దీపావళి పూట టపాకాయలు పేలడం కామన్. కానీ… ఆ సీనియర్ లీడర్ మాత్రం తన అనుభవాన్నంతా రంగరించి… పేద్ద…టపాసులో మందుగుండును కూరి మరీ… రీ సౌండ్ వచ్చేలా పేల్చారట. కానీ… వెరైటీగా ఆ సౌండ్ ఒక్కో చోట ఒక్కోలా వినిపిస్తోంది. ఇన్నాళ్ళు….. ఈ అలక ఏదైతే ఉందో… అంటూ అలిగీ అలిగీ… ఆయనకే బోర్ కొట్టిందా? లేక రొటీన్‌కు భిన్నంగా కొత్త ప్లాన్ చేస్తున్నారా? ఎవరా సీనియర్? ఏంటి ఆయన తాజా రీ సౌండ్? జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం ఎప్పటికప్పుడు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో రగులుతూనే ఉంది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన గోడు వెళ్ళబోసుకునే క్రమంలో మంత్రి అడ్లూరితో అన్న మాటలు లేటెస్ట్ హాట్. జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని పొలాస ఆలయ పాలకమండలి నియమాకంలో తన వారిని కాదని ఎమ్మెల్యే సంజయ్ సిఫార్సు చేసిన వారిని నామినేట్ చేయడంతో బాగా…. హర్ట్ అయ్యారట జీవన్. తన అనుచరులతో కలిసి ధర్మపురిలో ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వద్దకు వెళ్లిన జీవన్… జగిత్యాల కాంగ్రెస్‌ను కౌలుకు ఇచ్చారా…? మేం పట్టాదారులం… మమ్మల్ని హింసిస్తున్నారు.. రోజూ అలా హింసించడం ఎందుకు? ఒకేసారి పొడవండి… అంటూ సీరియస్ అయ్యారట. దీంతో అక్కడున్న వాళ్లంతా అవాక్కయినట్టు చెబుతున్నారు. పనిలో పనిగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఇద్దరు మంత్రులను ఉద్దేశించి కూడా పరోక్ష వ్యాఖ్యలు చేసారట మాజీ మంత్రి. దీంతో… ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టుగా ఈ పెద్దాయన నా దగ్గరికొచ్చి ఇలా అంటున్నారేంటని డైలామాలో పడ్డ మంత్రి అడ్లూరి వెంటనే తేరుకుని జీవన్‌రెడ్డిని ఓదార్చే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. దీంతో అసలు జీవన్ రెడ్డి వ్యూహం ఏంటన్న చర్చ మొదలైంది. ఆయనది నిర్వేదమా? లేక నిరసనా అన్నది అర్ధం కావడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. జీవన్‌రెడ్డి సీనియర్ లీడర్. పైగా పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు. అలాంటి వ్యక్తి తనకంటే జూనియర్ అయిన నేత దగ్గరకు వెళ్లి ఇలా మాట్లాడం వెనక స్పెషల్ స్కెచ్ ఉందా అంటూ కాంగ్రెస్‌లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తనను వరుసగా రెండుసార్లు ఓడించిన సంజయ్‌కి పార్టీలో, ప్రభుత్వంతో ప్రాధాన్యత పెరుగుతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట జీవన్‌రెడ్డి. దీంతో నియోజకవర్గంతో తన పట్టు నిలుపుకునేందుకు తరచుగా పార్టీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడం, తన ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియడం, ఎంపీగా అదృష్టాన్ని పరీక్షించుకున్నా వర్కౌట్ కాకపోవడంతో వర్రీ అవుతున్నారటఈ పెద్దాయన.
అందుకే తన ప్రాధాన్యత తనకు దక్కేలా ప్రణాళికాబద్దంగా హీట్ పెంచుతున్నట్టు సమాచారం. రెండు నెలలు మౌనంగా ఉండటం, ఉన్నట్టుండి… ఒక్కసారిగా ఏదో బాంబు పేల్చడం ఆయనకు కామన్ అయింది. అటు రాష్ట్ర పెద్దలు పట్టించుకోక… ఇటు క్యాడర్‌కు భరోసా ఇచ్చేలా పనులు చేసి పెట్టలేక ఫ్రస్టేట్ అవుతున్నారట ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. కౌలుదారులు, పట్టాదారులు, ఓనర్లు అనే మాటలకు ప్రత్యర్ధి శిబిరం నుంచి గట్టిగానే కౌంటర్లు పడుతున్నట్టు తెలిసింది. జీవన్‌రెడ్డి ఏమన్నా… కాంగ్రెస్‌లోనే పుట్టారా…? నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నాదెండ్లతో వెళ్ళి కాంగ్రెస్‌లోకి వచ్చారు. అయన పట్టాదారు ఎలా అవుతారు…? ఎదుటివారు కౌలుదారులు ఎలా అవుతారు అంటూ చరిత్ర పాఠాలతో సహా ట్రోల్ చేస్తున్నారట ఆయన వ్యతిరేకులు. గతంలో రకరకాల వివాదాలు రేపిన మాజీ ఎమ్మెల్సీ…ఆ మధ్య పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీటింగ్‌లో తన అనుచరులతో కలిసి ఓట్ చోరీ సరే సీట్ చోరీ మాటేంటి అంటూ కాంగ్రెస్‌ను కలవర పెట్టారు.
తాజాగా మంత్రి అడ్లూరి వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేయడం.. ఒకింత నిర్వేదంతో మాట్లాడటంతో… ఇప్పుడు ఇంకేదో జరగబోతోందన్న డౌట్స్ పెరుగుతున్నాయి పార్టీ వర్గాల్లో. సీనియర్స్ ఉండే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నేరుగా తన అసంతృప్తిని పార్టీ పెద్దలకు చెప్పే అవకాశం ఉన్నప్పటికీ… ఆ పని చేయకుండా ఇలా ఎందుకు సీన్ క్రియేట్ ఎందుకు చేస్తున్నారనేది ఆసక్తిగా మారింది.. పక్కా పాలిటిక్స్‌కు కేంద్రం అనే పేరున్నహస్తం పార్టీలో ఇలా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోకపోతే నడవదు అనే విషయం బాగా తెలిసిన జీవన్ రెడ్డి అందుకు తగ్గట్టే వ్యవహరిస్తున్నారన్నది ఇంటర్నల్ టాక్. తాను పార్టీ నుంచి బయటకు వెళ్తానని హైకమాండ్‌కు హింట్ ఇచ్చేందుకు… ఇక తాడో పేడో తేల్చుకుంటాడు మా సార్ అని అనుచరులు అనుకోవడం కోసమే ఇలా రూట్ మార్చారనే చర్చలు కూడా జరుగుతున్నాయి జగిత్యాలలో. జీవన్ ఆరాటం అంతా… రాబోయే స్థానిక ఎన్నికల్లో తన పట్టు చూపించుకోవడం కోసమేనన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. దేవాలయ పాలకవర్గంలోనే పదవులు ఇప్పించుకోలేని వ్యక్తి తన అనుచరులకు టికెట్లు ఎలా ఇప్పిస్తారు అనే టాక్ బయలు దేరక ముందే తాను అలర్టయ్యారట ఆయన. అనుచరులను కాపాడుకోవడం వరకు ఓకే… లీడర్‌గా అది ఆయనకు తప్పదు. కానీ పార్టీని, నేతలను తన వ్యాఖ్యలతో పదే పదే ఇబ్బంది పెడుతున్న పెద్దాయన వ్యవహారాన్ని పెద్దలు ఓ కంట కనిపెట్టాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది జగిత్యాల కాంగ్రెస్‌లో. పార్టీ నుంచి బయటకు వెళ్తానని జీవన్‌రెడ్డి అనడం నిర్వేదమా…? లేక నిరసనలో భాగమా అనేది వేచి చూడాలి…