Off The Record: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు కొత్తగా ఆయన్ని ఎందుకు పిలిచారు? పోలీస్ అధికారులు ఆయన నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కేవలం సాక్షిగా పిలిచారా? లేక అంతకు మించిన సంగతులు ఇంకేమన్నా ఉన్నాయా? ఎవరా నాయకుడు? ఆయన గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది?
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పెంచారు తెలంగాణ అధికారులు. ప్రభాకర్‌రావు విచారణ కొనసాగుతున్న క్రమంలో… ఇక ఏ మాత్రం ఆలస్యం కానివ్వకూడదని భావిస్తోందట ప్రభుత్వం. అటు బాధితులు…ఇటు సాక్షులను విచారిస్తోంది సిట్ బృందం. అందులో భాగంగానే… ఇప్పటి వరకు పోలీసు అధికారులు, జర్నలిస్టులను పిలిచి ప్రశ్నించింది దర్యాప్తు బృందం. ఇక ఇప్పుడు రాజకీయ నాయకుల వంతు వచ్చింది. ఆ సిరీస్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌ని సిట్ బృందం పిలిచింది. ఇదే ఇప్పుడు హాట్ హాట్ చర్చలకు కారణం అవుతోంది. అసలు ఆయన్ని ఎందుకు పిలిచారు? అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న నాయకుడిని పిలిచి ప్రశ్నించడమంటే.. అదే చిన్న విషయం కాదు, అసలు ఫోన్ ట్యాపింగ్ కేసుకు, మహేష్‌గౌడ్‌కు సంబంధం ఏంటంటూ రకరకాల చర్చల మొదలయ్యాయి. అయితే… ఆయన కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ఉండి ఉండవచ్చని, ఆ కోణంలోనే బహుశా… సాక్షిగా సిట్ పిలిచి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు జూబ్లీహిల్స్ ఏసీపీ దగ్గర తన వాంగ్మూలం ఇవ్వబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్.
Read Also: Sobhita : ఎవరేం అనుకున్నా పట్టించుకోను.. సీక్రెట్ చెప్పిన శోభిత
అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్ గౌడ్ ఫోన్‌ను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందన్న ఆరోపణలున్నాయి. అందుకే ఆయన నుంచి వివరాలు సేకరించడానికి పిలిచినట్టు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీ ఫోన్ చేసి… మహేష్‌గౌడ్‌ని విచారణకు రమ్మని కోరారట. పోలీసుల అధికారుల పిలుపుతోనే… ఏసీపీ దగ్గర తన వాంగ్మూలం రికార్డ్ చేయడానికి మహేష్ గౌడ్ సిద్ధమైనట్టు తెలిసింది. అటు తాజా విచారణలో కొంత మంది బీజేపీ నేతల పేర్లు కూడా బయటకు వచ్చాయట. దీంతో రేపోమాపో వాళ్ళను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో కీలకంగా పని చేసిన నేతలందరి ఫోన్ల మీద నిఘాపెట్టి విన్నారన్న వాదన ఉంది. ఈ క్రమంలోనే… సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ మొదలుకుని, nsui వరకు అందరూ నేతలు సిట్ ఆఫీస్‌కి క్యూ కట్టే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద పొలిటికల్ లీడర్స్ ఎంక్వైరీతో ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.