ప్రభుత్వంలో ఉండి అదే ప్రభుత్వం పై గవర్నర్ కు ఫిర్యాదు చేయటం వెనుక మతలబు అదేనా…వచ్చే ఎన్నికల్లో బరిలో నిలబడే వ్యూహంలో భాగంగానే ఆ ఉద్యోగ సంఘం నాయకుడు ఎత్తులు వేస్తున్నారా… ఏ పార్టీ నుంచి, ఏ సెగ్మెంట్ నుంచి బరిలో ఉండాలనేదీ ఆయనకు క్లారిటీ వచ్చేసిందా… ఉద్యోగ సంఘ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
రూ.500 కోట్లు ప్రభుత్వం వెనక్కి తీసుకుందని..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం… ఏకంగా రాష్ట్ర సర్కారుపైనే గవర్నర్‌కు ఫిర్యాదు చేయటం హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై ఇటు ప్రభుత్వ, అటు ఉద్యోగ వర్గాల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక, సర్వీస్ ప్రయోజనాలు పెండింగులో ఉంటున్నాయనీ, జీపీఎఫ్ ఖాతాల్లో ఉన్న ఉద్యోగుల సొమ్ము దాదాపు 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఉద్యోగులకు తెలియకుండా వెనక్కి తీసుకుందనీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు నెలనెలా ఒకటవ తేదీనే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఖాతాల్లో వేసే విధంగా ఒక చట్టం తీసుకుని రావాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో ఈ అంశాన్ని కూడా పొందుపరిచారు.
ప్రభుత్వంపై క్రిమినల్ కేసు పెడతానడంపై విమర్శలు
ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే. అదే ప్రభుత్వంపై గవర్నర్‌కు ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేయటం అనూహ్య పరిణామం. ఏ ఉద్యోగ సంఘం అయినా, ఉద్యోగులు అయినా తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఏదో ఒక రూపంలో నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది. అయితే అదే సమయంలో ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి, మంత్రుల పై రాజకీయ నాయకుల్లా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే సూర్య నారాయణ గవర్నర్‌కు ఫిర్యాదు చేయటమే కాకుండా, అవసరమైతే ప్రభుత్వంపై క్రిమినల్ కేసు కూడా పెడతానని అనడాన్ని మిగిలిన ఉద్యోగ సంఘాలు తప్పుబడుతున్నాయి.
బీజేపీ, బీఆర్ఎస్ వర్గాలతో సన్నిహిత సంబంధాలు
సూర్య నారాయణ ఈ స్థాయిలో ఎందుకు ముందుకు వెళ్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఆయనకు బీజేపీ, బీఆర్ఎస్ వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉండాన్ని ఈ చర్చల్లో ప్రస్తావిస్తున్నారు. సూర్యనారాయణ వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసే ఆలోచనలో ఉన్నారన్న టాక్ జరుగుతోంది. దీనిలో భాగంగానే ప్రభుత్వంపై దూకుడుగా వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంలో ఉన్నారని ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. Spot
2014 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీకి ప్రయత్నం
2014 ఎన్నికల్లోనే విజయవాడ సెంట్రల్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలని ప్రయత్నించారట సూర్యనారాయణ. అయితే ఆ తర్వాత వైసీపీతో కూడా కొంతమేర సన్నిహిత సంబంధాలు నెరపారని టాక్. వైసీపీ టికెట్‌పై 2019 సమయంలో విశాఖ సౌత్ నుంచి బరిలో నిలవాలని భావించారనీ, అయితే ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో వెనక్కు తగ్గారనీ ప్రచారం కూడా జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలు సందర్బాల్లో ఎమ్మెల్సీ పదవి ఆశించారనీ, వచ్చే ఎన్నికల్లో వైసీపీ బీ ఫార్మ్‌పై నిలబడాలని ఉందనీ, పార్టీలోని పెద్దలను కూడా కలిసి విజ్ఞప్తి చేశారన్న ప్రచారం ఉంది. ఈ కోరికలకు కూడా వైసీపీ నుంచి సానుకూల స్పందన రాలేదట. దీంతో క్రమంగా సూర్యనారాయణ వ్యవహార శైలితో మిగిలిన సంఘాలకు, వైసీపీ వర్గాలకు మధ్య గ్యాప్ వచ్చిందట. Spot
సూర్యనారాయణ పథకం ప్రకారమే పావులు!
ప్రభుత్వ పెద్దల దగ్గర తనకు ప్రాధాన్యత తగ్గటంతో, తాను కోరుకున్న పదవులు రాకపోవడంతో… పూర్తి స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక వైఖరి తీసుకోవాలనుకుంటున్నారని ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల బరిలో నిలవాలనే నిర్ణయానికి వచ్చాక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారట సూర్యనారాయణ. ఆ విధంగా హైలైట్ కావడమే ఆయన టార్గెట్ అంటున్నారు. పొలిటికల్ ఎంట్రీ కోసం సూర్యనారాయణ చేస్తున్న ప్రయత్నాలు ప్రభుత్వ చెవికి చేరాయట. దీనికితోడు NGOలు సూర్యనారాయణ మీద సీఎస్‌కు ఫిర్యాదు చేయడం, ఆయన సొంత శాఖలో ఉన్నతాధికారులతో గొడవలు వంటివి అసలుకే ఎసరు తెచ్చేలా ఉన్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈసారి ఎలాగైనా అధ్యక్ష అనాలనే గట్టి పట్టుదలతో ఉన్న సూర్యనారాయణ పథకం ప్రకారమే… పావులు కదుపుతున్నారట. మరి ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.