నిప్పు లేనిదే పొగ రాదు. ఆ ప్రాంతంలో మంత్రి తీరుపై ఎమ్మెల్యేల గుస్సా కూడా అలాగే ఉందట. వారికి తెలియకుండా నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారట ఆ మంత్రిగారు. ఇంకేముందీ నిన్న మొన్నటి వరకు సఖ్యంగా ఉన్న ఎమ్మెల్యేలు నారాజ్ అవుతున్నారట. అమాత్యుల వారిని కట్టడి చేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మంత్రి మల్లన్న తీరుపై ఎమ్మెల్యేలు గుర్రు!
టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన పరిస్థితులలో ఎమ్మెల్యేగా పోటీ చేసి మేడ్చల్‌లో గెలిచారు మల్లారెడ్డి. అనూహ్యంగా మంత్రి అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ కార్మిక శాఖ మంత్రి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అప్పట్లో మల్లారెడ్డితో కలిసి ముందుకు సాగిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయన తీరుపై గుర్రుగా ఉన్నారట. మన మల్లన్నే కదా అని చనువుగా ఉంటే.. మొదటికే మోసం వస్తుందని ఇబ్బంది పడుతున్నారట. ఇదే ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో రచ్చ రచ్చగా మారుతోంది.
నియోజకవర్గాల్లో మంత్రి తలదూరుస్తున్నారా?
మంత్రి మల్లారెడ్డి ఆ ఎమ్మెల్యేలతో సమన్వయం లేకుండా ముందుకు సాగుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా అక్కడి వారితో మంత్రి మల్లారెడ్డి నేరుగా మాట్లాడుతూ వ్యవహారాలు చక్కబెడుతున్నారట. దీనితో మంత్రి మల్లారెడ్డి తీరుపై నారాజ్‌గా ఉన్నారట శాసనసభ్యులు. సరదాగా షేర్ చేసే విషయాలను.. బయటకు చెప్పకూడని అంశాలను మల్లారెడ్డి బహిర్గతం చేయడం సరికాదన్నది వారి అభిప్రాయం. ఇదే ఒక తలనొప్పి అనుకుంటే.. నేరుగా తమ నియోజకవర్గాల్లో మంత్రి తలదూరుస్తున్నారని ఆగ్రహంతో ఊగిపోతున్నారట.
ఎమ్మెల్సీలు మంత్రితో ఇబ్బంది పడుతున్నారా?
ఇక నియోజకవర్గాల్లో శంకుస్థాపనులు.. ప్రారంభోత్సవాలకు పిలిస్తే.. సమయం కేటాయించే విషయంలో మంత్రి ఏ మాత్రం స్థానిక ఎమ్మెల్యేలకు సహకరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే శేరి సుభాష్‌రెడ్డి, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ నియోజకవర్గాల్లో మంత్రి మల్లారెడ్డి తీరుపై విమర్శలు వస్తున్నాయట. వీరే కాకుండా.. ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌రావులు సైతం మల్లన్నతో ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు.
మొదటికే మోసం వస్తోందని ఎమ్మెల్యేలు ఆందోళన!
ఈ నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన ఏ ఇద్దరు కలిసినా ఈ రగడపైనే చర్చించుకుంటున్నారట. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే సుప్రీం అని టీఆర్‌ఎస్ స్పష్టం చేసినా మంత్రి మల్లన్న పట్టించుకోవడం లేదన్నది వారి ఆగ్రహమట. అందుకే మంత్రిని ఎలా కట్టడి చేయాలి? వదిలేస్తే మొదటికే మోసం వస్తుందేమో అని శాసనసభ్యులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.
తీరు మార్చుకోవాలని మంత్రికి సంకేతాలు పంపారా?
ఈ సమస్య ఎలాంటి మలుపు తీసుకుంటుందో అన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో ఉంది. అందుకే మీరు తీరు మార్చుకోకపోతే ఇబ్బందే.. కాస్త దృష్టిలో పెట్టుకోండి అని ఇన్‌డైరెక్ట్‌గా మంత్రి మల్లారెడ్డికి సంకేతాలు పంపారట ఎమ్మెల్యేలు. మంత్రి మల్లన్న తీరుమార్చుకుంటారా? ఎమ్మెల్యేలతో అడ్జెస్ట్ అవుతారా? మునుపటిలా సయోధ్య సాధ్యమేనా అన్నది ఆసక్తిగా మారింది. పార్టీ పెద్దలు కూడా ఇక్కడి వ్యవహారాలపై ఓ కన్నేసినట్టు చెబుతున్నారు. మరి.. విభేదాలు ముదురు పాకాన పడకుండా పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.