ఆ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇక సింగిల్ టైం శాసనసభ్యుడిగానే మిగిలిపోతారా? నేను మోనార్క్‌ని, నచ్చినట్టు చేసుకుని పోతాను తప్ప ఎవ్వరితో నాకు పనిలేదని సదరు ఆఫీసర్ టర్న్‌డ్ ఎమ్మెల్యే అంటున్నారా? నియోజకవర్గంలో గ్రూప్స్‌ని సెట్ చేయాల్సిన నాయకుడే ఇంకా ఎగదోస్తున్నారా? దానివల్ల ఆయనకేంటి ఉపయోగం? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా మోనార్క్ స్టోరీ?
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీదే హవా. ఆ పార్టీ తరపున మాకినేని పెదరత్తయ్య వరుసగా ఐదు సార్లు గెలిచారు. 2004 నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నా…పట్టు నిలుపుకుంటూనే ఉంది తెలుగుదేశం. ఇక 2024 ఎన్నికల్లో మాజీ ఐఏఎస్ అధికారి బూర్ల రామాంజనేయులు ఇక్కడి నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కూడా పనిచేశారాయన. పరిస్థితులన్నీ తెలుసుకాబట్టి ప్లస్ అవుతారనుకుంటే… కొంత కాలంగా ఆయన వ్యవహారశైలితో ప్రత్తిపాడు టీడీపీలో నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో పత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, కాకుమాను, గుంటూరు రూరల్ మండలాలున్నాయి. ఈ ఐదింటిలో ప్రతి చోట గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయి. పత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో అయితే…తరచూ బయటపడుతూనే ఉన్నాయి. ఇక కాకుమాను, గుంటూరు రూరల్‌లో అంతర్గతంగా రగిలిపోతోంది పార్టీ. తరచూ అభ్యర్థుల్ని మార్చడం వల్ల తయారైన గ్రూప్స్‌తో ఇప్పటికే అల్లాడుతుంటే… వాటికి ఎమ్మెల్యే వైఖరి ఆజ్యం పోసినట్టు అవుతోందన్నది పార్టీ టాక్. విభేదాలను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే రామాంజనేయులు ఆ దిశగా కనీసం కృషి చెయ్యడంలేదనే విమర్శలు పార్టీలో ఉన్నాయి. పైగా వాటిని ప్రోత్సహించేలా ఆయన వైఖరి ఉంటోందన్న విమర్శలు పెరుగుతున్నాయి.
పత్తిపాడు మండలం గొట్టిపాడు డ్వాక్రా యానిమేటర్ వ్యవహారమై ఆ మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో ఓ వర్గం యానిమేటర్‌ని తొలగించాలని, ఉంచాల్సిందేనని మరో వర్గం పట్టుబట్టాయి. ఈ వ్యవహారంలో ఉన్న అపోహలను తొలగించాల్సిన ఎమ్మెల్యే ఎవ్వర్నీ పట్టించుకోలేదు. పైగా.. యానిమేటర్ కూడా బదిలీ లేకుండా అక్కడే ఉన్నారు. దాంతో.. ఎమ్మెల్యే ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నట్టు మరో వర్గం భావించింది. గొట్టిపాడులో ఇప్పటికీ ఆ సమస్య అలాగే ఉంది. ఇక పెదనందిపాడు మండలం పాలపాడులో వాటర్ ప్లాంట్ వ్యవహారంలో కూడా ఎమ్మెల్యే ఇలాగే వ్యవహరించారు. దీంతో అక్కడ కూడా సొంత పార్టీ నేతలే ఆయన తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఇక కొన్ని రోజుల క్రితం ప్రత్తిపాడులో ఎఫ్.సి.ఐ. గోడౌన్ ప్రారంభోత్సవానికి వెళ్లారు ఎమ్మెల్యే రామాంజనేయులు. అదే సమయంలో అక్కడకు వచ్చిన టీడీపీ మైనార్టీ నేతలు గ్రామంలో కొత్తగా నిర్మించబోతున్న షాదీఖానాకు ఎమ్మెల్యే చేతుల మీదుగా విరాళం ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ… ఆయన వాళ్ళని పట్టించుకోకుండా వెళ్లిపోయారు.
దీంతో టీడీపీ మైనార్టీ నేతలంతా ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమను పట్టించుకోకపోవడం ఏంటంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపు మళ్లీ ఓట్లు అడగడానికి మా దగ్గరికి రాకుండా పోతారా అంటూ కోపంగా ఉన్నారు ముస్లిం నాయకులు. ఇక ఇంటి స్థలాల సమస్యతో కొంతమంది పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా సరిగా స్పందించలేదట. దాంతో వాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ….. సమావేశాలు పెట్టి మీ సమస్యలు మా దృష్టికి తీసుకురమ్మని చెబుతారు…తీరా వస్తే స్పందించరని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ మాత్రం దానికి మీటింగ్‌లు ఎందుకు దంగడ అంటూ అక్కడనుంచి వెళ్లిపోయారు. నియోజకవర్గంలోని కొందరికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పార్టీలో విమర్శలు పెరుగుతున్నాయి. రామాంజనేయులు పోటీ చేసినప్పటినుంచి ఆయనతోనే ఉన్న నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ నేత వారం రోజులుగా కనిపించడంలేదు. ఎమ్మెల్యే తీరుతో మనస్తాపానికి గురైన ఆ నేత దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఉన్న విబేధాలను పరిష్కరించకపోగా తన వ్యవహారశైలితో ఎమ్మెల్యే సమస్యను మరింత పెంచుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది పత్తిపాడులో.