ తగాదాలతో మూడు ముక్కలాట నడుస్తుండగా కొత్త పంచాయితీకి తెరలేచింది. మాడుగుల సీటు కోసం మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, పీవీజీకుమార్, పైలా ప్రసాద్ పోటీపడ్డారు. ముగ్గురు మూడు గ్రూపులుగా విడిపోయి ఎవరి రాజకీయం వారిదే అన్నట్టు వ్యవహరించారు. ఈ వైఖరి పార్టీకి నష్టమని భావించిన హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే రామానాయుడిని ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ స్ధానంలో పీవీజీ కుమార్‌ను నియమించింది.
మాడుగులలో విందు రాజకీయాల జోరు..!
నాయకత్వం మార్పునకు ఐవీఆర్ఎస్ సర్వే రిపోర్టే ఆధారమని టీడీపీ హైకమాండ్ చెబుతోందట. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు రాజకీయానికి తెరలేచింది. గవిరెడ్డిని తప్పించడం వెనక పార్టీలో బలమైన నేతలు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే వర్గం అనుమానం. ఈ అంశంలో తాడోపేడో తేల్చుకోవాలని భావించి.. కొత్త ఇంఛార్జ్ తమకొద్దని చెబుతున్నారు తమ్ముళ్లు. మండలాల వారీగా శిబిరాలు పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారట. దీంతో మాడుగులలో విందు రాజకీయాలపై చర్చ జరుగుతోంది.
మాడుగులపై ఓ మాజీ మంత్రి కుమారుడి కన్ను..!
మాడుగులలో కొత్త వ్యక్తిని టీడీపీ ఇంఛార్జ్‌గా చేయడం వెనక ఒక మాజీ మంత్రి కుమారుడి హస్తం ఉందట. వచ్చే ఎన్నికల వరకు తన మనిషైన వ్యక్తిని ఇంఛార్జ్‌గా పెట్టి.. అక్కడ బలం పెంచుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఆ యువనేత వ్యూహంగా తెలుస్తోంది. గవిరెడ్డి వర్గం కూడా ఇది పసిగట్టిందట. ఆ యువనేత ప్రయత్నాలను అడ్డుకునేందుకు అచ్చెన్నాయుడు, చినరాజప్ప తదితరుల దగ్గరకు అనుచరులతో వెళ్లి గోడు వెళ్లబోసుకుంటున్నారట గవిరెడ్డి. ఈ పంచాయితీ లోకేష్ దగ్గరకు చేరినట్టు సమాచారం.
మాడుగుల టీడీపీలో రగడ నివురు గప్పిన నిప్పేనా..?
ప్రస్తుతం మాడుగుల టీడీపీలో ఈ రగడ నివురు గప్పిన నిప్పులా ఉంది. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా పని చేసుకుంటూ పోతున్నారు. పార్టీ శ్రేణులు కూడా చెరో శిబిరంలో చేరినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొటోంది. ఇలాంటి సమయంలో మాడుగుల టీడీపీలో ఎత్తులు.. జిత్తులను చూసి కేడర్ కలవర పడుతుందట. మరి.. ఆధిపత్యపోరులో మాజీ మంత్రి కుమారుడు పైచెయ్యి సాధిస్తారో.. మాజీ ఎమ్మెల్యే పట్టు నిరూపించుకుంటారో చూడాలి.