ఆయనో డిప్యూటీ సీఎం. రోజూ జనంతో సంబంధం ఉండే శాఖ ఆయనే చూస్తున్నారు. సీఎం రివ్యూలకూ టంచన్‌గా హాజరయ్యే ఆ మంత్రిగారు సొంత నియోజకవర్గ ప్రజలకు మాత్రం కనిపించడం లేదట.
మంత్రి ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు?
ఆళ్ల నాని. ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. వైద్య ఆరోగ్యశాఖ అంతా ఆయనే చూస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన నియోజకవర్గ ప్రజలకు కనిపించడం లేదట. మంత్రి కోసం ఆయన ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర ఎదురు చూస్తున్నవాళ్లకు తీవ్ర నిరాశే మిగులుతోందట. ఒక్కసారి ఇంట్లో ఉండి కూడా జనాన్ని కలవడానికి మంత్రి ఇష్టపడటం లేదట. ఎంత టైమ్ అయినా సరే మంత్రిని కలవాల్సిందే. సమస్యలు చెప్పుకోవాల్సిందే అని ఎవరైనా పట్టుదలతో ఉంటే.. అమరావతి వెళ్లమని చెబుతున్నారట మంత్రి సిబ్బంది. తీరా అక్కడికి వెళ్తే.. మంత్రి ఇక్కడ లేరని సింపుల్‌గా చెప్పేస్తున్నారట. మంత్రి ఇలా ఎందుకు జనాన్ని తప్పించుకు తిరుగుతున్నారు. ఎవరికీ అర్థం కావడం లేదట.
మంత్రి చుట్టూ ఉన్న కోటరీని సంతృప్తి పర్చడమే సమస్య?
ఏలూరులో మంత్రి చుట్టూ ఎప్పుడూ ఓ కోటరీ ఉంటుందట. ఎవరైనా సరే వారిని దాటితేనే మంత్రిగారిని కలవగలరట. వాళ్లను సంతృప్తి పరచడమే ఇప్పుడు ఏలూరు జనానికి సమస్యగా మారిందట. 2004లో మొదటిసారిగా ఏలూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు నాని. 2009లో ఓడిపోయారు. వైఎస్ మరణం తర్వాత జగన్‌కు దగ్గరయ్యారు. జగన్ ఓదార్పు యాత్ర కూడా ఏలూరు నుంచే శ్రీకారం చుట్టారు. 2014 ఎన్నికల్లో ఓడిన ఆళ్ల నానిని ఎమ్మెల్సీని చేశారు జగన్. 2019లో గెలుస్తూనే కేబినెట్‌లోకి తీసుకుని ఏకంగా డిప్యూటీ సీఎంను చేసేశారు జగన్. ఇన్నిసార్లు ఓడిన ఆళ్లనాని జనానికి దగ్గరగా ఉండకపోవడానికి కారణం మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఏలూరు వాసులకు అంతుచిక్కని మంత్రి తీరు..!
త్వరలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎలాగూ మాజీ అవుతాం కదా అని .. ఇప్పటి నుంచే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు. పెద్దగా కలుపుగోలు తనం లేని ఆళ్లనాని తీరు ఏలూరు వాసులకు అంతుబట్టడం లేదు. జనంతో కలవమంటే కలవలేకపోయారు. చివరకు పార్టీ పిలుపు ఇచ్చిన జనాగ్రహ దీక్షలోనూ ఆళ్లనాని కనిపించకపోవడంతో మంత్రి వ్యవహారంపై సీరియస్‌గా చర్చ జరుగుతోంది.