Off The Record: ఢిల్లీ వాళ్ళు చెప్పనీ.. గల్లీ వాళ్ళు చెప్పనీ.. ఎవ్వరైనా సరే.. డోంట్ కేర్. అస్సలు తగ్గేదేలే. మా కొట్లాటలు మావే. పార్టీ ఏమైపోతే మాకెందుకని ఆ లీడర్స్ ఇద్దరూ అంటున్నారా? నియోజకవర్గ కాంగ్రెస్ నిలువునా చీలినా, డోంట్ కేర్ అంటున్న ఆ నాయకులిద్దరూ ఎవరు? అత్యంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా సిల్లీగా కీచులాటలకు దిగుతున్నారెందుకు? మేమంతా ఒక్కటేనని గ్రూప్ ఫోటోకు ఫోజులిచ్చినంత సేపు కూడా ఎందుకు కలిసి ఉండలేకపోయారు?
Read Also: Off The Record: ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను ఎందుకు పిలిచారు..?
వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో వైరం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యే మేఘారెడ్డి , ప్లానింగ్ కమిటి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మధ్య వర్గపోరు అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఇక్కడి పరిణామాలపై సియం రేవంత్ రెడ్డితో పాటు అధిష్టాన పెద్దలు ఫోకస్ పెట్టి ప్యాచప్ కోసం ప్రయత్నిస్తున్నా… ఏమాత్రం ఉపయోగం ఉండటం లేదట. మేలో వనపర్తి కాంగ్రెస్ నేతలంతా ఒకే వేదికపై తళుక్కుమని మేమంతా ఒక్కటే , మాది కాంగ్రెస్ ఫ్యామిలీ, మా మధ్య పొరపొచ్చాల్లేవ్… అన్నిటినీ విమ్ బార్‌తో వాష్‌చేసి పడేశాం… ఇక నుంచి అన్నీ మెరుపులే చూస్కోండంటూ… బిల్డప్‌లు ఇచ్చారు. అంతేనా… అంతా కలిసి చేయి చేయి పట్టుకుని ఓ గ్రూప్ ఫోటో కూడా దిగేసి జనం మీదికి వదిలారు. ఆ దెబ్బకు అంతా అబ్బో… అనుకున్నారట. అయినా… నమ్మని వాళ్ళు కొందరైతే… నమ్మినట్టు నటించిన వాళ్ళు మరికొందరు. అలా, వాళ్ళందరి అంచనాలు ఏ మాత్రం తప్పకుండా… ఇది మా కల్చర్, డీఎన్‌ఏ ప్రాబ్లం. ఇదెలా పరిష్కారం అవుతుందంటూ.. గ్రూప్ ఫోటో దిగి నెల కూడా గడవక ముందే… తూచ్ అంటూ తలో రీతిన వ్యవహరించడం మొదలుపెట్టారట. ఇది చూసిన హస్తం శ్రేణులే అవాక్కవుతున్నాయట. మేలో దిగిన ఫోటో మాదిరిగా అంతా ఉంటే ఎంత బాగుండునని అనుకుంటున్నారట ఎక్కువ మంది. అంతలోనే… సర్సర్లే… ఎన్నెన్నో అనుకుంటాం అన్న బాలకృష్ణ సినిమా డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుని తమలో తామే సర్ది చెప్పుకుంటున్నట్టు సమాచారం. వనపర్తి కాంగ్రెస్‌లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో వర్గపోరుకు బీజం పడింది.
మాజీ మంత్రి చిన్నారెడ్డిని కాదని మేఘారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడంతో ముసలం మొదలైందంటున్నారు. ఆ తర్వాత చిన్నారెడ్డికి రాష్ట్ర ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టినా…. ఆయన మాత్రం నియోజక వర్గానికే పరిమితం కావడంతో ప్రోటోకాల్ సమస్యతో పాటు వర్గపోరు ముదిరి పాకాన పడిందని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ క్రమంలో కొత్త, పాత అంటూ పార్టీ చీలినట్టు చెప్పుకుంటున్నారు. పాత కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యే మేఘారెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది చిన్నారెడ్డి టీం. మరో పక్క చిన్నారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపు కోసం పనిచేశారని, అసలు ఆయనే వర్గపోరుకు తెరలేపి… గందరగోళం సృష్టిస్తున్నారన్నది ఎమ్మెల్యే మేఘారెడ్డి శిబిరం ఆరోపణ. అందుకే క్రమశిక్షణా కమిటీ చైర్మన్ పదవిని మరొకరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామ క్రమంలో మేఘారెడ్డి, చిన్నారెడ్డి వర్గాలుగా వనపర్తి కాంగ్రెస్‌లో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ వ్యవహారం మీద ఫోకస్ చేసి.. ఇద్దరు నేతలతో మాట్లాడినా పరిస్థితిలో ఏ మార్పు లేదని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు.
Read Also: Sobhita : ఎవరేం అనుకున్నా పట్టించుకోను.. సీక్రెట్ చెప్పిన శోభిత
ఇదిలా ఉంటే, వనపర్తిలో మేఘారెడ్డి చేపట్టిన కార్యక్రమానికి చిన్నారెడ్డి డుమ్మా కొట్టగా ….. చిన్నారెడ్డి నిర్వహించిన కార్యక్రమాల్ని మేఘారెడ్డి లైట్ తీసుకుంటున్నారట. తాజాగా వనపర్తి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల గెలుపే లక్ష్యంగా నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఏఐసిసి కో ఇన్ఛార్జ్ విశ్వనాధన్ పెరుమాళ్ హాజరు కాగా ….. ఆ కార్యక్రమానికి చిన్నారెడ్డి డుమ్మా కొట్టి , పెరుమాళ్‌తో వేరుగా సమావేశమయ్యారు. అలాగే… పిసిసి ప్రదాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య సన్మాన సభకు చిన్నారెడ్డి హాజరవగా….ఎమ్మెల్యే మేఘారెడ్డి లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వర్గ విభేదాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని ఆందోళన పడుతున్నారు కార్యకర్తలు. మరో పక్క లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు పవర్ ఎవరికుంటుందో, ఒక వేళ ఇద్దరు నేతల మధ్య టికెట్ల పంపకాల పంచాయితీ వస్తే….అధిష్టానం ఎలా సెట్ చేస్తుందోనని ఆసక్తిగా చర్చించుకుంటోంది కేడర్. మొత్తం మీద వనపర్తి కాంగ్రెస్ వ్యవహారం అధిష్టానానికి కొరకరాని కొయ్యలా మారిందని అంటున్నారు పరిశీలకులు.