AICC ఇంఛార్జ్ సమక్షంలోనే నేతలు ఘర్షణ పడ్డారు. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇది కొత్తేమి కాదు. కానీ ఆ ఇద్దరు నాయకుల వైరం వెనక ఏం జరుగుతోంది?
సూర్యాపేట కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు..!
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే పార్లమెంటు వారీగా సమీక్షా సమావేశాలకు మొగ్గు చూపుతున్నారు. కోదాడలో ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం పెద్ద రచ్చకే దారితీసింది. నియోజకవర్గానికి సంబంధం లేదని కొందరిని సమావేశానికి రావద్దని ఆదేశించారు ఓ నేత. దీంతో దారిలో ఉన్న నేతలు వెనక్కి వెళ్లిపోయారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. అసలు తలనొప్పి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులను పిలవకపోవడంతో రచ్చ రచ్చ అయ్యింది. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ అంతర్గత కలహాలే తాజా వివాదానికి కారణంగా తెలుస్తోంది. సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి.. పార్టీ నేత పటేల్ రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రమేష్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు దామోదర్‌రెడ్డి ఆరోపించారు. దీంతో వివాదం మొదలైంది.
రేవంత్ వర్గాన్ని అడ్డుకునే ఎత్తుగడ..!
నల్గొండ పార్లమెంట్ సమీక్ష సమావేశానికి పటేల్ రమేష్ రెడ్డికి ఆహ్వానం లేదట. 2018 ఎన్నికల నుంచి రమేష్ రెడ్డికి.. దామోదర్‌రెడ్డికి మధ్య వైరం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ నాదే అంటూ రమేష్ రెడ్డి పని మొదలుపెట్టారు. ఇటీవల హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో 220 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కూడా. పార్టీ పిలుపిచ్చిన పాదయాత్రలో పాల్గొనడం కాంగ్రెస్‌కు ఎలా వ్యతిరేకం అవుతుందనేది ఆయన ప్రశ్న. అయితే ఈ గొడవ వెనుక కారణాలు వేరని కొందరి టాక్. నల్గొండ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి తన నియోజకవర్గంలోకి రేవంత్ మనుషులని రాకుండా అడ్డుకుంటున్నారనేది రమేష్ రెడ్డి వర్గం ఆరోపణ. డిసిసి అధ్యక్ష నియామకాన్ని పెండింగ్‌లో పెట్టారు. పైగా పీసీసీ చీఫ్‌కు రమేష్‌రెడ్డి సన్నిహితుడు. వచ్చే ఎన్నికల్లో తనకు రేవంత్ టికెట్ ఇప్పిస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే దామోదర్‌రెడ్డిని ముందు పెట్టి రేవంత్ వర్గాన్ని సూర్యాపేటలో ఆపుతున్నారని తెలుస్తోంది.
టీ కాంగ్రెస్‌లో అంతర్గత పంచాయితీల హీట్..!
సూర్యాపేట డీసీసీని రేవంత్.. సికింద్రాబాద్ డీసీసీని ఉత్తమ్ ఆపేశారని పార్టీలో చర్చ సాగుతోంది. ఎవరి నియోజకవర్గంలో వాళ్ల నిర్ణయం ఫైనల్ అయినప్పుడు మిగిలిన చోట్ల ఎందుకు జోక్యం చేసుకుంటారనే ప్రశ్న పార్టీ వర్గాల్లో ఉంది. సూర్యాపేట వివాదం వెనక టీ కాంగ్రెస్‌లో అంతర్గత పంచాయితీలు కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. సమస్య తీవ్రత ఎలా ఉంటుందో ఇంఛార్జ్ కూడా స్వయంగా రుచి చూశారు. మరి.. ఇంఛార్జే పరిష్కారం సూచిస్తారో.. లేక సమావేశం ఏదైనా పంతాలకే ప్రాధాన్యం ఇస్తారో కాలమే చెప్పాలి.