ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. అధికార పార్టీపై పదునైన విమర్శలు చేస్తూ.. ప్రభుత్వంపై విరుచుకుపడుతూ.. మధ్య మధ్యలో జనాలతో మాట్లాడుతూ యాత్ర సాగుతోంది. ఇదే సమయంలో షర్మిల మరో విధంగానూ చర్చల్లోకి వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే పోటీ చేస్తారని.. ఇందుకు ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకున్నారన్నది ఆ చర్చ సారాంశం. షర్మిల పార్టీ పెట్టిన కొత్తలోనూ ఇలాంటి ప్రచారం సాగినా.. ఇప్పుడు మాత్రం మరింత బలంగా ఆ మాట వినిపిస్తోందని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయట. జిల్లాలోని పాలేరు నుంచి షర్మిల అసెంబ్లీకి పోటీ చేస్తారని అనుకుంటున్నారట.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు నియోజకవర్గాలు మాత్రమే జనరల్. వాటిల్లో కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం ఉన్నాయి. కొత్తగూడెంలో బీసీలకు.. ఖమ్మంలో కమ్మ సామాజికవర్గానికి, పాలేరులో రెడ్డి సామాజికవర్గానికి పార్టీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాయి. పాలేరు సెగ్మెంట్ ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువసార్లు గెలిచిన పార్టీ కాంగ్రెస్సే. మూడుసార్లు వామపక్షాలు పాగా వేయగా.. ఒకసారి బైఎలక్షన్‌లో తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్‌రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు అక్కడ బలమైన నాయకత్వం లేదన్న వాదన ఉంది. అలాగే YS రాజశేఖర్‌రెడ్డికి అభిమానులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంగా లెక్కలేస్తున్నారట. ఆ కారణంగానే YS తనయగా.. షర్మిల వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది.
YSRTP ఆవిర్భావ సభ కూడా ఖమ్మంలోనే జరిగింది. అప్పుడే షర్మిల, పాలేరు చుట్టూ ప్రచారం సాగింది. అప్పట్లో పాదయాత్రలో భాగంగా నల్లగొండ నుంచి ఖమ్మం వస్తూ పాలేరు నియోజకవర్గంలోని కుసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటించారు షర్మిల. ఈ నెల 18న మరోసారి పాలేరు నియోజకవర్గంలో పాదయత్ర చేయబోతున్నారు. నేలకొండపల్లి మీదుగా నల్లగొండ జిల్లాలోకి వెళ్తారట. పాదయాత్రలో భాగంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు షర్మిల. పాలేరులో పోటీపై ఈ సమీక్షలో క్లారిటీ వస్తుందా? లేక సంకేతాలు ఇచ్చి సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తారో తెలియదు. YSRTP కార్యకర్తలు మాత్రం షర్మిల అసెంబ్లీకి పోటీ చేసేది పాలేరు నుంచే అని ఘంటా పథంగా చెప్పేస్తున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పాలేరు చుట్టూనే చర్చ జరుగుతోంది. మరి.. ఈ అంశంపై YS షర్మిల ఎప్పుడు స్పష్టత ఇస్తారో చూడాలి.