Red Bull Ultimate Cricket Challenge: ఇంగ్లాండ్ తో జూన్ 20 నుండి జరగబోతున్న 5 టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా.. భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం అతను టీమ్ ఇండియాలో భాగంగా సిద్ధమవుతున్నాడు. అయితే టెస్ట్ సిరీస్‌కి ముందు రాహుల్ ఒక విభిన్నమైన క్రికెట్ అనుభవాన్ని పంచుకుంటూ కనిపించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తో కలిసి అతను పాల్గొన్న ఈ అనుకోని ఛాలెంజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక ఈ విభిన్నమైన చాలెంజ్‌ను రెడ్ బుల్ సంస్థ నిర్వహించింది. క్రీడలను ప్రోత్సహించేందుకు తరచూ వినూత్న సవాళ్లను రూపొందించే రెడ్ బుల్, ఈసారి భారత్, ఇంగ్లాండ్ సిరీస్ ప్రచార భాగంగా ఇద్దరు క్రికెట్ స్టార్ లను ఛాలెంజ్‌లో పాల్గొనేలా చేసింది. ఇందులో మొత్తం 4 చాలెంజ్‌లను ఏర్పాటు చేసింది రెడ్ బుల్ సంస్థ. అందులో మొదటి చాలెంజ్‌లో కేఎల్ రాహుల్ ఒక 18 వీలర్ల ట్రక్ పై అమర్చిన బౌలింగ్ మిషన్ నుంచి వస్తున్న బంతులను ఆడాల్సి వచ్చింది. మొత్తం 8 బంతుల్లో కలిపి 500 మీటర్ల దూరానికి షాట్లు కొట్టాలనే ఈ సవాలు రాహుల్‌కు సమయ నిర్వహణ, పవర్ ఫుల్ హిట్టింగ్ సామర్థ్యాలను పరీక్షించింది.
అలాగే రెండో చాలెంజ్‌లో బెన్ స్టోక్స్ ఒక సరస్సులో బోటుపై నిలబడి నీటిపై తేలియాడుతున్న ఆరు టార్గెట్లను బంతులతో హిట్టింగ్ చేయాల్సి వచ్చింది. ఇది కచ్చితమైన లక్ష్య నిర్దేశంతో కూడిన సవాలుగా నిలిచింది. దీని తర్వాత రాహుల్, స్టోక్స్ ఇద్దరూ మూడో చాలెంజ్‌లో ప్రత్యేకంగా రూపొందించిన గదులలోకి ప్రవేశించారు. ప్రతి గదిలోనూ ఒక ప్రత్యేకమైన క్రికెట్ పరీక్ష ఎదురైంది. ఇందులో కొన్ని బంతులు వింత కోణాల్లో నుంచి వచ్చాయి. మరికొన్ని అనుకోని సమయాల్లో, మరికొన్ని రబ్బరు, మార్బుల్ వంటి ఉపరితలాలపై నుంచి.. అలాగే కొన్ని బంతులు ప్రతిసారీ భిన్నంగా వచ్చాయి. ఈ గదుల మధ్య ప్రయాణం ఒక్కొక్కటిగా ఆటగాళ్ల సహనాన్ని పరీక్షించింది.
Read Also: Jawahar Navodaya: కొత్తగా ఏడు కొత్త నవోదయ విద్యాలయాలు.. జూలై 14 నుండి ప్రారంభం..!
ఇక చివరిగా “ఫైనల్ బాస్” పేరుతో ఒక అద్భుతమైన సవాలు ఎదురైంది. మొదట కదులుతున్న ఆటోల్లో అమర్చిన టార్గెట్లపై, ఆ తర్వాత కంటైనర్ ట్రక్కులపై అమర్చిన లక్ష్యాలపై, ఆపై భూమిపై ఉన్న టార్గెట్లపై, చివరగా డ్రోన్ ఆక్టోకాప్టర్ ద్వారా గాల్లో తేలిన గాజు టార్గెట్ పై హిట్ చేయాల్సి వచ్చింది. ఈ టార్గెట్ హిటింగ్‌లో మొదటి దశలో రాహుల్, తర్వాతి రెండు దశల్లో స్టోక్స్ మెరిశారు. చివరగా గాజు టార్గెట్‌ను రాహుల్ హిట్టింగ్ చేసి అంతిమ విజేతగా నిలిచాడు.
ఈ వినూత్న ఈవెంట్ ద్వారా కేఎల్ రాహుల్, బెన్ స్టోక్స్ తమ ఆత్మవిశ్వాసాన్ని, మానసిక నైపుణ్యాలను చాటారు. టెస్ట్ సిరీస్‌కు ముందు అభిమానులకు ఒక భిన్నమైన, రసవత్తరమైన అనుభవాన్ని అందించిన ఈ చాలెంజ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.