Off The Record: గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీ సరికొత్త గేమ్ మొదలుపెట్టిందా? పొలిటికల్‌గా ప్రత్యర్థులను బోనులో నిలబెట్టేందుకు పక్కా స్కెచ్ వేస్తోందా? అందుకే సరిపడా బలం లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో నిలిచిందా? ఇంతకీ కమలం ప్లాన్ ఏంటి? ఎవర్ని ఎలా ఇరికించాలనుకుంటోంది?
Read Also: Off The Record: కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల మాటల వెనక వేరే లెక్కలు ఉన్నాయా..?
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పేరుతో సరికొత్త రాజకీయానికి తెర లేస్తోందంటున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ టార్గెట్‌గా బీజేపీ సరికొత్త స్కెచ్ వేస్తున్నట్టు కనిపిస్తోందన్న చర్చ మొదలైంది రాజకీయవర్గాల్లో. ఈ ఎన్నిక ఫలితాలతో తనను తాను టెస్ట్ చేసుకోవడంతోపాటు… ప్రత్యర్థుల్ని దోషులుగా నిలబెట్టే ప్లాన్ ఉందని, అందుకే బలం లేకున్నా బరిలో నిలబడ్డట్టు కనిపిస్తోందంటున్నారు. ఈ ఎన్నికలో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లే ప్రధాన ఓటర్లు. ఆ పరంగా చూసుకుంటే బీజేపీకి సరిపడా బలం లేదు. కానీ… ఎంఐఎంకు మాత్రం ఎమ్మెల్సీని గెలిపించుకునేంత బలం ఉంది. అయినాసరే…. ఎన్నికను ఆషామాషీగా తీసుకోవడం లేదట కాషాయ దళం. గెలిచే అవకాశం లేకున్నాసరే… హడావిడి విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదట. ఆత్మప్రభోదానుసారం ఓటేయాలని ఇతర పార్టీల కార్పొరేటర్స్ విజ్ఞప్తి చేయడం ద్వారా సరికొత్త పొలిటికల్ డ్రామాకు తెరలేపిందంటున్నారు విశ్లేషకులు. అదే సమయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను ఏకకాలంలో టార్గెట్ చేస్తోంది కమలం. ఆ రెండు పార్టీలు మజ్లిస్ మోచేతి నీళ్ళు తాగుతున్నాయని ఆరోపిస్తోంది. డిపాజిట్ రాదని, ఓడిపోతామని తెలిసి కూడా గతంలో వివిధ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయలేదా? ఇప్పుడు మాత్రం ఎందుకు చేయడం లేదో రాహుల్ గాంధీ, కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. ఈ స్టేట్‌మెంట్స్‌ని చూస్తుంటే…. బలం లేకున్నాసరే… ఏదో పోటీ చేయాలి కాబట్టి చేస్తున్నట్టుగా లేదని, దీన్ని బేస్ చేసుకుని కమలనాథులు పెద్ద స్కెచ్చే వేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్.
Read Also: Off The Record: సైలెంట్ గా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి.. వైలెంట్ గా ఎందుకు మారారు..?
అయితే, దీన్ని భవిష్యత్ అవసరాల కోసం వాడుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఇప్పటికే హైదరాబాద్‌ను మజ్లిస్‌కు రాసిచ్చేయాని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది బీజేపీ. ఆ రెండు పార్టీలు కలిసి రేపు ముఖ్యమంత్రి పదవిని కూడా ఎంఐఎంకే కట్టబెట్టినా ఆశ్చర్యం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు కాషాయ లీడర్స్. దాని ద్వారా…. ఆ మూడు పార్టీలు ఒక్కటేనన్న భావన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారట. ఈ ప్రచారాన్ని ఉధృతం చేయడం ద్వారా… భవిష్యత్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఓటేస్తే… అది ఖచ్చితంగా మజ్లిస్ పార్టీకి వేసినట్టేనన్న ఫీలింగ్ తీసువచ్చే ప్లాన్ ఉందట. జనంలో ఆ అభిప్రాయం బలపడకున్నా… కనీస చర్చ జరిగినా సరే… అది తమకు రాజకీయంగా ఎంతోకొంత ఉపయోగపడుతుందన్నది బీజేపీ నాయకుల ఆలోచనగా చెప్పుకుంటున్నారు. అటు ఆ పార్టీలని టార్గెట్ చేస్తూనే…. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లయిన ఆయా పార్టీల కార్పొరేటర్స్‌తో మైండ్ గేమ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మీరు మళ్ళీ కార్పొరేటర్‌గా గెలవాలంటే… ఇప్పుడు మీరున్న పార్టీల వల్ల కాదని, ఈసారి జీహెచ్‌ఎంసీ మాదేనని, ఇప్పుడు మేం చెప్పినట్టు విని బీజేపీ అభ్యర్థికి ఓటేస్తే… భవిష్యత్‌లో పార్టీ టిక్కెట్ మీకేనని చెబుతున్నారట బీజేపీ లీడర్స్ కొందరు. ఈ ప్రచారంతో ఆ రెండు పార్టీలకు చెందిన కొందరు కార్పొరేటర్స్ టర్న్ అయినా… తమకు ఓటింగ్ పెరుగుతుందని భావిస్తున్నారట బీజేపీ ముఖ్యులు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలో మజ్లిస్ పార్టీ గనక గెలిస్తే… కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసే గెలిపించాయని, వాళ్ళంతా ఒక్కటేనంటూ బోనులో నిలబెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. బీజేపీ గేమ్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.