మారడా… ఆయనిక మారడా….? పార్టీకి, ప్రభుత్వానికి అనవసరమైన డ్యామేజ్ జరిగిపోతోందని ఎంతలా మొత్తుకుంటున్నా…. ఆ ఎమ్మెల్యేకి అర్ధం కావడం లేదా? పవర్‌లో ఉన్నామన్న సోయి లేకుండా… ఎలాపడితే అలా మాట్లాడేసి… ఇష్టానుసారం ప్రవర్తిస్తే…. అంతిమంగా బాధ్యత ఎవరిది? ప్రస్తుతం టీడీపీలో జరగుతున్న చర్చ ఇది. అధికార పార్టీలో అంతలా సెగలు పుట్టిస్తున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఏంటాయన కథ?
కొలికపూడి శ్రీనివాస్…ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే. కూటమి వేవ్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లోనే… అసెంబ్లీ మెట్లెక్కిన నాయకుడు. నియోజకవర్గానికి స్థానికుడు కాకపోయినా… అమరావతి ఉద్యమంలో గొంతుక గట్టిగా వినిపించిన కొలికపూడికి చివర క్షణంలో అదృష్టం వరించి పిలిచి మరీ… టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. పార్టీకి స్థానికంగా బలమైన అభ్యర్థి లేకపోవడం, కుల సమీకరణల్లాంటివి కలిసి వచ్చాయి ఆయనకు. కేవలం నెల రోజుల వ్యవధిలో టికెట్ తగ్గించుకున్న శ్రీనివాస్…
కూటమి హవా కలిసొచ్చి రికార్డు మెజార్టీ సాధించారు. అంతవరకు బాగానే ఉన్నా….టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి… ఏకంగా పార్టీకే తలనొప్పిగా మారారన్నది ఇంటర్నల్ టాక్. మధ్యలో కొంచెం ఆ వ్యవహారశైలి మారిందని భావించినా… తాజా ఘటనతో మళ్లీ రచ్చ మొదలైందా? ఆయన తీరు మారలేదా అన్న చర్చలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలోనే వైసీపీ నాయకుడికి చెందిన అక్రమ నిర్మాణాన్ని కూల్చటానికి డైరెక్ట్‌గా ఎమ్మెల్యేనే పొక్లెయినర్‌తో వెళ్లి రోడ్డుపై హల్చల్ చేయటం రచ్చకు దారితీసింది. ఆ తర్వాత… తాను అధికార పార్టీ ఎమ్మెల్యే అయిఉండీ, తన చేతిలో పవర్ ఉండి కూడా…. రోడ్ల మీద గుంతలు ఉన్నాయంటూ అక్కడే కుర్చీ వేసుకొని కూర్చోవడంతో అసలు ఈయన ఏం చెప్పదల్చుకున్నారన్న చర్చ జరిగింది. తనకు డబ్బులు ఇచ్చినట్టు తహసీల్దార్ ఎవరితోనో అన్నారని తెలిసి… విచారణ జరపాలని కలెక్టర్ కి లెటర్ రాయటం సంచలనమైంది. ఇక తిరువూరులో మద్యం షాపులు తొలగించాలని ఆందోళనకు దిగటం, ఒక మహిళను లైంగికంగా వేధించాడని ఆరోపణలున్న నాయకుడి మీద చర్యల విషయంలో పార్టీ అధిష్టానం స్పందించకపోతే రాజీనామా చేస్తానని అల్టిమేటం ఇవ్వడం లాంటివి కొలికపూడిని వివాదాస్పద వ్యక్తిగా చూపాయని చెప్పుకుంటున్నారు. ఆ వ్యవహారం స్వయంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సీరియస్ అయ్యే వరకు వెళ్ళింది.
దీంతో రెండుసార్లు క్రమశిక్షణ కమిటీ పిలిచి మరీ కొలికపూడికి వార్నింగ్ ఇచ్చినా… ఆయన మాత్రం తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నారన్నది ఎమ్మెల్యే సన్నిహితుల మాట. అలా…వరుస ఘటనలతో విసుగెత్తిన టిడిపి అధిష్టానం తిరువూరులో దేవదత్‌కు నామినేటెడ్ పదవి ఇచ్చి మరీ ప్రోత్సహించిందన్న ప్రచారం ఉంది. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం సైతం ఆయన్ని పలకరించకుండా దూరం పెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉందని గుర్తించిన కొలికపూడి కాస్త సైలెంట్ అయ్యారు. ఎంపీ కేశినేనితో కలిసి ఆయన పని చేస్తున్నారు, అంతా సద్దుమణిగింది అని అనుకుంటున్న సమయంలో మరోసారి తన చర్యలు, మాటలతో వైరల్ అవుతున్నారు తిరువూరు శాసనసభ్యుడు. టీడీపీలో టాప్ టు బాటమ్…. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బద్ద శత్రువుగా భావిస్తారు. అలాంటి వైసీపీ లీడర్‌ని ఎయిర్‌పోర్ట్‌లో కొలికపూడి పలకరించిన వీడియో వైరల్ అయ్యింది.ఆ వీడియో నిడివి ఎనిమిది నుంచి 10 సెకండ్లు మాత్రమే ఉన్నా… దానికి సంబంధించిన చర్చ మాత్రం రాష్ట్రమంతా జరుగుతోంది. మామూలుగా అయితే…. టీడీపీ, వైసీపీ లీడర్స్ మాట్లాడుకోవడం, కలిసి కాఫీలు తాగడం పెద్ద విషయం కాదు.
కానీ… పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్టు… వైసీపీ లీడర్లందు పెద్దిరెడ్డి వేరన్నట్టుగా ఉంటుంది టీడీపీ వైఖరి. సీఎం చంద్రబాబును కుప్పంలో ఓడించేందుకు ఎన్నికలకు ముందు పెద్దిరెడ్డి పెద్ద స్కేచ్చే వేశారన్నది తెలుగుదేశం నాయకుల కోపం. అలాంటి నాయకుడితో… కొలికపూడికి మాటలేంటన్నది సైకిల్ కేడర్ క్వశ్చన్. తాను యాదృచ్ఛికంగా పలకరించానే తప్ప… వేరే కారణం లేదని ఎమ్మెల్యే సంజాయిషీ ఇచ్చుకున్నా… రచ్చ మాత్రం ఆగడం లేదు. ఇక టిడిపి కార్యకర్తల వివాద క్రమంలో… ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి హల్చల్ చేయటంతో పాటు… మీరే గంజాయి అమ్మిస్తున్నారంటూ… పోలీసుల్ని నిలదీయడం అధికార పార్టీ ఎమ్మెల్యేగా కరెక్ట్ కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. పవర్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట పార్టీ మీద, ప్రభుత్వం మీద ప్రభావం చూపుతుందని విషయాన్ని కొలిక పూడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదనే చర్చ జరుగుతోందట టీడీపీలో. ఎమ్మెల్యే విషయంలో ఈసారి అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.