అక్కడ మామ పొలిటికల్ జర్నీకి అల్లుడు మోకాలడ్డుతున్నాడా? లేక అల్లుడికి చెక్ పెట్టేందుకు మామ కామ్‌గా పావులు కదుపుతున్నాడా? సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని రెండు పక్షాల అనుచరులు రక్తి కట్టిస్తున్నారా? గత ఎన్నికల్లో అల్లుడి చేతిలో ఓడిన ఆ మామ ఎవరు? ఇద్దరి మధ్య సోషల్ యుద్ధంలో బయటికి వస్తున్న కొత్త విషయాలేంటి? పల్నాడు జిల్లా పెదకూరపాడు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున భాష్యం ప్రవీణ్, వైసీపీ నుంచి నంబూరు శంకరరావు పోటీ చేశారు. వీళ్ళిద్దరూ వరుసకు మామా, అల్లుళ్లు కాగా…. ప్రవీణ్ విజయం సాధించారు. ఇక ఓటమి తర్వాత నంబూరు శంకరరావు నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. కానీ… ఇక నుంచి యాక్టివ్ అవ్వాలని, నియోజకవర్గంలో పర్యటనలు చేయాలని డిసైడ్ అయ్యారట ఆయన. దీంతో అల్లుడికి చిర్రెత్తుకొచ్చి…. రాజకీయాలు చేస్తావా అంటూ అనుచరులతో హడావుడి చేశారు. అదికాస్తా శృతిమించి దాడుల దాకా వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు మరింత పెరిగాయి. ఇటీవల వైసీపీ నిర్వహించిన వెన్నుపోటుదినం కార్యక్రమంలో పాల్గొన్న శంకరరావు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఎమ్మెల్యే ప్రవీణ్‌ను నేరుగా టార్గెట్ చేయడంతో… ఆయన కూడా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి నంబూరు మీద లెఫ్ట్ రైట్ ఫైరై పోయారు. నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని శంకరరావు అక్రమాలు చేశారంటూ లిస్ట్ చదివారు. అంతటితో ఆగకుండా… వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా నంబూరు శంకరరావు తన ప్రయత్నాలు ఆపలేదని అన్నారు ఎమ్మెల్యే.గతంలో నంబూరుతో పాటు వైసీపీలో ఉన్న నేతలు తర్వాత విభేదించి టీడీపీలో చేరారు. ఇప్పుడు వాళ్ళంతా….ఆయన సైకిలెక్కకుండా చూసే ప్రయత్నంలో ఉన్నారట. అందులో భాగంగానే అంతా… ఎమ్మెల్యే ప్రవీణ్ దగ్గరికి వెళ్ళినట్టు తెలిసింది. నంబూరు శంకరరావు వస్తే మళ్లీ గ్రూపు రాజకీయాలు తప్పవని ఇన్ డైరెక్టుగా ఎమ్మెల్యేకు చెప్పేశారట.
దీంతో ప్రవీణ్ కూడా నంబూరు టీడీపీలోకి రాకుండా చూసేందుకు తన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. తనతో సన్నిహితంగా ఉండే మంత్రి లోకేష్ దృష్టికి జరుగుతున్న పరిణామాలను తీసుకెళ్లారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నంబూరు వ్యవహరించిన తీరు గురించి కూడా వివరించారట. ఇప్పుడు శంకరరావును టీడీపీలో చేర్చుకుంటే కొంతమంది నాయకులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారట. ఇలా శంకరరావు టీడీపీలోకి రాకుండా చూసేందుకు ఎమ్మెల్యే ప్రవీణ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నది లోకల్ టాక్. ఇందులో భాగంగానే శంకర్రావు గత వైఖరి గురించి సోషల్ మీడియాలో వైరల్ చేయిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పనిలో పనిగా ఆయన గతంలో చంద్రబాబు, లోకేష్ మీద చేసిన వ్యాఖ్యల వీడియోలను లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో తెగ షేర్ చేస్తున్నారట. ఇప్పుడు వాటిని ఎలా మర్చిపోతామంటూ…కామెంట్స్ కూడా యమ జోరుగా వస్తున్నట్టు సమాచారం. టీం సోషల్ మీడియా పెదకూరపాడు పేరుతో నంబూరు శంకరరావు గతంలోఅన్న మాటల్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తం మీద నంబూరు శంకరరావు, బాష్యం ప్రవీణ్ మధ్య జరుగుతున్న వార్ నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. మామా అల్లుళ్ళ సవాల్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.