Off The Record: వైసీపీ మాజీ మంత్రి రోజా టార్గెట్‌గా టీడీపీ ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారా? ఆడుదాం ఆంధ్ర వ్యవహారాలపై దర్యాప్తు ఒక్కరోజు మాత్రమే జరిగి ఎందుకు ఆగిందో తమ్ముళ్ళు కనుక్కున్నారా? అందుకే అసెంబ్లీ సాక్షిగా దానికి విరుగుడు మంత్రం వేస్తున్నారా? ఆ మంత్రం ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది? ఎవరి ఆట ఎవరు ఆడబోతున్నారు?.. రోజా అంటే ఫైర్…. ఫైర్ అంటే రోజా అన్నట్టు సాగుతూ ఉంటుంది ఈ మాజీ మంత్రి రాజకీయం. పొలిటికల్ ప్రత్యర్థుల మీదికి మాటలు యమ ఘాటుగా దూసుకొస్తూ ఉంటాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి…ఒక విడత మంత్రిగా పనిచేసిన రోజా.. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చేతిలో ఓడిపోయారు. దారుణమైన ఓటమి తర్వాత నెలల తరబడి అజ్ఞాతంలో ఉన్న రోజా… ఇప్పుడిప్పుడే తిరిగి వాయిస్ పెంచుతున్నారు. నోరే తన బలమని నమ్మే ఈ మాజీ మంత్రికి చివరికి అదే శాపమైందని కూడా అంటారు పొలిటికల్ పరిశీలకులు. అధికారంలో ఉన్న ఐదేళ్ళు ముందు వెనక చూసుకోకుండా…. అడ్డగోలుగా మాట్లాడిన మాటలు రోజా స్థాయిని దిగజార్చాయన్నది విస్తృతాభిప్రాయం. ఈ పరిస్థితుల్లో దాదాపు ఏడెనిమిది నెలల సైలెన్స్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆమె తిరిగి గొంతు సవరించుకుంటూ ఉండటంతో…. అలర్ట్ అవుతున్నారట తమ్ముళ్ళు. అప్పుడంటే…వాళ్ళకు పవర్ ఉంది. నోటికొచ్చినట్టు మాట్లాడి కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని చలామణి అయ్యారు. అదే రీతిలో ఇప్పుడు మాట్లాడతానంటే… ఊరుకుంటామా? ఓ ఆటాడేసుకోమూ…. అంటూ ఫైరైపోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ తిరుపతిలో ఫిర్యాదు చేశారు శాప్ చైర్మన్ రవినాయుడు. ఇందులో నాటి మంత్రి రోజాకు భారీగా ముడుపులు ముట్టాయన్నది తమ్ముళ్ళ ఆరోపణ.
Read Also: iQOO Neo 10R: లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ తో ఐకూ నుంచి కొత్త ఫోన్ విడుదల..
అయితే, ఆ దర్యాప్తు ఒక్కరోజు మాత్రమే జరిగాక ఆగిపోయింది. దీంతో ఆ కేసు విషయమై ఇప్పుడు పార్టీ అధిష్టానం మీద వత్తిడి పెంచుతున్నారట జిల్లా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు. అటు అసెంబ్లీ వేదికగా కూడా ఓ ఆటాడేసుకోవాలని డిసైడైనట్టు సమాచారం. సభలో సోమవారంనాడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై టీడీపీ ఎమ్మెల్యేలు పలు ప్రశ్నలు లేవనెత్తారు. వాటికి సమాధానం ఇస్తూ పలు కీలక విషయాలు బయటపెట్టారు మంత్రి రాంప్రసాద్. ఆడుదాం ఆంధ్రా ప్రోగ్రాం కోసం వైసీపీ ప్రభుత్వం 119కోట్ల 19లక్షలు ఖర్చు చేసిందన్నారు. కేవలం 47 రోజుల్లో ఆ మొత్తాన్ని ఖర్చు చేసినట్టు వివరించారు. స్పోర్ట్స్ కిట్స్, టీ షర్టులు, క్యాప్స్, పబ్లిసిటీ కోసం ఒక పద్ధతంటూ లేకుండా ఇష్టానుసారం ఖర్చుచేశారన్నది ప్రధాన ఆరోపణ. గెలిచిన వారికి 12 కోట్లు ఇస్తామని చెప్పారని, ఇప్పటివరకు ఆటగాళ్ల ఖాతాల్లో నిధులు పడలేదన్నారు. వాలంటీర్ల ద్వారా ఫేక్ ఆధార్ కార్టులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించారని, క్వాలిటీ లేని స్పోర్ట్స్ కిట్స్ కొని భారీగా గోల్‌మాల్ చేశారని వివరించారు మంత్రి. వీటన్నిటిపై 45 రోజుల్లో నివేదిక ఇచ్చేలా విజిలెన్స్, సీఐడీ దర్యాప్తునకు ఆదేశించామని, నివేదిక వచ్చాక అవినీతి పాల్పడ్డ ప్రజాప్రతినిధులు, అధికారులందరి వివరాలు ప్రకటిస్తామన్నారు మినిస్టర్ రాంప్రసాద్. అదే సమయంలో ఆడదాం ఆంధ్రపై సిఐడికి ఎప్పుడో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ దర్యాప్తు జరక్కపోవడానికి ఓ బలమైన కారణం ఉందన్న ప్రచారం జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఆ కారణంతోనే రోజా కూడా ఇన్నాళ్ళు తనకేమీ కాదన్న భరోసాగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ ధీమాతోనే.. మళ్ళీ గొంతు సవరించుకుని కూటమి ప్రభుత్వంపై మాటల దాడి మొదలుపెట్టినట్టు అంచనా వేస్తున్నారు.
Read Also: Sai Pallavi : చీరకట్టులో సాయిపల్లవి డ్యాన్స్.. ఎంత ముచ్చటగా ఉందో
ఇక, ఆడుదాం అంధ్ర కార్యక్రమం నిర్వహించినప్పుడు క్రీడలశాఖలో కార్యదర్శిగా ఉన్న ఓ ఐఎఎస్ ఇప్పుడు సీఎం చంద్రబాబు టీమ్‌లో కీలకంగా ఉన్నారని, ఆయన అక్కడున్నంత కాలం తనకేం కాదన్నదే ఇన్నాళ్ళు ఆమె ధీమా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఐడీ దర్యాప్తు కూడా ఒక్కరోజు మాత్రమే జరిగి ఆగిపోవడం వెనక ఈ లింకులేవో ఉండి ఉండవచ్చన్నది తెలుగు తమ్ముళ్ల డౌట్ అట. అందుకనే వాళ్ళు వ్యూహాత్మకంగా…. విషయాన్ని నేరుగా అసెంబ్లీలోనే ప్రస్తావించినట్టు ప్రచారం జరుగుతోంది. సభలో ఒకసారి చర్చకు వస్తే… ఇక ఎవ్వరూ అడ్డుపడబోరని, రోజా విషయంలో ఏ మాత్రం తగ్గకుండా అట్నుంచి నరుక్కురావాలన్నది టీడీపీలోని ఓ వర్గం ఎమ్మెల్యేల అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే అసెంబ్లీ సాక్షిగా ఆటాడుకుందాం..రా.. అంటున్నారట. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రెండుసార్లు ఆడుదాం ఆంధ్ర గురించి ఎమ్మెల్యేలు ప్రస్తావించడం, అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం వెనుక ఉద్దేశం కూడా ఇదేనన్న ప్రచారం జరుగుతోంది. 45 రోజుల్లోనే పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రజా ప్రతినిధులతోపాటు అధికారుల పేర్లు సైతం అసెంబ్లీ సాక్షిగా చెబుతానని మంత్రి అనడం వెనక ఉద్దేశ్యం కూడా ఇదేనని అంటున్నారు. ఈ ఆటలో ఎవరిది పైచేయి అవుతుందో…. ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేస్తారో…. ఫైనల్స్ ఎలా ఉంటాయోనని ఉత్కంఠగా చూస్తున్నారు రాజకీయ పరిశీలకులు.