కండువాలు మార్చారు. పార్టీలు మారారు. క్యాడర్‌ను తీసుకెళ్లారు. ఏకంగా పార్టీ ఆఫీసును కూడా లాగేసుకున్నారు. పార్టీ జెండా మార్చినంత ఈజీగా పార్టీ ఆఫీసు భవనం రంగులూ మార్చేశారు. ఇప్పుడు ఈ భవనం చుట్టూ పినపాక నియోజకవర్గంలో దండయాత్రలు, ఎదురుదాడులు, ఆక్రమణల పర్వం పీక్ లెవల్‌కు చేరింది.
భద్రాద్రి జిల్లా పినపాక నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం పేరుతో మహా రంజుగా రాజకీయం సాగుతోంది. పోటాపోటీగా నేతల చర్యలు…సూటిపోటీ మాటలు అగ్గిరాజేస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, ప్రస్తుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర రావు మధ్య పచ్చగడ్డి వేసినా…వెయ్యకున్నా భగ్గుమంటోంది. తెలంగాణ ఏర్పడిన వద్ద నుంచి ఇదే తంతు.
పినపాక నుంచి రెండు సార్లు ఎంఎల్ఎ గా ఎన్నికయ్యారు రేగా కాంతారావు. పాయం వెంకటేశ్వర రావు మూడు పార్టీల నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. రేగా మాత్రం రెండు సార్లు కాంగ్రెస్ నుంచే అసెంబ్లీకి వెళ్లారు. ఎస్టీకి రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గంలో ఇద్దరూ తలపడ్డారు. ఒక్కోసారి ఒక్కొక్కరు గెలుస్తున్నారు. ఇప్పుడు వారి మధ్య పార్టీ కార్యాలయం గొడవ రచ్చరచ్చ చేస్తోంది.
పినపాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మణుగూర్ కేంద్రంగా గతంలో నిర్మాణం అయ్యింది. దీనికి కిలారు శెట్టి హరిబాబు తండ్రి నాలుగు కుంటల భూమిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చారు. నిర్మాణం తర్వాత ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడిగా ఉన్న సత్యం ప్రారంభించారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో రేగా కాంతారావు కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తరువాత బిఆర్ఎస్ లో చేరిపోయి, అక్కడ విప్ పదవి తో పాటుగా, భద్రాద్రి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరించారు. అయితే పార్టీ ఫిరాయించిన తరువాత రేగా కాంతారావు పార్టీ కార్యాలయాన్ని కూడ తన వెంట తీసుకుని వెళ్లాడు. దీనికి వ్యతిరేకంగా ఆనాడు భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, సీతక్క, పొదెం వీరయ్యలు ఆందోళనలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అది ఆనాటి నుంచి బిఆర్ఎస్ కార్యాలయంగా మారిపోయింది.
2023కి వచ్చేసరికి పాయం వెంకటేశ్వర రావు అప్పటి వరకు బిఆర్ఎస్‌లో ఉండి.. కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. ఇంకేముంది కాంగ్రెస్ ఎంఎల్ఎ గా పాయం గెలిచారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత ఒకప్పుడు కాంగ్రెస్ కార్యాలయంగా వున్న ఆఫీసును తిరిగి స్వాధీనం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఏకంగా కాంగ్రెస్ కార్యకర్తలు పినపాక బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి ఆక్రమించారు. ఆనాడు బిఆర్ఎస్ కార్యాలయంగా ఎలా మార్చేశారో… ఈనాడు అదే కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యాలయంగా మార్చేశారు. నాడు, నేడు పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారన్న స్థానికులు అంటున్నారు.
పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఏకంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ తో పాటు గా రేగా కాంతారావు, సండ్రవెంకటవీరయ్యలు ఆరోపిస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్లి తనను హత్య చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రేగా కాంతారావు ఆరోపించడం కలకలం రేపింది. భవనం తమదంటే తమదంటూ ఇరు పార్టీల నాయకులు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం చివరికి ఉద్రిక్తతకు దారి తీసింది.
అసలు పార్టీ కార్యాలయం ఎవ్వరిది అనేది మాత్రం అక్కడ ఉన్న అధికారులు స్పష్టం చేయాల్సి ఉండగా.. ఆనాడు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ వైపు అధికారులు చేతులు ఊపారు.. నేడు కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ వైపు చేతులు ఊపుతు రైట్ రైట్ అనేలా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద పార్టీ కార్యాలయం వివాదం మాత్రం రెండు పార్టీల మద్య, ఇద్దరు నేతల మధ్య, వివాదంగా మారింది. ప్రశాంతంగా ఉన్న మణుగూర్ లో చిచ్చురేపింది. అయితే కొసమెరుపు ఏమిటంటే.. పార్టీ కార్యాలయం చిచ్చుపై మాత్రం జిల్లాలోని ముగ్గురు మంత్రులు మాత్రం నోరు విప్పడం లేదు.