ముగ్గురు మంత్రులు, అదీ…. ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోల్లో ఉన్న వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది? మంత్రులు గ్లోబల్ సమ్మిట్ బిజీలో ఉంటే… అక్కడ లోకల్‌గా పార్టీ వ్యవహారాలను ఎవరు చక్కబెడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుపు వాతావరణం ఎలా ఉంది? లెట్స్ వాచ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. అలాగే…మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు అధికార పక్షానివే. కొత్తగూడెంలో మిత్రపక్షం సీపీఐ ఎమ్మెల్యే, అటు భద్రాచలంలో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మార్పుతో .. ఓవరాల్‌గా జిల్లా మొత్తం కాంగ్రెస్ చేతిలో ఉన్నట్టే. ఆ లెక్కన చూస్తే… ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకే. కానీ… ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోకుండా, ఎక్కడా తేడా జరక్కుండా మొత్తం పంచాయతీలన్నీ పార్టీ ఖాతాలో పడిపోవాలన్న పట్టుదలతో పని చేస్తున్నారట కాంగ్రెస్ లోకల్ లీడర్స్. ఇక జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అయితే… మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వారి కుటుంబ సభ్యులే సర్వం తామై నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో ఆయన భార్య మల్లు నందిని ఎన్నికల తీరును పర్యవేక్షిస్తున్నారట.
పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉండే నందిని ఇప్పుడు నియోజకవర్గంలో పంచాయతీల గెలుపు బాధ్యతను కూడా భుజాన వేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే భట్టి విక్రమార్క స్వంత గ్రామం స్నానాల లక్ష్మీ పురం ఏకగ్రీవం అయింది. అలాగే…. జిల్లా మొత్తం మీద మధిర నియోజకవర్గంలోనే ఎక్కువ ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో మల్లు నందిని కీలక పాత్ర పోషించినట్టు చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇకపోతే ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ పంచాయతీల్లో పార్టీ గెలుపు బాధ్యత తీసుకున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఒక్క రఘునాధ పాలెం మండలంలో మాత్రమే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ అత్యధికంగా ఏకగ్రీవాలు చేయాలన్న లక్ష్యంతో… ప్రతి గ్రామంలో తన మార్క్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారట యుగంధర్. చివరకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సైతం యుగంధర్ టార్గెట్‌గా ఎదురు దాడి చేస్తున్నారు. తండ్రి అండతో ఆయన విచ్చలవిడిగాగా వ్యవహరిస్తున్నారంటూ అరోపిస్తున్నారు పువ్వాడ. అయితే గతంలో ఎప్పుడూ తుమ్మల కుమారుడు రాజకీయాల్లో ఇంత యాక్టివ్‌గా లేరు.
కానీ… పంచాయతీ ఎన్నికల్లో అంతా తానై నడిపించడం గురించి నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇక్కడ మొత్తం 37 గ్రామ పంచాయతీలకుగాను ఐదు ఏకగ్రీవం అయ్యాయి. ఇకపోతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో అంతా ఆయన మేనల్లుడు దయాకర్ రెడ్డి సారధ్యంలో నడుస్తోంది. ఖమ్మం ఆఫీస్ ఇన్ఛార్జ్ అయిన దయాకర్ రెడ్డి చెప్పిందే పాలేరు నియోజకవర్గంలో జరుగుతుంది. అక్కడ ఇటు పుల్ల అటు కదలాలన్నా ఆయన పర్నిషన్ ఉండాల్సిందేనట. ఈ క్రమంలో దయాకర్‌రెడ్డి కూడా అన్ని పంచాయతీల్ని గెలిపించే దిశగా పావులు కదుపుతున్నారట. ఏం చేస్తావో చెయ్… ఎక్కువ పంచాయతీల్ని కాంగ్రెస్ పార్టీ, అందునా మన వర్గం గెలవాలంటూ మంత్రి పొంగులేటి మేనల్లుడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. రెబెల్స్‌కు మద్దతిస్తున్న కాంగ్రెస్ లీడర్స్‌ని సస్పెండ్ చేయడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. మొత్తం మీద ముగ్గురు ముఖ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కుటుంబ సభ్యులు బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు. మంత్రులు రాష్ట్ర స్థాయి వ్యవహారాల్లో బిజీగా ఉంటే… ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ తరపున పంచాయతీల్లో పార్టీ గెలుపు బాధ్యతల్ని తీసుకున్నారు. అటు కొత్తగూడెంలో మిత్రపక్షం సిపిఐ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ… అక్కడ మాత్రం వ్యవహారం కాస్త తేడాగా ఉందట. నియోజకవర్గంలో సీపీఐ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారిపోయింది. ఇక్కడ మంత్రి పొంగులేటి వియ్యంకుడు, ఎంపీ రఘురామిరెడ్డి కథ నడిపిస్తున్నారు.